కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
అర్జునుని యనంతర తీర్థయాత్రా ప్రకారము
సీ. పదియాఱు వన్నె గుబ్బలి రాచకూఁతురు పట్టంపు రాణిగాఁ బరఁగు జాణ
పతి యర్ధదేహంబు సతి యంట నిజముగాఁ బ్రబలు కన్నియఁ గన్న భాగ్యశాలి
ముజ్జగమ్ముఁ బవిత్రముగఁజేయు తీర్థమ్ముఁ గొనసాగఁ జేసిన యనఘమూర్తి
భూమిధరారాతిచే మొక్క వోవని యరిది బిడ్డను గాంచినట్టి మేటి
 
తే. యోషధుల మొలపించిన యుత్తముండు చల్లఁదనముల కెల్ల దీక్షాగురుండు
సకల మాణిక్య రాశికి జననసీమ యీ నగస్వామి సద్గణాస్థానభూమి
127
వ. అని బహుప్రకారమ్ముల హిమగిరి ప్రభావమ్ము వక్కాణించుచుఁ దత్ప్రదేశంబున శాఖాశిఖోల్లిఖిత గ్లావృక్షం బగు నగస్త్య వట వృక్షంబుఁ గనుంగొని, యచట నికట విశంకట కటక కమనీయ మణిశృంగంబగు మణిశృంగంబుంగని, యగణ్య పుణ్యాగమ సమర్థంబగు హిరణ్యబిందు తీర్థమ్మునఁ గృతావగాహుండై, గోహిరణ్య ధరణ్యాది దానమ్ము లనేకంబులు గావించి, ప్రాగ్భాగమున కరిగి, యనేక పట్టణారణ్య గిరి సమూహములు గడచి, యఖిల నరశరణ్యంబగు నైమిశారణ్యంబు సొచ్చి, యచటం గోటి గుణితాంగీకృతానత జనతా సమర్పిత నారాయణుండగు బదరీనారాయణుం బూజించి, మనీషి మనీషిత ఫలప్రదాన శుచి ప్రయాగంబగు ప్రయాగంబున కేఁగి, ముముక్షు జనహృదయంగమంబగు త్రివేణీ సంగమంబునఁ దానంబులుం దానంబులుం గావించి, యచ్చట మాధవు నారాధించి, భవ రసానుభవ భీరు సానుక్రోశం బగు పంచక్రోశంబుఁ బ్రవేశించి, యభ్యర్ణ మణి కర్ణిక యగు మణికర్ణికం గ్రుంకి, యన్నపూర్ణా విశాలాక్షీ సనాథుఁ గాశీవిశ్వనాథుం దర్శించి, తైర్థిక సమాహిత సమ్య గయకు గయకుం జని, యచట నుచిత కృత్యంబులు నిర్వర్తించి, శ్రీపురుషోత్తమ క్షేత్రంబునకుఁ జని, యింద్రద్యుమ్న సరస్సున శిరస్సు మజ్జనంబై, నమజ్జన దృక్చకోర జ్యోత్స్నానాథుని జగన్నాథుని గొలిచి, యాతల గౌతమీ తటినీతోయ స్నాతుండై, జగన్మోహన మనోజ మనో వశీకరణ కారణ కళా ప్రావీణ్య లావణ్య హావభావ ప్రకటన నటన రేఖా శ్లాఘా దూరీకృత రంభోర్వశీ రంభోర్వశీత కిరణ కిరణ నిభ విభారంగ న్మణిరంగ మంటపోజ్జ్వలాసికా కృతలక్షణ కటాక్షవీక్షణ సుధారసధారా సేచన కాసేచితాసేచన కాంగుండై, పాపాటవీ విపాటన పాటవ సంసూచన దీక్షారామ పరమేశ్వరుం డగు ద్రాక్షారామ భీమేశ్వరుం జేరి, జోహారులు నుపహారంబులు సమర్పించి, సంతతానంత కాంతిరంహుండగు నంతర్వేది నృసింహు సేవించి, యందు భవసాగర తరణియగు సాగర సంగమంబునఁ దీర్థంబాడి, కృష్ణవేణ్యాది పుణ్యతరంగిణుల మునింగి, యుత్తుంగ శృంగ విలోకి లోక సాత్కృత సుపర్వ పర్వతంబగు శ్రీపర్వతంబు లోచనపర్వంబుగాఁ జూచి, ప్రణమిల్లి, మల్లికార్జును సమ్మోదమునఁ బ్రణుతించి, తన్మనోఽబ్జ భ్రమరీ విభ్రమ రమ్యయగు భ్రమరాంబం బ్రశంసించి, భక్తశోభన పరంపరా సంపాదక పాదకమల రజోలేశు నహోబలేశు భజించి, నిజభజనరత జన ప్రతిపాదితానశ్వర పదంబులగు శ్రీ వేంకటేశ్వర పదంబులకు నమస్కృతులు విస్తరించి, దుస్తరాంహ స్తూలికా సందోహ దాహ దోహళ నిజాహ్వయ స్మరణ విస్ఫులింగం బగు శ్రీకాళహస్తి లింగంబు నంతరంగంబున హర్షతరంగంబు లుప్పొంగం గాంచి, కాంచీపురంబున కరిగి, కరిగిరీశ్వరుండై విరాజిలు వరద రాజుల నమ్రజన కమ్రఫల దాయకు నేకామ్రనాయకుం బూజించి, యవులఁగావేరి కావేరి కాంతరిత కాంతాంతరీపంబునఁ బ్రసన్న రూపంబునం బాటిల్లు కోటి హరిత్తు రంగధాముని రంగధాముని సేవించి, కుంభఘోణ చంపకారణ్యాది పుణ్యక్షేత్రమ్ము లీక్షించి, దక్షిణ నీరాకర వీచికా నికరశీకర తుందిల మందానిల స్పందనాతి శీతల సికతాతల పిహిత యాతాయాత నిరవధిక పథిక నికాయ కాయమానాయమాన లవల్యేలా వల్లీ వేల్లిత క్రముక ప్రముఖాఖిల శాఖి శాఖా శిఖా లతాంతర కుహర విహరమాణ వివిధ గరుద్రథ కుల కలకలోద్వేల వేలా మనోజ్ఞ మార్గంబున నపవర్గ రామేశ్వరంబగు రామేశ్వరంబునకుం బోయి, సేతు సందర్శనం బొనర్చి, విధూత స్నాతృ పంచజన వృజిన జనుష్కోటి యగు ధనుష్కోటిం గృతస్నానుండై, పాండు సూనుం డందులం దులాపురుషాది మహాదానంబు లాచరించి, రఘువీర భూభుజ భుజాదర్ప దర్పణం బగు రామాయణంబు పారాయణంబు చేసి, భూసురాశీర్వాద సంపదలం బొదలి, యచ్చోటుఁ గదలి, పదుమూఁడవ నెలఁ బాండ్య మహీ మండలాఖండలుం డగు మలయధ్వజుం డేలు మణిపురంబుఁ జేరం బోవు సమయంబున. 128
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )