కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
అర్జునుఁడు పాండ్యరాజ సుత చిత్రాంగదను జూచి విరాళిగొనుట
సీ. మంగళస్నాన సంభ్రమముఁ దెల్పెడి రీతిఁ గెలనఁ గెందామర కొలనఁ దేలి,
ధవళముల్‌ విని చొక్కు హవణుఁ దెల్పెడు లీల హాళిఁగోయిల పల్కు లాలకించి,
తలఁబ్రాలు వోయు బిత్తరముఁ దెల్పెడు చాయఁ గ్రొన్ననల్‌ దోయిళ్ళ కొలఁది నొసఁగి
బువ్వాన భుజియించు పొలుపు దెల్పెడి జాడ గుమిఁ గూడికొని మరందములు గ్రోలి,
 
తే. తనకుఁ దోడ్తోడ నగు పెండ్లి కనఁబడంగఁ జేయునటువలె గారాబుఁ జెలులఁగూడి
వనవిహారంబు గావించి చనెడు పాండ్య రాజ సుతఁ జూచి యాపాండురాజ సుతుఁడు
129
తే. ఈ వెలంది యొడల్‌ పైఁడిలో వెలంది
యీ నెలంత లలాటంబు లే నెలంత;
యీ సుపాణి రదశ్రేణియే సుపాణి;
యీ బిడారు మృగీమద శ్రీబిడారు
130
క. వాతెఱకు నమృతమే తుల;
మే తులకింపుల పిసాళి మిసిమికిఁ గ్రొమ్మిం
చే తుల; చేతుల కబ్జము
లే తుల; లేతుల వెలందు లీ చెలి తులయే
131
క. కన్నె నగుమోము తోడన్‌
బున్నమ చందురుని సాటిఁ బోలుప వచ్చున్‌,
నెన్నుదురుతోడ మార్కొని
మున్నందఱుఁ జూడ రేక మోవక యున్నన్‌
132
క. కమలముల నుజ్జగించున్‌,
గుముదంబుల బుజ్జగించుఁ గొమ చూపులు; పు
న్నమ చందమామ వెలుఁగుల
కొమ రంతయుఁ బుణికి పుచ్చుకొనఁ బోలుఁ జుమీ
133
శా. చెండ్లా గుబ్బలు! జాళువా తళుకులా చెక్కిళ్ల డాల్‌! సింగిణీ
విండ్లా కన్బొమ! లింద్రనీల మణులా వేణీరుచుల్‌! తమ్మి లేఁ
దూండ్లా బాహువు! లింత చక్కఁదన మెందుం గాన! మీ జవ్వనిం
బెండ్లాడంగలవాఁడు చేసినది సుమ్మీ భాగ్య మూహింపఁగన్‌
134
మ. అని "కన్గొంటె విశారదా?" యనిన "నాహా! యే మనన్వచ్చు నో
జననాథాగ్రణి! యీ వినూతన తనూ సౌందర్య మీక్షించినన్‌
దనుఁ దా మెచ్చు విధాత చిత్తమున; నీ తన్వంగితోఁ బోల్పఁగా
నెన లే; దెచ్చటఁ జూడమా తుహిన భూభృ త్సేతు పర్యంతమున్‌
135
క. మలయధ్వజ బాహుజను
స్తిలకుని గారాబుఁబట్టి చిత్రాంగద పే
రలఘు కుల శీల గుణములు
గల దీకన్య యని చెప్పఁగా వింటి నృపా!"
136
క. అన విని మనమునఁ గోర్కులు
కొనసాగఁగ "నీ నృపాలకునితో నెయ్యం
బొనరింప వలయు నేఁ డి
వ్వని నుండుద" మనుచుఁ జొచ్చి వచ్చుచు నుండన్‌
137
సీ. పద్మ రేఖలఁ బొల్చు బాలికా తిలకంబు చరణంబు లూఁదిన తెరువుఁ జూచి
మలయధ్వజతనూజ కొలువు సేసిన జీవ దంతపుఁ జవికెఁ జిత్తరువుఁ జూచి
పొన్న గున్నల నీడఁ గన్నె పుప్పొడి తిన్నె మరుని బూజించిన హరువుఁ జూచి
కొమ్మ కౌఁగిటఁ జేర్ప గోరంట నంటిన మొనగుబ్బ కస్తూరి మురువుఁ జూచి,
 
తే. యీ వనము చేసినదికా యదృష్ట మనుచు రాజసుతుఁడు చిత్రాంగద మై జవాది
కమ్మతావి గుబాళించు తమ్మి కొలని కెలఁకులకుఁ జేరి, యంతంత వలపు మీఱి
138
మ. "తనకున్‌ గౌఁగిలి యీ వొకప్పుడును నాథా! నీ కరస్పర్శనం
బున గిల్గింతలె" యంచుఁ బద్మిని కరాం భోజమ్మునన్‌ మందమం
ద నటద్వాయు చలద్దళాంగుళులు కన్పట్టంగ న వ్వెల్గురా
యని రా! రా! యని పిల్చెనాఁ దగె ద్విరేఫాద్యంత దీర్ఘధ్వనుల్‌
139
ఉ. నా విని హావ భావ పరిణామ విదుండు విశారదుం "డగున్‌
దేవరవార లిందు నరుదే శకునమ్ములు మంచి వయ్యె; వే
రావలె శోభ నోత్సవ పరంపర లిప్పుడు; చూడుఁ" డంచు నె
త్తావుల దీవులై తనరు తామర మొగ్గలు రెండొసంగినన్‌
140
తే. అదియు నొక శకునంబుగా నధిపుఁ డంది
"చేతి కందిచ్చి నట్లనె చేకుఱంగఁ
గలదు వలిగుబ్బి గుబ్బెత చెలిమి" యనుచు
నాత్మలో నెంచి యా భావ మపనయించి
141
చ. "నెల యుదయించునప్పు డల నీరజముల్‌ కుముదంబు లౌను రేల్‌,
కలువలదాయ రాకకుఁ బగల్‌ కుముదంబులు నీరజంబు లౌఁ,
దలఁపఁగ నింత వింత గలదా!" యని కందువ మాట లాడుచున్‌,
"బళిర! కిరీటి" మీఱెఁ దన ప్రౌఢి విశారదుఁ డెన్నుచుండఁగన్‌
142
ఉ. అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నేఁ
గంగఁ దలంచునంత మును గల్గఁగ దాసులు వట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగిఁ గనంబడెఁ బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధరాగ్రములఁ దోయజ శాత్రవ మిత్ర బింబముల్‌
143
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )