| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| సాయంకాల శోభ | ||
| క. |
ఒక మెట్టు తరణి డిగ్గిన నొక మెట్టు శశాంకుఁ డెక్కు; నుర్వీ స్థలిలో నొక రాజు సన్నగిల్లిన నొక రాజంతంతకున్ మహోన్నతిఁ గనఁడే! |
144 |
| చ. |
క్షితిపయి వట్టి మ్రాఁకులు చిగిర్ప, వసంతుఁడు తా రసోపగుం ఫిత పదవాసనల్ నెఱప, మెచ్చక, చంద్రుఁడు మిన్నునం బ్రస న్నతయును, సౌకుమార్యముఁ గనంబడ ఱాల్ గరఁగంగఁజేసె; నే గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా! |
145 |
| చ. |
వెడ విలుకానికిన్ జెఱకు విల్లును, గల్వల కోరి, కోరికల్ గడలుకొనంగ నామనియుఁ, గల్వలరాయఁడు నిచ్చి మన్ననం బడయుడు, వాని కెక్కుడుగ మౌర్వులు తామును గాన్క తెచ్చెనా బడిబడి గంధలుబ్ధ మధుపంబులు రాఁజనుదెంచెఁ దెమ్మెరల్ |
146 |
| చ. |
ఒక చిగురాకుఁగొమ్మఁ బిక, మొక్క ప్రసూన లతాగ్రసీమఁ దేం, ట్లొక ఫలశాఖ రాచిలుకయున్ రొద సేయఁగ, గాడ్పు పొందు వా యక పయి వెన్నెలల్ పొలయ నామని సొంపుల నింప జొంప మౌ నొక యెలమావిక్రింద మరుఁడో యనఁగా నరుఁడుండె నయ్యెడన్ |
147 |
| క. |
విధు చకచకలును, బుండ్రే క్షు ధనుర్ధరు నంప సెకలు, శుక పిక శారీ మధులిట్టులు మలయానిల మధు లిట్టులు తనదు ధైర్యమహిమఁ గలంపన్ |
148 |
| చ. |
"చందన గంధి నెన్నుదురు చందురులో సగఁబాల; బాల ము ద్దుం దెలి చూపు లంగజుని తూపుల లోపల మేల్తరంబు; లిం దిందిరవేణి మోవి యెలదేనియలో నికరంపుఁ దేట యే మందము! మందయాన మొగ మందము మీఱు నవారవిందమున్ |
149 |
| ఉ. |
బంగరు బొంగరాల పరిపాటి చనుంగవ; మీల సూటి త ళ్కుఁ గనుదోయి; చంద్రు ప్రతికోటి మొగం; బెలదేఁటి ధాటిక న్నంగడు మేటి వేణి; పులినంబుల సాటి పిఱుం; దయారె! చి త్రాంగద పాటి జోటి గలదా?" యని మెచ్చుఁ గిరీటి మాటికిన్ |
150 |
| క. |
ఈ కరణి దలంచుచు నా ళీక నిభానన నెదన్ నిలిపి రే గడపెన్; లే కెటుల నిద్ర వచ్చున్ రేకగు నయ్యువిద నెదను నిల్పిన దాఁకన్ |
151 |
| తే. |
అపుడు నృపుఁడు ప్రఫుల్ల నవాంబుజ ప్ర సన్న ముఖుఁడయి "మలయధ్వజ క్షితీశ కమలహితునకు మామకాగమన వార్తఁ దెలుపు" మనుచు విశారదుఁ బిలిచి పనిచె |
152 |