| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| విశారదుఁడు పెండ్లి రాయబారము నడపుట | ||
| చ. |
పనిచిన నేఁగి, యాతఁడు, నృపాలుని మంత్రి ముఖాంతరంబునం గనుఁగొని "యంత్ర మత్స్యము జగం బెఱుఁగన్ భుజశక్తి నేసి జ వ్వనిఁ గయికొన్న యర్జునుఁడు వచ్చిన వాఁడిదె తీర్థయాత్రగా, జనవర!" యంచు విన్నపము సల్ప ససంభ్రమ చిత్తుఁడై తగన్ |
153 |
| క. |
తన నగరు వంటిదే చ క్కని నగరొక టాయితంబు గావించి పురం బు నలంకరింపఁగాఁ జే సినవాఁడై యపుడు సకల సేనలు గొల్వన్ |
154 |
| చ. |
ఎదురుగ వచ్చి పాండ్య ధరణీశ్వరుఁ డర్జునుఁ గాంచి "నేఁడుగా సుదినము! మీరు రాఁ గలుగు శోభన మెన్నఁడు గల్గుఁ; బ్రోలికిం బదుఁ" డని యిద్దఱున్ దొఱసి భద్రగజంబుల నెక్కి వచ్చి రిం పొదవ హళాహళిం గడకు నొత్తెడు ఫౌఁజుల దిక్కు సూచుచున్ |
155 |
| తే. |
రాజ వీథుల నెసఁగ నీరాజనములు, కటికవా రెచ్చరింప నైకటిక భూమి, వంది జనములు పొగడఁ జెల్వంది మిగులఁ బురము సొత్తెంచె విజయుఁ డబ్బురము గాఁగ |
156 |
| క. |
నెట్టుకొని నరుని గనుచోఁ బట్టణమునఁ గల సమస్త భామల కహహా! యెట్టి విచిత్రమొ! మనసునఁ బుట్టినవాఁ డపుడు మనసుఁ బుట్టించెఁ జుమీ! |
157 |
| ఉ. |
"చక్కఁదనంబు రూపునఁ బొసంగుటె కాదు; గుణంబులందునున్ జక్కఁదనంబు గల్గు నెఱజాణ; జగంబుల నీడు లేని నా చక్కని కూఁతునుం దొఱయఁ జాలినవాఁ; డితఁడల్లుఁడైనఁగా మిక్కిలి కీర్తి గల్గు?" నని మెచ్చు మనంబున రాజు సారెకున్ |
158 |
| చ. |
అడు గడుగందునున్ మణిపురాధిపుఁ డిట్లుచితోపచారముల్ కడు నొనరించి యుద్వహన కౌతుక హేతు కళావిశేషమౌ విడిదికిఁ దెచ్చి, నిల్పి, యతివిస్మయ మందఁగ విందు, వీడుకో, లుడుగరలున్ ధనంజయుని యుల్లము రంజిలఁ జేసె నెంతయున్ |
159 |