| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| ఆశ్వాసాంతము | ||
| మ. |
సరసాగ్రేసర! వాసరప్రభు తనూజ స్థూలలక్షా! పురం దర జిద్భోగ ధురంధరా! భరతశాస్త్ర ప్రౌఢ మార్గైక లా స్య రసాస్వాదన కోవిదా! శ్రవణ భూషా దివ్యరత్న త్విషా తరణి శ్రీకర గల్లభా! విభవ భృత్తంజాపురీవల్లభా! |
160 |
| క. |
యాచనక వినుత! వనితా సేచనక మనోహరాంగ! శృంగార కళా సూచన కమ్ర కవిత్వా లోచన కందళిత హర్ష లోలుప హృదయా! |
161 |
| క. |
తరుణీ మన్మథ! యాశ్రిత భరణ గుణాభరణ! శౌర్య బహు రాజ్య ధురం ధర! సత్యాదిమ చక్రే శ్వర! యభినవ భోజరాజ వర బిరుదాంకా! |
162 |
| తోటక. |
అతులాగమ శాస్త్ర నిరస్త సురే జ్య! తులాధిక విద్వ దవాప్త శత క్రతులాభ! శుభోదయ కారణ ర త్న తులాపురుషాదిక దానచణా! |
163 |
| గద్యము. | ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ ప్రసిద్ధ సారస్వత సుధాసార జనిత యశోలతాంకూర చేమకూర లక్ష్మణామాత్యతనయ వినయ ధురీణ సకల కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాలదత్త హస్తముక్తాకటక విరాజమాన వేంకట కవిరాజ ప్రణీతంబయిన విజయవిలాసంబను మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము | 164 |