కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
క. శ్రీధుర్య శౌర్య! ధైర్య
క్ష్మాధర మూర్ధన్య! యాది గర్భేశ్వర! వి
ద్యాధిక! వితరణ దీక్షా
రాధాసుత! యచ్యుతేంద్ర రఘునాథ నృపా!
1
తే. అవధరింపు కథాకర్ణనాతివేల
హర్షు లై నట్టి దివ్య మహర్షులకును
తత సమస్త పురాణ కథా శతాంగ
సూతుఁడై విలసిల్లెడు సూతుఁ డనియె
2
విశారదుఁడు మలయధ్వజుని యాశయము నర్జునునకు విన్నవించుట
ఉ. ఆ చెలువంపు రాకొమరుఁ డంత వయస్యుని జూచి యింపుతో
"నీ చతురత్వ, మీ వినయ, మీ యుచితజ్ఞత యెందునేనియుం
జూచితె? మైత్రికిం దగిన చోటగు; శోభనపుం బ్రసంగమున్‌
సూచన చేసి రాజు మది చొ ప్పెఱుఁగన్‌ వలదా విశారదా?"
3
మ. అనినన్‌ "మీ మదిలోఁ దలంచినది మేలౌ; సిద్ధసంకల్పు లీ"
రని యావేళనె చిత్రవాహనుఁడు కొల్వై యుండఁగాఁ బోయి యా
యన "రా రమ్మ"ని గారవించి సుముఖుండై "రాజుగా రిప్పు డే
మనినా? రెయ్యది వార్త?" యంచుఁ బయిపై నాసక్తితోఁ బల్కఁగన్‌
4
చ. "అవనితలేంద్ర! మా విభుని హర్ష మదేమని విన్నవింతు? సం
స్తవ మొనరించి రింతవడి సామిచరిత్రమె వేయినోళ్ళ; న
ర్ణవపతితోడ బాంధవ మొనర్చిన మాధవు లీలఁ దారు బాం
ధవ మొనరింపఁ జిత్త మిడినారు గుణాంబుధు లీరు గావునన్‌"
5
క. నా విని సంతోషము మది
నావిర్భవ మొంద "నా మహారాజునకున్‌
దేవేరిగ నా కన్నెన్‌
బావన గుణ నీయఁ గనుట భాగ్యము గాదే?
6
చ. కల దొకమాటఁ దెల్పఁగల కార్యము; తొల్లి ప్రభాకరుండు నాఁ
గలఁ డొకఁ డస్మదీయ కులకర్త; యతం డనపత్యుఁడై యచం
చలమతి శంకరుం గుఱిచి చాలఁ దపం బొనరింప నంతటన్‌
'గలుగుఁ గుమారుఁ డొక్కొకఁడుగా' నని యిచ్చె వరంబు వేడుకన్‌
7
క. అంగజ హరుని ప్రసాదము
నం గలుగుచు వచ్చె సుతుఁడు నాఁ డాదిగ మా
వంగడమున; నది యిప్పుడు
వెంగడమై కూఁతు రుద్భవించె న్నాకున్‌
8
క. ఆ దుహితఁ గుమారుని మ
ర్యాదగఁ జూచికొని యుందు; నా కన్నియకున్‌
బ్రాదుర్భవించు వానిన్‌
నాదు కులంబునకు వలయు నాథుని జేయన్‌
9
క. కా దనరా దీకార్యము;
జాదులును బ్రసాదమౌ విశారద! నాకున్‌
నాదు హితం బొనఁగూరిచి
నా దుహితం బెండ్లి సేయు నరనాథునకున్‌"
10
తే. అని యతనిఁ బంచె; నా మాట కర్జునుండు
సమ్మతించె; ముహూర్త నిశ్చయము నయ్యె;
హితుఁ డన విశారదుఁడె కాక యెందుఁ గలరె?
కోర్కి వెలయంగ దొరఁ బెండ్లికొడుకుఁ జేసె
11
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )