| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| చిత్రాంగదా వివాహ మహోత్సవము | ||
| క. |
సుత్రామ నిభుఁడు పాండ్య ధ రిత్రీ విభుఁ డానతీయ, శృంగార కళా చిత్రాంగద యుత యగు నా చిత్రాంగదఁ బెండ్లికూఁతుఁ జేసిరి కాంతల్ |
12 |
| క. |
గరిత లలంకృతి సేయఁగ గరువపు మురు వపుడు హెచ్చి కన్నియ దనరెన్; బరిణయపుం గై సేఁతల నరపతి యొఱ పతిశయిల్లు నటనఁ జెలంగెన్ |
13 |
| మ. |
తన వంశంబు నృపాలు పెండ్లిఁ గను తాత్పర్యంబునన్ వచ్చెనో యనఁ జంద్రుం డలరెన్; గిరీటి సుముఖుండై యంతఁ గైసేసి తె చ్చిన భద్రేభము నెక్కి ఠీవిమెయి వచ్చెన్ బాండ్యభూపాలు లో చనముల్ చల్లఁగఁ, గ్రొత్త ముత్తియపు సేసల్ జవ్వనుల్ చల్లఁగన్ |
14 |
| చ. |
నలుగడ హృద్య వాద్య నటనం బొలయన్, గపురంపు టారతుల్ వెలయ, ద్విజశ్రుతుల్ చెలఁగ, విప్ర వధూ శుభ గాన లీల శో భిలఁగ వివాహవేదికకుఁ బెండ్లికుమారుఁడు వచ్చె నిట్టు; లా వల నల పెండ్లి కూఁతురును వచ్చె రణచ్చరణాంగదంబులన్ |
15 |
| శా. |
పంకేజాతములన్ దిసంతు లడచున్ బాలామణీ పాదముల్; వంకల్ దీర్చు మనోజ సాయకములన్ వాల్చూపు; లేణాంకునిన్ శంకల్ సేయు మొగంబు; జక్కవకవన్ జక్కట్లు దిద్దుం గుచా హంకారంబు; మదాళిమాలికల నూటాడించు వేణీ రుచుల్ |
16 |
| క. |
హరిపతి నడుమున కూడెన్; గరువపు నడకలకు నోడె గజపతి; యిఁక నీ నరపతి లోనగు టరుదే వరవర్ణిని మెఱుఁగు వాఁడి వాల్చూపులకున్? |
17 |
| ఉ. |
"చక్కని కన్యకామణికిఁ జక్కనివాఁ డగు ప్రాణనాథుఁడున్, జక్కని శోభనాంగునకుఁ జక్కని యింతియుఁ గల్గు టబ్బురం బెక్కడ, నిట్టు లుండవలదే! రతిదేవికి సాటి వచ్చుఁ బో యి క్కనకాంగి; మన్మథున కీ డితఁ డీడిత రూపసంపదన్" |
18 |
| క. |
అని రూప కళలఁ జూపఱు గొనియాడఁగఁ, బేరఁటాండ్రు గొందఱు తెర వం చినఁ జూచె నతివ నర్జునుఁ డనురాగాంబుధి తటాన నటఁ దెర యెత్తన్ |
19 |
| తే. |
కలదు లే దన నసియాడు కౌను తీరుఁ, దళుకు మొగమున కెగయు గుబ్బల బెడంగుఁ జూచి, యాతని నిడువాలుఁ జూపు లపుడు నిండు వేడుక మిన్నంది కొండఁ దాఁకె |
20 |
| చ. |
చిలకలకొల్కి కన్గొనియెఁ జేరలఁ గొల్వఁగ రాని కన్నులున్, మొలక మెఱుంగు నీలముల ముద్దులు గాఱు నొయారి మీసముల్, గలకల నవ్వు చక్కని మొగంబు, వెడంద యురంబు, సింగమున్ గలచు రువాణపుం గవును గల్గిన యా కురువీర పుంగవున్ |
21 |
| క. |
అంగజ రాజ్యం బేలుట కుం గట్టిన తోరణం బొకో యన, నతఁ డా శృంగారవతికిఁ గట్టెన్ మంగళసూత్రంబు చతురిమం గళసీమన్ |
22 |
| మ. |
అనురక్తిం దలఁబ్రాలు వోసె విజయుం డావేళ బంగారు కుం డన రంగౌ నలినీలవేణిపయి ముత్యాల్ దోయిటన్ ముంచి చ య్యనఁ బాల్పొంగిన కైవడిన్ సిరులు పెంపైఁ బూలు రేకెత్తిన ట్లనె వర్ధిల్లు మటన్న దీవనల కెల్లన్ దావలం బై తగన్. |
23 |
| తే. |
తామ్రపర్ణీ నదీతీర ధరణి నేలు దొరతనముఁ దెల్పఁగా రాశి దొరలఁ బోసె, ముదిత చేతులఁ దలఁబ్రాలు ముత్తియములు ముదిత చేతులగుచు సభాసదులు వొగడ |
24 |
| క. |
ఈ చందంబునఁ గల్యా ణోచిత కృత్యంబు లెల్ల నొనరిచి యంతన్ రాచూలి భోగ్యవస్తు ప్రాచుర్య మనోజ కేళిభవనమునందున్ |
25 |