కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
చిత్రాంగదార్జునుల పడకటింటి ముచ్చటలు
చ. మినుకుఁ గడాని జీనిపని మేలిమి మంచముపై వసించి యుం
డినయెడ నొయ్యనన్‌ సఖులు నేర్పునఁ దోడ్కొని వచ్చి మ్రోల జ
వ్వని నిడి తోడి చూపులకు వచ్చినవారును బోలె వెన్కకుం
జని; రవుఁ గాదె పై నతను సంగర మా నవమోహనాంగికిన్‌
26
ఉ. చంచలనేత్రఁ గాంచి నృపచంద్రుఁడు మోహము నిల్పలేక చే
లాంచల మంటి, శయ్య కపు డల్లనఁ దార్చి, కవుంగిలింప నుం
కించుఁ; బయంట నంట గమకించుఁ; జెలించు టదెప్పు డెప్పు డం
చించుక సేపులోన మెఱయించు ననేక మనోవికారముల్‌
27
ఉ. "కానుక గాఁగ నిత్తు బిగి కౌఁగిలి, పల్కవె కీరవాణి! నీ
దౌ నుడి తేనె నా చెవుల నానఁ, గృపారస ధార నాన న
న్నానన మెత్తి చూడు నలినానన! గోలతనాన నేల లో
నానఁ జలంబు నీకు? మరు నాన సుమీ! విడు నాన యింతటన్‌
28
ఉ. చక్కెరవింటి దేవర ప్రసాదముఁ గైకొను మిప్పు; డింద మో
చక్కెరబొమ్మ!" యంచు విలస న్మణికంకణ హస్త మంటి పే
రక్కఱఁ గప్పురంపు విడె మా నెఱజాణ యొసంగి నిక్కి లేఁ
జెక్కిలి ముద్దు వెట్టుకొనెఁ; జెప్పెడి దే మిఁక నా వినోదముల్‌!
29
ఉ. ఇగ్గెడు వెనక్కుం బయికి నీడ్చినఁ; బైఁటఁ దొలంగఁ జేయఁ గే
లొగ్గెడు; రెమ్మి పోఁకముడి యూడ్చినఁ గ్రుంగిలి రెండు కొంగులున్‌
బిగ్గ నడంచుచున్‌ విడిచిపెట్టదు; బాల ననం బనేమి? యా
సిగ్గుకు సిగ్గు లే దిటులు సేసిన పిమ్మట నుండవచ్చునే?
30
తే. "కోర్కి వెలయంగ నిను దెచ్చి కూర్చినట్టి
తియ్య విలుకాని ఋణ మెందుఁ దీర్చుకొందు
నువిద! నీ చేయి చూచుక యున్న నాకు
నింద మని వేగ నీవి నీ వియ్యకున్న?
31
సీ. మకరకేతనుఁ గూర్చి మకరికా లతలు నీ చెక్కుల వ్రాయంగ మ్రొక్కుకొంటిఁ;
గుసుమాకరుని గూర్చి కుసుమ మాలికలు నీ వేనలిఁ దుఱుమంగ వేఁడుకొంటి;
గంధవాహనుఁ గూర్చి గంధసారంబు నీ గుబ్బలఁ బూయంగఁ గోరుకొంటి;
మృగలాంఛనుని గూర్చి మృగమదంబున నీకుఁ దిలకంబు దిద్దఁ బ్రార్థించుకొంటి;
 
తే. నిన్ను వరియించునప్పుడే యిన్ని చేయు వాఁడ నని మున్ను శృంగార వనములోన;
వల పెఱిఁగి యేలుకోగదే కలికి!" యనుచుఁ గేళి కెలయించె నమ్ముద్దరాలి నపుడు
32
క. పొక్కిలి పొంతఁ గరం బిడి,
చెక్కిలి చెంత నొక కొంత చిఱున వ్వొలయన్‌
జక్కిలిగింతలు గొలిపెన్‌
మిక్కిలి వింతలుగ రతికి మేకొన నంతన్‌
33
ఉ. డాసిన నింగితం బెఱిఁగి డాయఁగ నేరక, తత్తరంబునన్‌
జేసిన సేఁతకున్‌ బదులు సేయ నెఱుంగక, మేను మేనితో
రాసినయంతనే కళలు రంజిలి కౌఁగిట బాల యుండెఁ బో;
యా సుఖ మింత యంత యన నైనది గాదు గదయ్య క్రీడికిన్‌
34
ఉ. అంగజరాజ్య వైభవ సుఖాంబుధి నీ గతి నోలలాడి, చి
త్రాంగద సేవఁ జేయ మలయధ్వజు నిల్లట పల్లుఁ డై, తదీ
యాంగబలంబు గొల్వ నరుఁ డందుల రాజ్యము సేయుచుండ నా
సింగపుఁ జిన్ని లే నడుము చెల్వకు గర్భము నిల్చె; నంతటన్‌
35
శా. మించెన్‌ బోరచి కోరికల్‌; కడు విజృంభించెన్‌ దనుగ్లాని; కా
న్పించెన్‌ మేచక కాంతి చూచుకములన్‌; జెక్కిళ్లపైఁ దెల్పు రె
ట్టించెన్‌; గూర్కులు సందడించె; నడ చండించెన్‌; మృదామోదము
న్గాంచెన్‌ వాతెఱ; యోసరించెఁ ద్రివళుల్‌ నానాఁటికిన్‌ బోటికిన్‌
36
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )