కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
బభ్రువాహన జననము
క. సీమంతవతీ మణికి
న్సీమంతముఁ జేసి రపుడు నెల లెనిమిది గా
శ్రీ మంతు కెక్కు గర్భ
శ్రీమంతుం డీతఁ డనుట సిద్ధము గాఁగన్‌
37
క. ప్రొద్దుల నెలలన్‌ వేవుర
నుద్దులుగాఁ జేయఁ దగు మహో యశములు గా
ముద్దుల బాలుని గనియెను
బ్రొద్దుల నెల యెడల నిందుముఖి శుభ వేళన్‌
38
చ. ధనము లసంఖ్యముల్‌ హిత బుధ ద్విజకోటికి నిచ్చి, యప్పు డా
తనయుని బభ్రువర్ణ హయధట్టము నేలెడు నంచు బభ్రువా
హనుఁ డను పేరు వెట్టి చెలువందఁగ బంగరుఁదొట్లఁ బెట్టి, శో
భన విభవాప్తి రంజిలిరి పాండవ పాండ్య వసుంధరాధిపుల్‌
39
సీ. "తన కులస్వామి తండ్రిని సుధాంబుధిఁ బోలుఁ బాల బుగ్గల మించు లీలఁ గనుటఁ,
దన పితామహుని బృందారకాధిపుఁ బోలు రెప్ప వేయక చూచు రీతిఁ గనుటఁ,
దన వంశకర్త నుత్పల బాంధవుని బోలుఁ గరము లర్మిలిఁ జాఁచి గారవిలుటఁ,
దన తాత యనుఁగుఁ దమ్ముని నుపేంద్రుని బోలు నల్ల నల్లనఁ దప్పుటడుగు లిడుట
 
తే. దాన గాంభీర్య, వైభవ, దాన, కృపలు గల వని కనంబడఁగ వేఱ తెలుప నేల?"
యని గురుజనంబు లెంతయు నాదరింపఁ జిన్ని బాలుండు ముద్దులు చిలుకుచుండె
40
తే. ఆడితప్పని ధర్మజు ననుఁగుఁ దమ్ముఁ
డా కుమారకుఁ జిత్రవాహనున కపుడు
వంశకరుఁగా నొసఁగి వేడ్క వారిచేత
నంపకముఁ గాంచెఁ దీర్థ యాత్రాభిరతిని
41
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )