| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| సౌభద్ర తీర్థమందలి మకరముల శాప మోక్షణము | ||
| మ. |
చని యా దక్షిణ పుణ్యభూమిఁ గనుచున్ సౌభద్ర తీర్థంబునం దును స్నానం బొనరింపఁ బోవ నట మౌనుల్ కొంద "ఱోహో! నిలుం డనఘైతన్ముఖ పంచతీర్థములయం దత్యుగ్ర నక్రంబు లుం డును నూఱేఁడులనుండి; యిందు నొకనాఁడున్ జేరరా దేరికిన్ |
42 |
| ఆ. |
'మోక్షమునకుఁ బోవ మొస లెత్తుకొనిపోయె' ననెడు వార్త నిక్క మగు నటంచుఁ గ్రుంక వెఱతు రెవ్వరును; మీర లటు పోకుఁ" డనిన నవ్వుకొనుచు నర్జునుండు |
43 |
| తే. |
"ఏను తీర్థము లాడఁగ నేఁగుదెంచి యేను తీర్థ లాడక యివలఁ జనుట పౌరుషమె?" యంచుఁ గ్రుంకఁబో వారిచరము పట్టెఁ, బట్టిన న మ్మహా బాహుబలుఁడు |
44 |
| క. |
ఎడమ కరంబుననే యా యెడ మకరముఁ బట్టి బయటి కీడిచి వైవన్ వడి భూమికఁ జూపిన కై వడిఁ దొల్లిటి రూపు వాసి వాసి యెసంగన్ |
45 |
| ఉ. |
వట్రువ గుబ్బలున్, దొగరు వాతెఱయున్, జిఱునవ్వు వెన్నెల ల్తొట్రిలు ముద్దుమోమును, దళుక్కను మేను, వెడంద సోగ యై వట్రిలు కన్నుదోయి, నిడువాలుఁ గురుల్, బటువౌ పిఱుందు, లేఁ గుట్ర నునుంగవున్ గలుగు కోమలియై యది మ్రోల నిల్చినన్ |
46 |
| క. |
ఆ లోలనయనఁ గనుఁగొని యాలోచన చేసె నృపతి యద్భుత మతియై యాలో 'నిది యచ్చర ప్రో యాలో, కా కల్ల మరుని యాలో' యనుచున్ |
47 |
| క. |
'ఈ బాల మోమునకు నా జాబిల్లికి నెంత దవ్వు? సరి వచ్చునొకో యీబిడ చనుగవ కొక మె ట్టా బంగరు గట్టు; తక్కు వౌ నెంచంగన్ |
48 |
| క. |
నడు మెంత సైక? మోహో, పిడికిటిలో నణఁగు; బెళుకు బేడిస మీలన్ గడ కొత్తుఁ గన్ను; లౌరా! జడ యందముఁ జోపఁ బాఁపజగతిన్ గలదే?' |
49 |
| మ. |
అని యా క్రీడి మనంబునన్ బొగడి "యుగ్రాకార నక్రంబ వై మును పట్లుండిన దేమి? మేలు చెలువంపుం గల్కివై యిప్పుడొ ప్పిన దే? మెవ్వరి భామినీమణివి? నీపేరేమి?" నా నిట్లనున్ "విను మో భూవర! యానుపూర్విగఁ బురావృత్తాంత మాద్యంతమున్ |
50 |