కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
నంద మొదలగు నచ్చరకాంతల చరిత్ర
క. ఏ నంద యనెడు నచ్చర
చానన్‌; దరుణేందుధరుని సఖుని యనుంగన్‌;
నా నెచ్చెలులు త్రిలోకీ
యానేచ్ఛలు గలరు నల్వు రతుల శుభాంగుల్‌
51
ఆ. వారు లలిత, పద్మ, సౌరభేయి, సమీచి
యనెడు పేర్లు గలుగు నట్టివారు;
జగము లెల్లఁ జూచి చను దెంచుచో మేము
వనధి కాంచి నొక్క వనము కాంచి
52
మ. 'విహరించున్‌ మలయానిలం బిచటఁ; దావిం జిల్కి నెమ్మేని యా
విహరించున్‌; బిక నాదముల్‌ చెవికిఁ గావించుం జవుల్‌; పోద మా
సహకారాళి పదంబుఁ జూడఁగ వయస్యా! హాళి వాటిల్లెడున్‌
సహకారాళి పదంబుఁ జూడఁగ వయస్యా! హాళి యౌనే కదా!'
53
క. అని యితరేతర చతురో
క్తిని గుంఫన మెఱయ నరిగి తేఁకువ నందున్‌
ముని యొకఁడు తపము సేయం
గని, యది విఘ్నంబు సేయఁ గడఁగి, కడంకన్‌
54
క. నెఱి కురులు, కేలుఁజిగురులు,
నిఱి చన్నులు, విరివి కన్ను, లించుక కౌనుల్‌,
చిఱుఁదొడలు, నంచ నడలు
న్మెఱపుల యొఱపులు ఘటింప నిలిచి నటింపన్‌
55
క. మా పొలు పొకింత గనుఁగొని
తాపసుఁడట వలపు పేరు దైవ మెఱుంగున్‌,
శాప మొసఁగె మకరులుగాఁ
గోప రసావేశ రూక్ష కుటిలేక్షణుఁడై
56
క. అందులకుఁ జాల భయపడి,
యందఱ మడుగులకు వ్రాలి, యతి దీనతతోఁ
గొందలపడ, నపు డాతని
డెందము గై కొనియె నక్కటికపుం బెంపున్‌
57
ఉ. శీతల దృష్టిఁ జూచి మునిసింహుఁడు 'నా వచనం బమోఘ మో
భీతమృగాక్షులార! మది బెగ్గిల నేల యిఁకన్‌? వినుండు మీ
చేత గృహీతుఁడై సలిలసీమను నెవ్వఁడు వెల్వరించు మి,
మ్మాతఁడె శాపమోక్షకరుఁ డయ్యెడుఁ; బొం' డని పంచెఁ, బంచినన్‌
58
చ. 'ఇలఁ గల వీళ్లు చూడ మన మేటికిఁ బోవలెఁ?బోయినన్‌ వనిన్‌
నిలువఁ బనేమి? నిల్చిన మునింగని త్రుళ్ళఁగ నేల? యంతలో
నలిగి శపింప నేమిటికి నాతఁడు? వ్రాఁతఫలంబు దప్పునే?
కలిగినవే కదా మకరికల్‌ మన కెప్పుడు వ్రాసి యుండుటల్‌!'
59
తే. అనుచు ననుతాపమునఁ ద్రోవఁ జనుచు నుండ
నారదుఁడు చూచి 'యచ్చరలార! మీరు
చిన్నవోయిన మొగముల నున్నవార
లే?' మనినఁ బూర్వవృత్తాంత మెల్లఁ దెలిపి
60
తే. 'ఋషితిలక! కంటివే మా యదృష్టరేఖ?
కుడిచి కూర్చుండి యిదె యొక బెడఁదఁ దెచ్చు
కొంటి; మే మేడ? మకరులై యుంట యేడ?
యర్హమే యిట్టి బాధ బింబాధరలకు?'
61
క. అన విని యనిమిష ముని 'యో
వనితా తిలకంబులార! వసుధా గీర్వా
ణుని శాపము విధికృత; మే
ఘనునకుఁ దప్పింప నలవి గా; దటు లగుటన్‌
62
ఉ. మీరలు దక్షిణాంబుధి సమీపమునం దగు పంచతీర్థముల్‌
చేరియు, గ్రాహ రూపములఁ జెంది, శతాబ్దము లున్నఁ దీర్థ సే
వారతి భారతాన్వయుఁడు, వాసవనందనుఁ, డర్జునాఖ్యుఁ డే
తేరఁగలం; డతండు కడతేర్చు మిమున్‌ దృఢ సాహసంబునన్‌
63
క. చనుఁ డచటికి నిపు డిం పెన
య; న దుఃఖం పంచభి స్సహ యనంగా మున్‌
విని యుందురె కద! యేటికి
మనమున నుమ్మలికఁ జెంద మదవతులారా?'
64
శా. అంచున్‌మమ్ముల నూఱడించ విన యాహ్లాదంబు లెంతే విజృం
భించన్‌ మ్రొక్కి 'జగంబులందును మిముం బేర్కొన్న మాత్రం బటా
పంచం బై దురితంబు లెల్లఁ జనఁగా భక్తిన్‌ మిమున్‌ నేఁడు ద
ర్శించన్‌ ఖేదము వోయి మోదము మదిం జె న్నారదా నారదా!
65
క. మీ కతమున నూఱేం డ్లని
మాకున్‌ మితి యెఱుక వడియె; మంటి' మటంచున్‌
లోకేశ్వర సుతు దీవనఁ
జేకొని, యిట వచ్చి, నిలిచి చిత్తములోనన్‌
66
క. 'దుర్జనన విసర్జనముగ
నిర్జరలోకాధినాథుని సుతుం డగు నా
యర్జును సర్జన సముదా
యర్జునుఁ గనుఁగొనెడి భాగ్య మది యెన్నఁటికో?'
67
చ. అని తలపోయుచున్‌ మకరికాకృతు లూని యి టుండఁగా, నిదే
పనిగ మదీయ పుణ్య పరిపాక మనం జనుదెంచి నీవు న
న్మనిచితివే కదా! కడమ నా చెలు లౌ జలచారి చారులో
చనలకు శాపమోచనము సల్పి కృతార్థలఁ జేయు పార్థివా!"
68
క. అని నంద వేఁడినం, ద
క్కిన తీర్థము లాడి, వారికిన్‌ శాప విమో
చన మొనరింపఁగ, నేవురుఁ
జనుదెంచి శుభాంగ లీల సన్నిధి నిలువన్‌
69
క. 'కలలో నెఱుంగ మే గణి
కలలో నీ చెలువమున్‌; సకల లోకములన్‌
గల లోలాక్షుల గరగరి
కల లోఁగొనినారొ? చంద్రకళలో వీరల్‌?'
70
క. అని 'తనచే నిజరూపముఁ
గనిరి గదా!' యనుచు వేడుకం దగు నృపతిం
గని యా యచ్చర లి ట్లని
కొనియాడఁ దొడంగి రధిక కుతుకాన్వితలై
71
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )