కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
వేలుపు మించుఁబోణు లర్జునుని బలవైభవాదుల నభినందించుట
సీ. "బల వైభవంబుచే గెలుచు మాత్రమె కాదు గమన లీలను గెల్చు గంధకరిని
గీర్తి విస్ఫూర్తిచే గెలుచు మాత్రమె కాదు నగు మొగమ్మున గెల్చుఁ దొగలఱేని
బలు సాహసంబుచే గెలుచు మాత్రమె కాదు మినుకుఁ గౌనున గెల్చు మృగకులేంద్రు
నలఘు దానంబుచే గెలుచు మాత్రమె కాదు నెఱుల కాంతిని గెల్చు నీరదమును
 
తే. సకల సద్గుణ సౌందర్య సార మూర్తి యనియు మును నారదుఁడు దెల్ప వినియ యుంటి
మి మ్మహా భుజు, నిప్పుడో కొమ్మలార! కంటిమి గదమ్మ కన్నుల కఱవు దీర!
72
తే. బాపు! వలరాజు గర్వంబుఁ బాపు రూపు;
చాఁగు! రేరాజు కళల మిం చాఁగు రేఖ;
మేలు! నలరాజు సోయగ మేలుఁ జెలువ;
మమ్మ! యీ రాజు ప్రతి గాన మమ్మ యెచట!
73
తే. అందఱును నింద్రనీల నిభాంగుఁ డందు
రింద్రనీల నిభాంగుఁడే యితఁడు గానఁ;
దండ్రిఁ బోలిన రూపు మాత్రంబె కా ద
యారె! భూలోక దేవేంద్రుఁ" డంచుఁ బొగడి
74
తే. "నీకుఁ గల్యాణ మౌ రమణీయ రూప!
నీకు వంశాభివృద్ధి యౌ నృపకలాప!
నీకు జయ మగు సాహస నీతి భరిత!
నీకు సామ్రాజ్య మౌ మహనీయ చరిత!"
75
శా. అంచున్‌ వేలుపు మించుఁబోణులు శుభోదర్కంబు గాన్పించ దీ
వించన్‌ వారిఁ బ్రియానులాపములచే వీడ్కొల్పి, గోకర్ణ భూ
ప్రాంచ ద్ధూర్జటిఁ గొల్చి పశ్చిమ సముద్ర ప్రాంత పుణ్యస్థలుల్‌
కంచున్‌ బోయి ప్రభాస తీర్థమున వేడ్కం గ్రీడి క్రీడించుచున్‌
76
తే. ద్వారకాపుర మచటికిఁ జేరు వనుచుఁ
జెప్పఁగా విని కడు సంతసిల్లి 'కలదు
గా! యిఁక సుభద్ర రూప రేఖా విలాస
విభ్రమంబులు గనఁ జూడ్కివిందు కాఁగ
77
క. అర చందమామ నేలిన
దొరగా నెన్నుదురు నె న్నుదురు బిత్తరికిన్‌;
బరువంపు మొల్ల మొగ్గల
దొరగాఁ బల్కుదురుఁ బ ల్కుదురు జవ్వనికిన్‌
78
క. అలకలు నీలము, లధరం
బల పగడము, గోళ్లు ముత్తియంబు లటంచున్‌
దెలుప మును విందుఁ జిలుకల
కొలికి తెఱం గెల్లఁ బూసఁ గ్రుచ్చిన రీతిన్‌'
79
తే. అనుచు నా కన్యఁ గైకొను నాసఁ దగిలి,
యతులకు విధేయు లగుదురు యాదవు లని,
తను నెఱుఁగ కుండవలె నన్యు లనియుఁ దలఁచి
యనుచర జనంబు నందంద పనిచి యంద
80
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )