కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
అర్జునుని కపటసన్న్యాస స్వీకారము
సీ. మృగనాభి తిలకంబు బుగబుగల్‌ గల లలాటముపై మృదూర్ధ్వ పుండ్రంబు దీర్చి,
తపనీయ కౌశేయ ధౌరేయ మగు కటీరమునఁ గాషాయ వస్త్రము ధరించి,
శరణాగతాభయ సంధాయకం బైన దక్షిణపాణిఁ ద్రిదండ మూని,
రణ చండ కోదండ గుణ కిణాంకం బైన డాకేల నునుఁ గమండలువు దాల్చి
 
తే. 'యుండెఁ బో శాంతరస మెల్ల నుట్టి పడఁగ నంగనల పొందు రోసి సన్న్యాసి యగుట
గద యుచిత మెందు' నా నవ మదన మూర్తి యంగనామణిఁ గోరి సన్న్యాసి యయ్యె
81
క. ఇటు లుండి "తనదు కోరిక
ఘటియింప హలాయుధుండు గాఁ డనుకూలుం;
డటు లైన నేమి? యఘటన
ఘటనా చతురుండు గలఁడ కా హరి" యనుచున్‌
82
క. గోపాల నందనుం డా
గోపాలక చక్రవర్తి కోమల దివ్య
శ్రీపాద పద్మములు దన
లోపలఁ దలపోయ నంత లోపల వేగన్‌
83
ఉ. సొన్నపు సన్నచేలఁ గటిఁ జుట్టి, కిరీటము మౌళిఁ దాల్చి, రే
మన్నియతోడఁ బుట్టు పెను మానిక మక్కునఁ జేర్చి, వచ్చి చెం
త న్నిలిచెన్‌, దయారస మెదం బొదువన్‌ యదువంశ దుగ్ధవా
రాన్నిధి పూర్ణిమా విశదరశ్మి దరస్మిత చారు వక్త్రుఁడై
84
ఉ. అప్పుడు సామి తాఁ దలఁచి నంతనె వచ్చె నటంచు విస్మయం
బుప్పతిలంగ వేడ్క నన లొత్తఁగఁ గన్నుల హర్ష బాష్పముల్‌
చిప్పిలఁ జక్రి పాదసరసీజములం బ్రణమిల్లి, తద్రుచు
ల్రెప్పల నప్పళించుచును లేవక యుండఁగ సంభ్రమంబునన్‌
85
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )