కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
యాదవుల రైవతకోత్సవ సన్నాహములు
ఉ. ద్వారక కేఁగి యందు బుధవర్గము బంధుజనంబు లాప్తులున్‌
గోరి భజింప నుండి యొకకొన్ని దినంబుల మీఁద భక్త మం
దారుఁడు వాసుదేవుఁడు ముదంబున రైవతకాచలోత్సవ
శ్రీ రచియింపఁగా వలయు రే పని మంత్రులఁ జూచి పల్కినన్‌.
88
ఉ. అప్పుడె వారుఁ దీర్పరుల నందులకున్‌ సమకూర్ప జాళువా
యొప్పుల కుప్ప లై మెఱయుచుండెడు మేరువులుం గురుంజులున్‌
జప్పరముల్‌ వితానములు సర్వము నాయితపెట్టి కానుకల్‌
దెప్పలుగా నమర్చి రతి తీవ్రత రైవతకాచలంబునన్‌
89
చ. అపు డొక మాట కంసరిపుఁ డానతి యిచ్చెనొ లేదొ మంచి చొ
క్కపుఁ గపురంపు గిన్నియలు కస్తురివీణెలు రాశిగాఁగఁ గొం
డ పొడవు దెచ్చి వైచి రచటన్‌; మఱి తక్కిన వస్తు లంటిమా
యపరిమితంబు; లే మనఁగ నవ్విభు పట్టణ భాగ్య సంపదల్‌!
90
తే. గంధ మాల్యాభరణ వస్త్ర కలితు లగుచుఁ
గామినీ రత్నములుఁ దారుఁ గలసి మెలసి
చనిరి రైవతకోత్సవంబునకు నపుడు
వీరు వారన క య్యదువీరు వారు
91
చ. కలయఁగఁ జెంద్రకావి ఱవికం బలెఁ గుంకుమఁ బూసి 'చూడు మో
పొలఁతుక! నాదు నే' ర్పనినఁ 'బూసిన యట్లనె లెస్స యున్నదే,
బళి!' యని కేళినీ రమణి పల్కిన నవ్వుచు శంబరారి య
ర్మిలిఁ గయిసేసి యేఁగిరి గిరిం గన నా రుచిరాంగు లిర్వురున్‌
92
ఉ. రేవతి గుబ్బచంటి మకరీమయ రేఖ లురఃస్థలంబునన్‌
భావజ చిహ్న ముద్ర లయి భాసిల, మేలిమి కందు దుప్పటిన్‌
బై వలెవాటు వైచి, నును మైజిగి గందపుఁ బూఁతయై తగన్‌
రైవతకాద్రి కేఁగె బలరాముఁడు కేళి కళాభిరాముఁడై
93
క. నగధరుని వెంట నడచిరి
మిగులం గై సేసి, యటఁ దమిం గస్తూరీ
భుగభుగలు నుదిరి బంగరు
నిగనిగ నెఱ యందె రవలు నెఱయం దెఱవల్‌
94
చ. పురజను లింపునం గనఁగఁ, బొంతల రుక్మిణి సత్యభామయున్‌
దొరయఁగఁ, దక్కు నార్వురును దోఁ జన, నా వెనుకం బదాఱువేల్‌
తరుణులు గొల్చి రాఁగఁ, బ్రమదంబునఁ గృష్ణుఁడు వట్టివేళ్ల చ
ప్పరముల నీడనే యరిగెఁ బట్టిన కానుక లెల్లఁ జూచుచున్‌
95
క. ఆ గతి నరిగి సమస్త జ
నాగతి రైవతకగిరి మహామహ లీలా
భోగము కన్నుల పండువ
యై గాఢ కుతూహలంబు నడరం జేయన్‌
96
ఉ. ము న్నతిభక్తిఁ బూజలు సమున్నతిఁ దా మొనరించి, యాత్మయో
షి న్నికరంబులం బిదప సేవ లొనర్పఁగఁ జేయుచుండె, నం
త న్నవరత్న హేమ రచితం బగు పల్లకి నెక్కి వేడ్క తో
నన్నలు రామకృష్ణులు రయమ్మున రమ్మని గారవింపఁగన్‌
97
క. చెలియలు సుభద్ర వచ్చెన్‌
జెలియలు వేయాఱులు నిరుచెంతలఁ గొలువన్‌;
'దొలకరి మెఱపో యిది యని
తొలకరిదొర బిడ్డ వెఱఁగుతోడం జూడన్‌
98
ఉ. యౌవత చూళికాభరణ మప్పుడు కొందఱు బోంట్లు ముంగలన్‌
రైవతకోత్స వాగత జనంబు బరాబరి సేయుచుండఁ, ద
ద్దేవత కర్చనా నతు లతి ప్రమదంబునఁ జేసెఁ బై పయిన్‌
దైవతరాజ నందను ధనంజయునిం బతిగాఁ దలంచుచున్‌
99
తే. ఈ కరణిఁ బూజ లొనరించి, యిష్ట సఖులఁ
గూడి, య గ్గిర కందరాకూట తడ వి
నోద వైఖరు లెల్లఁ గన్గొనుచు సరస
గోష్ఠి నుండెడు పద్మరాగోష్ఠిఁ జూచి
100
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )