| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| అర్జునుఁడు సుభద్ర రూపరేఖలఁ గాంచి పరవశుఁ డగుట | ||
| మ. |
మును విన్నది తా నప్పుడు గనుఁగొన్నది యొక్కతీరుగాఁ దార్కాణై పెనఁగొన్న మహాశ్చర్యం బున నన్నరుఁడిట్టు లనుచుఁ బొగడం దొడఁగెన్. |
101 |
| ఉ. |
'చూడమె దేవతాసతుల శోభనకాంతివిలాసవైఖరుల్ చూడమె నాగకన్యకల లోకమనోహరరూపసంపదల్ చూడమె మర్త్యకామినుల సోయగముం దమకంబు పెల్లు తీ పాడఁగ? దీనివంటి యొఱపైన మిటారినిఁ జూడ మెందులన్. |
102 |
| క. |
చెక్కులజిగి చనుగుబ్బల చక్కఁదనము మొగముతేట జడతీ రౌరా చొక్క మగు దీనిఁ జూచినఁ జొక్క మనం గూడ దెట్టి సుజ్ఞానులకున్. |
103 |
| ఉ. |
కన్నులు దీర్ఘముల్ నగుమొగం బవురా తలకట్టుతమ్మిపూ పున్నమచందమామలకుఁ బొక్కిలి చక్కఁదనంబుఁ జెప్పఁగా నున్నదె? మేలుబంతులు పయోధరముల్; మఱి కౌను సున్నయౌ నెన్నిక కెక్కు వ్రాఁతఫల మివ్వరవర్ణినికి న్నిజంబుగన్. |
104 |
| తే. |
భ్రమరకమనోహరం బౌటఁ బద్మ మగును తారకాహృద్య మగుట సుధానిధి యగు రెంటి జగడాలు మోమున నంటి యుంట నబ్జముఖి యంట లెస్స యీ యలరుఁబోఁడి. |
105 |
| సీ. |
ధారాధరము వెన్నుఁ దన్ని పుట్టినచాయ నున్నదీ బింబాధరోష్ఠివేణి జక్కవకవ ఱొమ్ము త్రొక్కి నిల్చినజాడ నున్నవీ నవలాపయోధరములు చిన్నప్రాయపులేఁడిఁ జెవులు పట్టాడించు గతి నున్నదీ రామకన్నుదోయి నల్లచీమలబారు నడుము దాఁకినవీఁక నున్నదీ చెలువంపుఁగన్నెయారు |
|
| తే. |
విపులపులినంబు వెన్కకు వీఁగ నొత్తు నందమున నున్నదీ మందయానపిఱుఁదు దీని కెనయైన లతకూనఁ గాన మా మనోజవజ్రాంగి యీ జగన్మోహనాంగి. |
106 |
| క. |
సైకము నడుము విలాస ర సైకము నెమ్మొగము దీనిమృదుమధురోక్తుల్ పైకముఁ దెగడు న్నవలా పైకములో నెల్ల మేలుబంతిది బళిరా! |
107 |
| ఉ. |
ఇత్తరళాక్షి మేనిజిగి యేలిక మేలికడానిపైఁడి కీ గుత్తపుగుబ్బలాఁడిజడకూఁకటి చీఁకటిమూలదుంప కీ పుత్తడిబొమ్మకన్నుఁగవపోలిక వాలికగండుమీల కీ బిత్తరిముద్దునెమ్మొగము పిన్నమ పున్నమచందమామకున్. |
108 |
| తే. |
కామినీమణి నిడువాలుఁగన్నుఁగవకు నెన్నికకు రాని తొగఱేకు లీడు సేఁత తగదు తగ దిఁక నలినపత్రంబులందు నీ డగునో యేమొ మాట వేయింట నొకటి. |
109 |
| క. |
మహిలో సరి గలదా యీ మహిలోత్తంసంబుమేని మహిమకుఁ? దెలియ\న్ మిహికుందనపుసలాక\న్ మిహికాకరరేఖ మించు మించు\న్ మించున్. |
110 |
| సీ. |
కలిగెఁబో యీయింతి కులుకుగుబ్బలఁజూడ శీతశైలాదుల సేవఫలము కలిగెఁబో యీనాతివళుల యందముఁ జూడ గంగాతరంగముల్ గన్నఫలము కలిగెఁబో యీరామకనుబొమ ల్సూడంగ మును ధనుష్కోటిలో మునుఁగుఫలము కలిగెఁబో యీభామకటివిలాసముఁ జూడ భూప్రదక్షిణము సల్పుటకు ఫలము |
|
| తే. |
తోడుతోడనె యిటులు చేకూడవలదె తన్వి దీఱంగ నీతన్విఁ గూడి సరససంభోగ సల్లాపసరణిఁ దేలు నాఁడు గా ఫలియించుట నాతపంబు. |
111 |
| క. |
అని కొనియాడుచు నుండ\న్ వనితామణి నంత నుత్సవము చేసి పురం బున కన్పుచు మాయామునిఁ గనుఁగొని యాహలి నితాంతకౌతూహలి యై. |
112 |