కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
బలరాముఁడు కపట త్రిదండిని ద్వారక కాహ్వానించుట
తే. అతని నుత్తమయతియకా మతిఁ దలంచి
వినయమునఁ జేరి సాష్టాంగవినతిఁ జేసి
స్వాము లెందుండి యిచటికి వచ్చినారు
తీర్థయాత్రగ నది యెల్లఁ దెల్పుఁ డనిన.
113
క. హిమశైల సేతువుల మ
ధ్యమునం గల నదులు నిధులు నాశ్రమములుఁ దీ
ర్థములుం దాఁ గనుఁగొన్నవి
క్రమమునఁ దెలుపం బ్రమోద రసపరవశుఁడై.
114
మ. కలిగె\న్‌ భాగ్యవశంబునం గనుఁగొనంగా మిమ్ము మమ్ముం గృతా
ర్థులఁ గాఁ జేయఁగ నాత్మలోఁ దలఁచి చాతుర్మాస్య మిచ్చోటనే
సలుపం గా వలె స్వామివా రని నమస్కారంబు గావించి ప్రాం
జలియై వేఁడిన సమ్మతించెఁ గుహనా సన్న్యాసి యుల్లాసియై.
115
తే. చెలువనేత్రవిలాసంబు చెవులు సోఁక
బాలకుచలీల యెదఁ జాలఁ బట్టి క్రాలఁ
గలికి నెఱివేణి చెలువంబు కాళ్లఁ బెనఁగ
నవలఁ బోలేక నిలిచె నయ్యర్జునుండు.
116
క. సీరియు నిటులా శౌనా
సీరియు నన్యోన్య సూక్తిసితమానసులై
పోరానికూర్మి నుండఁగ
నారామునికడకు నంత హరి సనుదెంచెన్‌.
117
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )