కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
బలరాముఁడు సన్న్యాసిని సత్కరింప సుభద్రను నియోగించుట
క. చనుదెంచిన స్వాములకు\న్‌
వినతి యొనర్పు మని యిచట వీరల నిలువుం
డనినార ముపవనంబున
నునిచి మనసుభద్ర సేవ కొనరుపు మన్నన్‌.
118
తే. వయసువారును జక్కనివారు వీరు
మనసుమర్మంబు లేమియు మనకుఁ దెలిసి
యున్నయవి గావు సేవకు నునుపఁ దగునె
కన్నె నదియేమొ తెలిసికొమ్మన్న నతఁడు.
119
క. వీరు మహాత్ములు ఘను లప
చారం బగు నిట్టులాడ సంయములకు ము\న్‌
గోరిక వెలయఁగఁ గన్యలె
గారా శుశ్రూష సేయఁ గాఁ దగువారల్‌.
120
ఉ. నెమ్మది సంశయింప కిది నీవొనరింపు మటన్న నట్లె కా
నిమ్మని యమ్మునిప్రవరుఁ గృష్ణుఁడు దోడ్కొని ద్వారకాప్రవే
శమ్మొనరించి యంతిపురిఁ జయ్యనఁ జెల్లెలిఁ బిల్వనంపి రా
వమ్మ సుభద్ర నీ యభిమతార్థము లెల్ల ఫలించు నియ్యెడన్‌.
121
శా. కామాదిస్ఫురణంబు లెల్ల నడఁగంగాఁ జేసి ధన్యాత్ములౌ
స్వాముల్‌ వీరలు వీరికిం పొదవు ఠేవ\న్‌ సేవ గావింపు మెం
తోమోదంబున నానతిచ్చి బలభద్రుండే నియోగించినాఁ
డేమో చెప్పితి నంచు నుండెదవు సుమ్మీ నీమదిన్‌ సోదరీ!
122
క. అని తత్కన్యాంతఃపుర
వనవంజులకుంసంజవనమునఁ గుహనా
ముని నుండఁ జేసి పలికె\న్‌
నెనరు మదిం బొదల రుక్మిణిసత్యలతోన్‌.
123
క. అతఁ డెవ్వఁ డెఱుఁగుదురె మీ
మతిలోనన యుండ నిండు మనకుందనపుం
బ్రతిమ యగు సుభద్రకు నై
యతివేషముఁ బూనియున్న యర్జునుఁడు సుఁడీ.
124
క. తనమదిలో నితఁ డర్జునుఁ
డని తెలిసి సుభద్ర సేవ కరుగక యున్నం
జని మీరతనికి భోజన
మొనరింతురు గాని యూరకుండెదరు సుఁడీ!
125
మ. అతనిం బూజ లొనర్పుఁ డిప్పు డని నెయ్యం బొప్ప గోపాలుఁ డా
నతి యీ నర్మిలి మ్రొక్కి నిన్నుఁ గని యెన్నాళ్లోకదా యంచు వ
చ్చితివా యన్న! కిరీటి! కూర్మి కలదా చెల్లెండ్రపై నంచుఁ ద
త్సతు లేకాంతమునం బ్రియోక్తులను బూజల్‌ సేసి వీడ్కొల్పినన్‌.
126
తే. అన్నరుం డంత శ్రీకృష్ణుఁ డున్ననగరి
సరసఁ గన్నియరాణివాసమున నమరు
కేళివనిలోన నవరత్నకీలితంపు
బవిరిటాకుల చిన్నియుప్పరిగలోన.
127
తే. తెఱవ నెఱవంకబొమలును మెఱుఁగువాఁడి
చూపులును జూచి తనచేతిసూటి రోసి
యస్త్రసన్యాస మొనరించినట్టి సుమశ
రాసనుం డనఁ జెలిమీఁదియాస నుండె.
128
క. అందుండి మనసులోన ము
కుందుం డీగతి నొనర్చుకుశలత కతఁ డా
నందమును జెందుచుండఁగఁ
గొందఱు గారాబుచెలులు గొల్వఁగ నంతన్‌.
129
ఉ. చందురకావి పావడ పిసాళిరుచుల్‌ సరిగంచుఁజీరపై
జిందులు ద్రొక్క వేణి కటిసీమపయి న్నటియింప జాళువా
యందెలు మ్రోయ జంటిఱవికంటి చనుంగవ పిక్కటిల్లఁగాఁ
జందనగంధి వచ్చె రభసమ్మున నమ్మునిరాజుసేవకున్‌.
130
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )