కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
కుహనా సన్న్యాసికి సుభద్ర పరిచర్య
ఉ. వచ్చిన దౌలఁ గాంచి తలవంచి జపంబు నెపంబు వెట్టి వి
వ్వచ్చుఁడొకింతసేపు తనవంకఁ గనుంగొనకున్న మెల్ల నే
యచ్చట నిల్చి నిల్చి వినయంబునఁ జేరి కుచంబు లోరగా
హెచ్చినభక్తి మ్రొక్కి యనియెం జెలి యంజలిఁ జేసి యింపుగన్‌.
131
ఆ. ఓమహానుభావ యేవి గావలె దేవ
పూజ కిపుడు పత్రపుష్పఫల జ
లాదికములు దెత్తునా యనవుడు నట్ల
సేయు మనుచు నతఁడు సేయి సూప.
132
సీ. తన యరుణాధరంబునకు నీ డివి యన్న రమణ నేఱిచి పల్లవములు కొన్ని
తన తనూసౌరభంబునకు జో డివి యన్న చందాన వెదకి పుష్పములు కొన్ని
తన మధురాలాపమునకు దీ టివి యన్న పగిది నారసి తియ్యఁబండ్లు కొన్ని
తన లేనగవుతేటకును బాటి యివి యన్న పోల్కిఁ దేఱిచి హిమాంబువులు కొన్ని
 
తే. పత్రపుటికావిధూపలపాత్రికలను దెచ్చి వినయంబుతోడ నందిచ్చె నపుడు
పసిఁడి గాజులమిసమిసల్‌ పైకిఁ బొలయఁ జకితబాలమృగీచకచకితనయన.
133
ఉ. గెంటనిప్రేమ మేను పులకించెఁ గిరీటికిఁ బూ లొసంగి వా
ల్గంటి గిఱుక్కునం దిరుగఁ గమ్మని కస్తూరితావి గ్రమ్ముకో
గింటెపుగబ్బిగుబ్బలజిగి\న్‌ వెలిఁ జిమ్ము నొయారిజిల్గుప
య్యంట చెఱం గొకింత దనయంగముపైనటు సోఁకి నంతటన్‌.
134
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )