కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
అర్జున సన్న్యాసి - యనుష్ఠాన వైచిత్రి
క. చేసె జప మతఁడు కడువి
శ్వాసము చెలిచూపుబేడిసలపై నిగుడ\న్‌
జేసినయది జపము\న్‌ మఱి
వేసినయది గాల మనుట వృథ గాకుండన్‌.
135
తే. భామమోమున వ్రేలురూపంబుఁ జూచి
ముదిత యెడఁబాయకుండెడు మూర్తిఁ దలఁచి
రమణి మైసగ మైన విగ్రహము నెంచి
ప్రోవుమని వేఁడుకొను దేవపూజవేళ.
136
తే. వినతిఁ జేసిన భిక్ష గావింపుఁ డనిన
మాఱు వడ్డింప నివి దెత్తుమా యటన్నఁ
బల్కు నారాయణా యనుభాషణంబె
యల నిజాలకు సన్యాసివలె నతండు.
137
క. భయభక్తుల నిటులా కృత
కయతిగ్రామణికిఁ గన్యకామణి శుశ్రూ
ష యొనర్చుచుఁ గొన్నాళ్లుం
డి యొకానొకనాఁడు దనదు డెందమునందున్‌.
138
ఉ. వాసవిరూపచిహ్నములవార్తలు ము\న్‌ విని యుండుదుం గదా
యా సొబ గెల్ల నేఁడు గన నయ్యెడు వీరలయందు నైన స
న్న్యాస మసంగతం బగు మహాసుకుమారుఁడు రాకుమారుఁ డీ
గాసికి నోర్చునే కలరెకా మఱి మానిసిఁ బోలు మానుసుల్‌.
139
క. అని సంశయ మొకయించుక
యును లే కెప్పటివడువున యువతివతంసం
బనువుగ నతనికిఁ బూజన
మొనరించుచు నుండె నంతికోద్యానమునన్‌.
140
సీ. కరము చాఁచి నవాంబుకలశ మీ విడివడ్డ కుంకుమాంకపుముద్దఁ జంకమెఱపు
ననలుదేఁబోఁ గాళ్లఁ బెనఁగు నంచ నదల్పఁ జూచు జంకెనవాఁడిచూపు బెళుకు
పూరెమ్మ వంచుచోఁ జాఱుపయ్యంట దాఁగిలిమూఁతలాడుగుబ్బల బెడంగు
పొలఁతి! కాయో పండో పొయినపనియన్నఁ జిలుకమాటకు నవ్వుసొలపుఁదేట
 
తే. మఱియు మఱియును జూడనే మనసువాఱి వారికుసుమఫలంబులఁ దేరఁ బనుచుఁ
దొలుతటివి చాల వని యావధూలలామ నే మనఁగ వచ్చు వివ్వచ్చునేమ మింక.
141
తే. తెమ్ము బంగారుకుండ జలమ్ము లనుచుఁ
దెమ్ము లతకూన మంచిసుమమ్ము లనుచుఁ
దెమ్ము బా గైనకొమ్మఫలమ్ము లనుచు
మించుఁబోఁడిని నేరుపు మించఁ బలుకు.
142
క. తుమ్మెదవలె నున్నది యిటు
రమ్మని నెఱికొప్పు నివిరి బ్రమసితిఁ దరుణీ!
కమ్మవిరినల్లగలు వని
క్రమ్మఱ మఱుపెట్టు గుట్టు కన రాకుండన్‌.
143
క. నిద్దంపు మేలి సొమ్ములు
దిద్దిన కస్తూరి బొట్టు దినచల్వలు నై
ప్రొద్దొక సింగారముతో
ముద్దియ చనుదేర మిగుల మోహాతురుఁడై.
144
చ. బలిమిని బట్టఁగా దివురుఁ బట్టిన నొప్పక యిట్ట టన్నచోఁ
బలువు రెఱింగిరేని నగుఁ బాటని కొంకుఁ దలం పెఱుంగకే
కలయఁగఁ జూచుటల్‌ తగవు గాదని యుండునతండు కాంత నె
చ్చెలుల నొకింత పాసి తనచెంత మెలంగుచు నున్న వేళలన్‌.
145
చ. అట జగదేకసుందరికి నై యతివేషముఁ బూని వచ్చినాఁ
డఁట తనచేయుభాగ్యమున నప్పువుఁబోఁడియె చెంత సేవ సే
యుట కని వచ్చియుండు నఁట యొక్కొకపట్టున నొంటి పాటు నౌ
నఁట యతఁ డెప్పు డెప్పు డను టబ్బురమే మదిఁ దత్తఱించుచున్‌.
146
ఉ. సుందరి రానిచో నెదురు సూచుచు నుండనె పట్టె వచ్చుచో
నిందునిభాస్య చక్కఁదనమే కని చొక్కుచు నుండఁ బట్టె నీ
సందడిచేతనే యరుగసాగెను బ్రొద్దిఁక వేళ యెప్పుడో
సందె జపంబు నర్చనలు సల్పుటకా కపటత్రిదండికిన్‌.
147
తే. వెలఁది కెమ్మోవిఁ గని జపావృత్తి మఱచెఁ
దరుణిలేఁగౌను గని హరిస్మరణ మఱచెఁ
గడమ యన నేల వేస మొక్కటియ తక్క
మరచె నన్నియు నా కృత్రిమత్రిదండి.
148
మ. ఒడలుపొంగు నొయారిఁ జూడ జవరాలొద్ద\న్‌ మెలంగ\న్‌ గగు
ర్పొడుచు\న్‌ ముద్దులగుమ్మ గంధసుమంబుల్‌ చేతి కందిచ్చున
ప్పుడు వ్యాపారము లన్నియు న్మఱచు నప్పూఁబోఁడి రాకుండిన\న్‌
గడె సేపొక్క మహాయుగంబు కరణి\న్‌ గన్పట్టు రాచూలికిన్‌.
149
క. ఆనంద బాష్పములచే
నాని వధూహావభావనటనలఁ దనలోఁ
దాన తలపోయువానికి
స్నానం బేమిటికిఁ వేఱె జప మేమిటికిన్‌.
150
క. ఈరీతి నుండ నొకనాఁ
డారాజకుమారి యతని కాహార మిడ\న్‌
జేరి తదారామంబునఁ
గూరిమి నెచ్చెలులు వెంటఁ గొని తేరంగన్‌.
151
క. వెస లలనామణి బంగరు
వెసలల దొంతరలు డించి వినయము మది కిం
పొసఁగఁగ గంకణరవములు
పొసఁగఁగ నారసి రసాన్నములు వడ్డింపన్‌.
152
చ. చిలుకలకొల్కి వేయెడమచేముడి గొల్పెడు జాఱుకొప్పు నిం
పులు తులకింపుచుండు భుజమూలరుచుల్‌ జిలుఁగుం బయంటలోఁ
గులుకుమిటారి గబ్బిచనుగుబ్బలుఁ జూచుటె కాని క్రీడి క
ర్మిలి మఱి లేదు భోజనముమీఁది యపేక్ష యొకించుకేనియున్‌.
153
తే. రమణి యొయ్యారములపైఁ బరాకుచేతఁ
జవి యెఱుంగఁడు వడ్డించునవి యెఱుఁగఁడు
భోజనము చేసి లేచె నారాజసుతుఁడు
తృప్తి యేరీతి నుండెనో తెలియరాదు.
154
క. అపు డతిరయమునఁ బన్నీ
రపరంజి పసిండి గిండియందుం గొని తాఁ
జపలాక్షి తెచ్చి యొసఁగం
గపటపుసన్న్యాసి ధౌతకరపంకజుఁడై.
155
క. నిగనిగని చంద్ర కాంతపు
జగతిపయిం గూరుచుండ జవ్వని వెనుక\న్‌
బగడపుఁ గంబపుఁజాటున
మొగ మించుక గానిపింప మురువు నటింపన్‌.
156
శా. కంగుల్‌ దీరిన పైఠిణీరవిక చన్కట్టంటి రాణింపఁగాఁ
జెంగల్వల్‌ నెరికొప్పునందు నొఱపై చెంతం గుబాళింపఁగా
బంగారందియ ముక్కునం గమిచి పైపై నంచ యెల్గింపఁగా
సింగారంబగు ముద్దుఁజిల్క తనకు\న్‌ జేదోడువాదోడుగాన్‌.
157
తే. ఏకతంబున వసియించి యిట్టులుండ
మదనమదనాగవలమానమానసాంబు
రుహుఁడు పురుహూతసుతుఁడు నేరుపునఁ బలికె
నాచకోరాక్షిఁ గ్రేఁగంటఁ జూచి యపుడు.
158
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )