| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| సుభద్ర యర్జునుని వృత్తాంతమును యతి నడుగుట | ||
| తే. |
కురులు కెంపులబొగడల నెరయ దువ్వి నిక్కుఁజనుగుబ్బలఁ బయంట చక్కఁ జేర్చి పలికెఁ గలకంఠి మోమునఁ దెలివి తొలుక ముత్తియపుముంగఱ యొకింత మోవిఁ గదియ. |
161 |
| మ. |
అవుఁగా మీ రిట మున్ను గన్గొనినచాయ ల్లేవుగా నాఁట నుం డి విశేషంబులు గొన్ని మిమ్ము నడుగ\న్ వేడ్కయ్యెడు న్నాకు నె య్యవి గన్గొంటిరి పుణ్యభూము? లట రాజ్యంబుల్ మనోజ్ఞంబు లె య్యవి? యేయేపురముల్ గనంబడియె మీ కందంద మార్గంబునన్? |
162 |
| క. |
మీ రింద్రప్రస్థముఁ గని నారా? పాండవులఁ జూచినారా? సుఖులై వారందఱు నొకచో ను న్నారా? వీరాగ్రగణ్యు నరు నెఱుఁగుదురా? |
163 |
| సీ. |
ఎగుబుజంబులవాఁడు మృగరాజమధ్యంబు పుడికిపుచ్చుకొను నెన్నడుమువాఁడు నెఱివెండ్రుకలవాఁడు నీలంపునికరంపు మెఱుఁగుఁజామనచాయ మేనివాఁడు గొప్పకన్నులవాఁడు కోదండగుణకిణాంకములైన ముంజేతు లమరువాఁడు బవిరిగడ్డమువాఁడు పన్నిదం బిడి డాఁగ వచ్చు నందపువెన్ను మచ్చవాఁడు |
|
| తే. |
గరగరనివాఁడు నవ్వుమొగంబువాఁడు చూఁడ గలవాఁడు మేలైనసొబగువాఁడు వావి మేనత్తకొడుకు కావలయు నాకు నర్జునుండు పరాక్రమోపార్జనుండు. |
164 |
| క. |
తడ వాయె భూప్రదక్షిణ మడరింపఁగఁ బోయి యామహామహుఁడు పదం పడి పుణ్యస్థలముల నె న్నఁడు మీ రందందు నరుగ నరుఁ గానరు గా! |
165 |
| క. |
అన విని సమస్తభూములు కనినారము తీర్థయాత్ర గావించునెడ\న్ గనుఁగొనినారము సంక్రం దననందను ననిన ముద మెదం జెన్నొందన్. |
166 |
| ఉ. |
ఎచ్చటఁ గంటిరో విజయునిక్కువ నిక్కువ మౌనె? రాఁడుగా యిచ్చటి కంచుఁ గోరికలు నీరికలెత్త రసోక్తిఁ బల్కఁగా నొచ్చెము లేనిబీర మెద నూరఁగ నూఱఁగ సాగె వెంటనే పచ్చనివింటివాఁ డపుడు పైఁదలిపైఁ దలిరాకు గైదువుల్. |
167 |
| ఉ. |
కోమలి యీగతి న్మదిఁ దగుల్వడఁ బల్కిన నవ్వి నిర్జర గ్రామణిసూను మీరెచటఁ గంటిరొ యంటిని కన్నమాత్రమే యే మని చెప్పవచ్చు నొకయించుక భేదము లేక యాయనే మే మయి యున్నవారము సుమీ వికచాంబుజ పత్రలోచనా! |
168 |
| ఆ. |
తీర్థములను గ్రుంకి దేవతాసేవలు చేసికొనుచుఁ బెక్కువాసరములు గూడి యతఁడు మేము గోకర్ణమునయందు నుంటి మనిన మచ్చెకంటి యలరి. |
169 |
| క. |
ఎక్కడ గోకర్ణం బన నిక్కడి కది యెంతదూర మింతకు నతఁడీ చక్కటికి వచ్చునో లే కక్కడనే యుండి యవలి కరుగునో? చెపుఁడా! |
170 |
| క. |
అని రాజవదన మాటికి ననురాగము తేటపడఁగ నాడెడుమాటల్ విని జేజేరాకొమరుఁడు వనజేక్షణ కనియె వలపు వడ్డికిఁ బారన్. |
171 |
| క. |
వేమారు గ్రుచ్చి గ్రుచ్చిపు డే మీ యడిగెదవు మన సొకించుక నీ కా భూమీశుమీఁదఁ గలదో తామరసదళాక్షి! నాకు దాఁపక చెపుమా! |
172 |