| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| అర్జునుఁడు గాంధర్వ వివాహ మాడుమని సుభద్ర నర్థించుట | ||
| తే. |
ఏల పోయెదు నిలునిలు బాల! యనుచుఁ జిఱునగవు నెమ్మొగంబునఁ జెంగలింపఁ దమకమున లేచి మరులేచి తత్కరాంబు జం బొడసి పట్టెఁ జేసాఁచి సవ్యసాచి. |
177 |
| క. |
పట్టినమాత్రనె దేవకి పట్టికరాబ్జము లలాటపట్టిక చెమటల్ వెట్టె గగుర్పొడిచెం జను క ట్టొక యిసుమంత వీడెఁ గట్టుంగొంగున్. |
178 |
| క. |
మరుఁ డపుడు బేసితూపులు ధరియించియు నేమి చెప్పఁ దరుణి న్నరుని\న్ సరికోలలఁ బడ నేసె\న్ గొరవంకరొదల్ చెలంగఁ గ్రొన్ననవింటన్. |
179 |
| క. |
ఆరీతిం జేపట్టి వ రారోహ\న్ వేదిమీఁదికై రాఁ దిగువ\న్ దూరము వెస నరుగక యొ య్యారముగా నమ్రవదన యై యుండంగన్. |
180 |
| క. |
ఏ మును చూచి యెఱుఁగ నిను నీ మును ననుఁ జూచి యెఱుఁగ వీవును నిపుడీ ప్రేమలు వినుకలినే పై పై మన కిర్వురకుఁ బర్వెఁ బర్వేందుముఖీ! |
181 |
| ఉ. |
శారిక హారికంకణము సద్దున కంటుట గాదు కేలు మం జీరఝళంఝళధ్వనికిఁ జేరుట గాదు పదంబు లంచ వా గ్ధోరణిమాధురీమహిమకు\న్ శుక మానుట గాదు చెక్కులో సారసగంధి నాకొఱకు సారెకు వేఁడెడు జాడ లిన్నియున్. |
182 |
| క. |
చిలుకలకొలి కిది నాతోఁ బలుకంగాఁ గొంత సిగ్గుపడియెడు ముంజే చిలుకా! నీతో నైనను బలుకంగా రాదె? పలుకు బంగారఁటవే? |
183 |
| మ. |
రతికి\న్ భారతికి\న్ వినోదకథలం బ్రాగల్భ్యము\న్ జూపి త త్పతులం గూరిచి మాటవాసిఁగను పెద్దల్ గారె మీవార లా చతురత్వం బిటఁ గొంత కానఁబడ నీ చంద్రానన\న్ గూర్చిన\న్ బ్రతికింపంగదె ముద్దుఁగీరమ సుధాబంధూభవద్గీరమా! |
184 |
| ఉ. |
చంపకగంధిమోవి సరసంబగు బింబ మటంచు వట్టితే లింపు టెలుంగుతోఁ దమి దలిర్పఁగఁ బల్కినఁ జెక్కుగీఁటి ని న్నింపున ముద్దుపెట్టుకొని యెన్నఁడు మన్ననసేయ నున్నదో? పెంపుడుఁజిల్క! నిన్నుఁ దనిపింతుఁ జుమీ చెలి నన్ను నేలినన్. |
185 |
| క. |
అని కేళిశుకముఁ బలికిన మన మలరం గలికి పలికె మాటలతియ్యం దన మింతంతనఁ గూడని తన యధరసుధాసమగ్రతం దెలుపంగన్. |
186 |