కావ్యములు విజయ విలాసము ద్వితీయాశ్వాసము
సరసోక్తులతో సుభద్ర తప్పించుకొని పోవుట
తే. మేరలా యివి మీయంతవారలకును
బెద్ద లున్నా రెఱిఁగి వారె పెండ్లి సేయఁ
గలరు వేగిరపా టింత వల దటంచు
విన్నపము చేయరాదె యోచిన్నచిలుక.
187
తే. అని యుచితరీతి వెలయఁగ నాడు నాతి
రసికముద్రకు మిగులమానసము గరఁగ
పైపయిం బ్రేమ యగ్గలం బై పెరుంగ
నవ్వధూటి నొడంబడ ననుఁ గిరీటి.
188
క. మీవా రెఱుఁగుట యెన్నఁడు?
కావించుట యెన్నఁ డింకఁ గళ్యాణంబు\న్‌?
నీ వేల జంపు నడపెదు?
రావే మారాడ కిందు రాకేందు ముఖీ!
189
సీ. నన్ను గాంధర్వంబునను బెండ్లియాడవే సి గ్గేల పడియెదే? చిగురుఁబోణి!
రతిఁ దేల్చి మదనసామ్రాజ్య మేలింపవే తల యేల వంచెదే? జలజగంధి!
చెలులు వచ్చెదరు నాతలఁపు లీడేర్పవే తడ వేల చేసెదే? ధవళనయన!
మది నిచ్చగించి నామనవి యాలింపవే కడ కేల పోయెదే? కంబుకంఠి!
 
తే. మనసు దాఁపంగ నేటికే? యనుపమాంగి! చలము సాధింప నేటికే? చంద్రవదన!
మాఱుమాటాడ వేటికే? మధురవాణి! చింత సేయంగ నేటికే? దంతిగమన!
190
క. గబ్బిమరుం డొఱ వెఱుఁగక
గొబ్బునఁ బైఁ బడును నీవుఁ గూడనివార్తల్‌
సుబ్బినఁ గార్యం బెక్కడఁ
దబ్బిబ్బో కా కపూర్వతనుబిబ్బోకా.
191
క. మీఁదన్‌ వియోగసాగర
మీఁద\న్‌ గలవా లతాంగి యే మెఱుఁగవయో!
యీఁదా డ న్నను మదనుఁడు
కోఁదా డనువాఁడు బిగువు కొనసాగునొకో.
192
క. ఏలే యాలేఖ్యాకృతి
యే లే ప్రాలేయకరముఖి చూడవయో!
యేలే? శైలేయస్తని!
యేలే బాలేందునిటల? యే లాఁతినఁటే?
193
సీ. ఆ హార మింపౌ కుచాగ్ర మానక యున్న నాహార మింపుగా దబ్జవదన!
చెఱకుఁబా లొదవువాతెఱ యీనిచోఁ గంతు చెఱకుఁ బా లౌదునే చిగురుఁబోఁడి!
కళలు దేరెడునెమ్మొగంబు ముద్దిడ కున్నఁ గళలుదేరవు సుమీ కంబుకంఠి!
వలఱేనిదురమున నలరింప కున్న నవ్వల రే నిదుర రాదు కలువకంటి!
 
తే. నేఁడు కాదు గదే ప్రేమ నీకు నాకు నాటి యున్నది మదిఁ జిన్ననాఁటినుండి
యిటుల నేకాంతసమయ మెన్నఁటికి దొరకు? నేల తప్పించుకొనియెదవే? లతాంగి!
194
మ. అని బాహాపరిరంభ సంభ్రమరసాయత్తైక చిత్తంబున\న్‌
దను నీక్షింప నెఱింగి యందియలమ్రోఁత\న్‌ గేకినుల్‌ రా సఖీ
జను లేతెంచి రటంచు వే మొఱఁగి హస్తంబు\న్‌ విడంజేసి నే
ర్పునఁ దప్పించుక పోవ భూవరుఁ డనుం బూఁబోఁడికిం గ్రమ్మఱ\న్‌.
195
క. కలహంస కేకిశుకములు
పిలపిల నేతేర నీవు పెంచిన వనిగా
తలఁచెదవు మరుఁడు పైఁగా
వలిఁ బెట్టిన దెఱిఁగి తిరుగు వనజాతముఖి!
196
క. వెలిదమ్మి కలువ కొలఁకుల
యెలదెమ్మెర లొలయ వాని నెగఁ బోయుచు నో
చెలి! జు మ్మని విరహులకుం
దలదిమ్ము ఘటించుఁ దుమ్మెదలది మ్మిచటన్‌.
197
సీ. కలకంఠి! నీకటాక్షము గల్గ నిన్నాళ్లు మరుశిలీముఖముల సరకుసేయ
నతివ! నీ యాభిముఖ్యము గల్గ నిన్నాళ్లు చందమామ నొకింత సడ్డసేయ
రమణి! నీప్రియవచనము గల్గ నిన్నాళ్లు కలికి రాచిలుక లక్ష్యంబుసేయఁ
గొమ! నీకరావలంబము గల్గ నిన్నాళ్లు లేమావిచిగురాకు లెక్కసేయఁ
 
తే. జూడక మొగంబు ద్రిప్పి మాటాడ కిపుడు చేదిగిచి పట్టుక పరాకు చెప్పినపుడె
యేమి పుట్టునొ కైలాట మింకమీఁద మగువ! దయ లేక విడనాడఁ దగునె నీకు.
198
క. మొక మెఱుక కలదు గదవే
మకరాంకునియనుఁగు మేనమామకు నీకుం
దికమకలు సేయ వల దను
మకటా మేడపయి కేఁగునపుడైనఁ జెలీ.
199
వ. అని యనేకప్రకారంబులం దన మనోఽనురాగంబు తేటపడం బలికినఁ జెలుల నఱయు
నెపంబునం బరాకు చేసికొని చిఱు చెమట క్రమ్ము నెమ్మొగంబు మకరందబిందు
కందళితారవిందంబు చందంబునం దనర నరవీఁడు కుచ్చిళ్ల నెత్తి చెక్కుచు
నొక్కింత జాఱుపయ్యంటఁ జక్కం జేర్చుచు నొక్కింత వదలువేనలి నలవరించుచుఁ
గొండొక చెదరుపాపటఁ గుదురు కొల్పుచుఁ జక్కెరవిల్తుం డెక్కడ వెన్నాడునో యను
భయంబునంబోలె నించుకించుక తిరిగి చూచుచు ననుగత కేకిహంసంబులపై
వెగటునంబోలెఁ జలించుచు నీయొళపు సకియలకుం జెప్పకు మని రాచిల్కకుఁ
బ్రియంబులు సెప్పుచు మగతేఁటి యంటియంటని ప్రసూనకళికపోలిక నరవిరి బాగుతోఁ
బోలి కప్పురంపుటనంటుల నంటు ద్రాక్షపందిరుల తెరువులఁ బూఁ దేనె కాలువలు
దాఁటి చెంగలువ బావుల డగ్గఱి కుంకుమనీటికేళాకూళియోరవట్టి వట్టివేళ్ల
చప్పరంబులనీడ వ్రీడాభరం బీడిచికొని పోవ నివ్విధంబున.
200
క. ఆఘనునిఁ బాసి మంజీ
రాఘోషము మెఱయ నరిగె నంతఃపురికి\న్‌
వే ఘనజఘన తళుక్కన
మేఘము నెడఁబాసి పోవుమెఱుపో యనఁగన్‌.
201
క. ఎటువంటి నేర్పరి నిశా
విటునల్లుఁడు నడుమ నిల్చి వెడసింగిణిచే
నటు చూ పిటు నిటు చూ పటుఁ
బటురయమున నేసె నాసుభద్రార్జునులన్‌.
202
తే. కోపమగువారి బెదరించి కూర్పనేర్చుఁ
గూడమనువారిఁ దమిఁ గొల్పి కూర్ప నేర్చుఁ
గొమ్మలకు మగలకుఁ బెండ్లిఁ గూర్ప నేర్చు
జగతి నెంతటియుపకారి శంబరారి.
203
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - dvitIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )