కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
క. శ్రీజానకీ మనోహర
పూజాంచిత హృత్పయోజ! పోష్యాఖిల ది
గ్రాజ! సకలార్థిజన ని
ర్వ్యాజకృపా! యచ్యుతేంద్రరఘునాథమణీ!
1
తే. అవధరింపు కథాకర్ణనాతివేల
హర్షులైనట్టి దివ్యమహర్షులకును
తతసమస్త పురాణ కథా శతాంగ
సూతుఁడై విలసిల్లెడు సూతుఁ డనియె.
2
అర్జునుని మదన తాపము
క. ఆరీతి నంతిపురమున
నారీతిలకము సకీజనంబులు గొలువం
జేరిన పిమ్మట మదిలోఁ
గూరినపిమ్మట విరాళిఁ గొని నరుఁ డుండెన్‌.
3
తే. కృష్ణుననుమతి రుక్మిణీకీరవాణి
వచ్చి భోజన మిడఁ దలవంచి యగ్గ
లంబయినచింత వలసియొల్లమి నతండు
సొగటులను బోయి కసిగాటులుగ భుజించె.
4
తే. మునుపు సైఁపదు సంతోషమున భుజింప
వెనుక సైఁపదు చింతచేతను భుజింప
బాలకడ నున్న యపు డెడఁబాసినపుడు
నొక్కతీ రయ్యె భరతవంశోత్తమునకు.
5
ఉ. ఎక్కడఁ జప్పు డైనఁ దరలేక్షణ వచ్చె నటంచు లేచు నే
దిక్కున నల్కు డైన సుదతీమణి పల్కని యాలకించు నే
చక్కిఁ దళుక్కుమన్న నలజవ్వనిమైసిరి యంచుఁ జూచు న
మ్మక్క! కిరీటిమోహసముదగ్రత నే మనవచ్చు నయ్యెడన్‌?
6
ఉ. చక్కెరకెంపుమోవిఁ గని సారెకుఁ జిల్క మొగంబు వేఁడఁగాఁ
జొక్కపుఁ జిల్వకప్పుజడఁ జూచి మయూరము లఱ్ఱు సాఁపఁగాఁ
జక్కని తమ్మిపూవడుగుజాడలఁ గన్గొని రాజహంసముల్‌
త్రొక్కుడుపాటు చెందఁగ వధూమణి వచ్చుట లెంచు నెమ్మదిన్‌.
7
తే. మారుతమ్ములవాడికి మలయకూట
మారుతమ్ములవేఁడికి మట్టుమీఱు
చంద్రకిరణమ్ములకు శుకశారికాళి
చంద్రకిరణమ్ములకుఁ జాల జలదరించు.
8
చ. 'విరహిణులం గలంప గలవీరులు వీ రని తమ్ముఁ జేర న
య్యురుకుచ వాలుఁజూపులకు నోడుట నంకము కాఁగ మీనము\న్‌
హరిణమునట్లనే తమశరాంశుల నోడెనొ కాక బాలిక\న్‌
గరఁపఁగ రాదె యేల ననుఁ గ్రాఁచెదరీ మకరైణ లాంఛనుల్‌.
9
క. ఇన్నాళ్లు సేవ సేయుచు
నున్నదియుం బోయె నేఁ డయో! కౌఁగిలి యి
మ్మన్నంతఁ జదుపఁ బెట్టఁగ
నున్నమతియుఁ బోయె నను టహో నిజ మయ్యెన్‌.
10
తే. అంతిపురమున కరుగుచో నింతి తిరిగి
యోరగాఁ జూచునపుడు శృంగారరస మ
పారముగ నుబ్బ జాలెత్తె నౌర! దాని
చలమనోహరలోచనాంచలమ చెలమ.
11
సీ. అర్జునుం డను నేనె యని తెల్పినంతనే మిట్టిమీనై పడె మెలఁతచూపు
గాంధర్వమునఁ బెండ్లి కమ్మనునంతనే పచ్చకప్పుర మయ్యె భామపల్కు
బలిమియైఁ బట్టంగఁ దలకొనునంతనే యొకబండి కల్లయ్యె నువిదపిఱుఁదు
సొలపుఁబయ్యెదఁ దేఱి చూతు నన్నంతనే పచ్చపూసాయెఁబో పడఁతియారు
 
తే. పేరు వివరించి నే నేల బేల నైతిఁ? గోర్కి యెఱిఁగించి నే నేల గోల నైతి?
బలిమిఁ బైఁ బడి నే నేల బయటఁ బడితి? బత్తి గనిపించి నే నేల పలుచనైతి?
12
సీ. తెఱువ కస్తూరిచుక్క దీర్చి వచ్చినటెక్కు గీఱునామము నాఁటితీరుఁగేరుఁ
దన్వంగి వలిపంబుఁ దాల్చివచ్చినఠీవి వన్నెఁ గట్టిననాఁటిచెన్నుఁ దన్ను
వాల్గంటి కీల్గంటు వైచి వచ్చినచెల్వు జడ యల్లుకొనునాఁటిసౌరు జౌరు
నొయ్యారిమెఱుఁగు సొమ్మూని వచ్చిననీటు మణిభూష లిడునాఁటిమట్టుఁ దిట్టు
 
తే. నాతిరాయంచగుమి గూడి నడుచుమురువు చెలులు గొల్వంగఁ జనునాఁటి సొలపు నలఁపుఁ
జక్కఁ దనముల ప్రోవైన చంద్రముఖికి నిచ్చలపురూపు లెస్సైన నింపు నింపు.
13
ఉ. మిక్కిలి తేఱిచూడ మిఱుమిట్టులు గొల్పుఁ జరించునప్పు డ
మ్మక్క! తళుక్కున\న్‌ మెఱసిన ట్లగు నే మన వచ్చు? నద్దిరా!
చొక్కపుఁ బైఁడిబొమ్మ యనుచు\న్‌ జను లాడిన నాడిరింతెకా
కెక్కడికేడ పో యలమృగేక్షణమేనికి నక్కడానికిన్‌?
14
ఉ. చిత్తజుఁ డల్గి తూపు మొనచేసినఁ జేయఁగ నిమ్ము పై ధ్వజం
బెత్తిన నెత్తనిమ్ము వచియించెదఁ గల్గినమాట గట్టిగా
నత్తరళాయతేక్షణ కటాక్షవిలాసరస ప్రవాహముల్‌
కుత్తుగబంటి తామరలకుం దలమున్కలు గండుమీలకున్‌'
15
క. అని తాల్మిఁ బాయు 'సేవకు
నని యెప్పటివలెనె తిరిగి యరుదేర దొకో!'
యని యాస సేయు 'వచ్చిన
ననృతోదరి నింక విడువ' నని తలపోయున్‌.
16
సీ. విరహాగ్ని కోర్వక విధి దూఱుకొనెడు తాఁ దపసివేషం బేల తాల్చినాఁడు?
కడలేనిసెకలఁ గందెడు ఘనోదయవేళఁ దెలిసియుఁ దా నేల వలచినాఁడు?
శుకశారికార్భటులకుఁ దల్లడిలెడు తా నుపవనంబున నేల యుండినాఁడు?
కరగతస్వము పోవుకరణిఁ జింతిలెడు తా వెలఁది నేటికిఁ బట్టి విడిచినాఁడు?
 
తే. నేరముల నెంచెద మటన్న నేరికైనఁ గలవు పరికించి చూడ నందులకు నేమి?
యంగసాంగత్యపారవశ్యమునఁ గాక యెఱిఁగి యుండిన నతఁడు చే యేల విడుచు?
17
తే. ఉనికి శృంగారవన మఁట! యొంటిఁ దగిలె
నఁట! విరహి యఁట! యెంత సేయఁడు కిరీటి
నసమశరుఁ డింకఁ దనవైరి యగు లలాట
లోచనుని గెల్చు నని దయఁ గాచెఁ గాక.
18
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )