| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| సుభద్ర విర హాతిశయము | ||
| క. |
ఇటుఁ లాతఁ డుండఁగా న క్కుటిలాలక యంత నచటఁ గుసుమశరార్తి\న్ బెటిలిపడి పాన్పుపై న ట్టిట్టు వడి తనలోనఁ దానె యేకాంతమునన్. |
19 |
| క. |
'ఏఁ గోరినచెలువుఁడె ననుఁ దాఁ గావలె నంచు వచ్చి దగ్గఱి వేఁడం గౌఁగిలి యీ కిట వచ్చితి నౌఁ గా దని పెనఁగి యెంత యవివేక మయో! |
20 |
| ఉ. |
దిగ్గున లేచి న న్నతఁ డతిప్రమదంబునఁ జందమామఱా నిగ్గుటరంగుమీఁదికయి నెమ్మిఁ గరాబ్జము వట్టి యీడ్చిన\న్ బిగ్గఁ గవుంగిలించి సుఖనీరధిఁ దేలఁగ నీక నా కయో! సి గ్గనుపేర వెంటఁ బడఁ జెల్లు నొకో ప్రతిబంధమయ్యెడన్? |
21 |
| క. |
తొల్లిటివలె సేవకుఁ బోఁ జెల్లునె? మావారు పెండ్లి సేసెద రిదిగో! నెల్లిఁ దమ కంచుఁ బలికితి నెల్లిద మగుఁ గాదె తిరిగి యేఁ బై కొన్నన్. |
22 |
| సీ. |
ననుఁ దా వలచిపడ్డ నలఁకువల్ దీరంగఁ గైసేయ నెనఁడు గలుగునొక్కొ? పెనఁగి చే విడిపించుకొనిన నేరమి పోవఁ గెలన నెన్నఁడు నిల్వఁ గలుగునొక్కొ? ప్రియ మెఱుంగక యడ్డపెట్టు తుందుడుకువోఁ గల్యాణ మెన్నఁడుగలుగునొక్కొ? మోహతాపము దీఱ మోవిచక్కెర పానకమున నెన్నఁడు దేల్పఁ గలుగునొక్కొ? |
|
| తే. |
యొంటి శృంగారవనములో నునిచి వచ్చి నట్టి నెంజిలియెల్లఁబో నానృపాల తిలకుఁ జేర్పంగ నెన్నఁడు గలుగునొక్కొ యాము కవిసినకుచకుంభసీమయందు?' |
23 |
| క. |
అని యెంచరాని కోర్కులు మనమునఁ దలపోయు భావమగ్నతచేతం గనుమూయుఁ గలసినట్టులు గని సంతస మందుఁ దెలిసి కళవళ మందున్. |
24 |
| సీ. |
ఉదయాద్రి యెరగలి నొరసి మీఁద వెలుంగు జలజారి వేఁడివెన్నెలలు గాయ హరుకంటిసెగ కోర్చి యాఱితేఱిన మారుఁ డలరుఁజిచ్చఱవాఁడిములుకు లేయఁ బాముకోఱలతోడ సాము చేసినగాడ్పు విసపువిత్తై సోఁకి వెగటు చూపఁ గౌంచాచలముపోటుగంటి దూరిన రాజహంసము ల్వడి హళాహళులు చేయ |
|
| తే. |
వేగునంతకు వలవంత వేఁగునంత నంతిపురమునఁ బ్రమదవనాంతరమునఁ గృష్ణకృష్ణా యటంచు నాకీరవాణి రామరామా యటంచు నారాజసుతుఁడు. |
25 |
| క. |
చెలులు ప్రసంగవశమ్మున నలరెం గడువిజయభవన మనిన న్నవలా తెలియ వినుం గలయఁ గనుం బలుమాఱు బాగౌఁ గిరీటిపచ్చ లటన్నన్. |
26 |
| క. |
మనమున నున్నది మొగమునఁ గనిపించుం గాన గట్టిగా మదిలో న ర్జునభావ మునికి నపు డ ర్జునభావము మొగమునందు సుదతికి నిల్చెన్. |
27 |