కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
వదినెలు సుభద్రతో మేలము లాడుట
సీ. 'పులకించె మె నేమి తలఁచుకొంటివె?' యంచు మేలంబుపచరించె మిత్రవింద
'యిన్నాళ్లవలె మన సిచ్చి మాటాడవే! యెందు దృష్టి?' యని కాళింది తెగడెఁ
'జెలి పెండ్లికతఁ జెప్పఁ జెవి యొగ్గి వినవేమి? కలదు లే' యని గేలి సలిపె భద్ర
'వలపువాసన మించెఁ గలికి! నీమొగ' మంచుఁ ద్రస్తరి నెఱపె సుదంత కొంత
 
తే. జాంబవతి నవ్వె లక్షణ సరస మాడె నే లగడుచేసెదరె ముద్దరాలి ననుచుఁ
బలికె రుక్మిణి సత్య కన్గిలిపె నపుడు చిన్నిమరఁదలిమోహంపుఁజిన్నె లెఱిఁగి.
28
క. 'అంగన! యిన్నాళ్లును ముని
చెంగటికిం బాఱిపాఱి సేవలు గావిం
పంగాఁ బోదువు నేఁ డటు
తొంగియు జూడ వతఁ డేమి దోసము చేసెన్‌?
29
ఉ. అక్కఱఁ జూడ వేటి కల యచ్చిక బుచ్చిక సేయు నంచలం?
జెక్కిలిగొట్టె దేమిటికిఁ జేరఁగ వచ్చినముద్దుఁజిల్కల\న్‌?
ముక్కు మొగంబుఁ జూడ కటు ముట్టను బొమ్మనె దేల బోట్ల నో
చక్కెర బొమ్మ! నీవెగటుజాడలఁ జూచిన వింత లయ్యెడున్‌.
30
ఉ. ఎవ్వనిఁజూచి మేలుపడితే? యరవిందదళాక్షి! నీమనం
బెవ్వఁడు సొచ్చెఁ జెప్పఁగదవే మదకోకిలవాణి? నిన్న నేఁ
డెవ్వనిచెల్వు నీయెదుట నెన్నఁ బడె\న్‌ వినతాంగి? నేనె కా
కెవ్వరు నీకుఁ బ్రాణపద? మేటికి దాఁచెదవే తలోదరీ!
31
ఉ. బాలసమీరణంబు పయిపాటున నించుక సోఁకినం గడుం
దూలుచు నుండు దానవు వినోదపుసుద్దులముద్దుఁజిల్కపై
వ్రాలినఁ గందుఁ గేలు పువువంటిది నీ నును మేనిదే గతిం
దాళు నొకో వియోగశిఖి దా నెదలో దరికోఁ దలోదరీ!'
32
క. అని వారికి వా రందఱు
మనమునఁ దోఁచినటు లాడుమచ్చికమాటల్‌
విని సిగ్గున నయ్యెలజ
వ్వని యూరక యున్న నపుడు వారలలోనన్‌.
33
ఉ. 'లెంకఁగ నేలుకోఁ గలదులే మగనిం దరితీపు సేసి మీ
నాంకునిపాద మాన మన మాదట వేఁడిన మాఱు పల్కఁగాఁ
గొంకెడు నంచు మీ రిపుడు గోలని చూడకుఁ డమ్మ! నేర్చు బో
చంకలబిడ్డ లూడిపడ సారసలోచన మాటలాడఁగన్‌.
34
తే. క్రాఁగి యున్నది మిగుల నంగంబు చూడఁ
గలవరించుచు నున్నది కలదో యేమో
సోఁకు డల్లసన్న్యాసికే చూపవలయు
భామ' నని పల్కె నాసత్యభామ నగుచు.
35
క. 'ఈలీల నుండి మన మిటు
మేలము లాడంగ నేమి మిడిమేలమొ?' యం
చాలో సత్య సుభద్రహి
తాళుల కిసుమంత యారహస్యముఁ దెల్పెన్‌.
36
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )