| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| చెలులు సుభద్రకు శిశి రోపచారములు గావించుట | ||
| క. |
గుసగుసలఁ బోయి వలపుల కిసమస లని తెలిసి రసికకిసలయపాణుల్ బిసకిసలకుసుమవిసరము వెసమసలక తెచ్చి శిశిరవిధాలాలసలై. |
37 |
| శా. |
పన్నీట\న్ జలకంబు లార్చి చలువల్ పైఁ గట్టఁగా నిచ్చి మే న న్నిండారఁగ జందనం బలఁది విన్నాణంబుగాఁ గప్పురం పున్నామం బిడి క్రొమ్ముడి\న్ విరిసరంబుల్ నించి హారావళుల్ చన్నుంగ్రేవలఁ దార్చి రప్పుడు చెలుల్ చంద్రాస్యకు న్నేర్పునన్. |
38 |
| సీ. |
బోటి మధువ్రతంబులకు దండము వెట్టి మకరంద మధరబింబమునఁ జిల్కెఁ జెలి గంధవహున కంజలిఁ జేసి నెత్తావి పువ్వుగుత్తు లురోజమున నమర్చె నాళి బిసాహారపాళికిఁ బ్రణమిల్లి నవమృణాళములు బాహువులఁ గూర్చె సకి కెందలిరుదిండులకు వందన మొనర్చి చిగురుటాకులు పాదయుగళిఁ జేర్చె |
|
| తే. |
సరఁగ నిటు లందఱును మీప్రసాద మనుచుఁ బంచసాయకదేవతాబలము నెల్ల వేఁడికొని తగినట్లు కావించి రపుడు చంచలాక్షికి శిశిరోపచారవిధులు. |
39 |
| తే. |
కలయఁ బన్నీరు చిలికి శ్రీగంధ మలఁది విరులు పైఁ దార్చ నపు డొప్పెఁ దరుణిమేటి మగని నరు గెల్వ వలరాచమావటీఁడు పూజ సేసిన యగ్గజరాజ మనఁగ. |
40 |
| ఉ. |
అంగనగుబ్బచన్మెఱుఁగుటందపు మేలిపసిండికుండలం బొంగఁ దొడంగెజొబ్బిలఁగఁబూసినగందము తాపవహ్ని 'సం పంగికటారివీరునకుఁ బాలును బియ్యము లేనిపొంగలో పొంగ' లటంచు నయ్యలరుఁ బోడులు సారెకు గేలిసేయఁగన్. |
41 |
| పంచ చామరము. |
మెఱుంగుఁబోఁడి కిట్లు చల్వ మేర మీఱఁ జేసినం గుఱంగట న్నిలంగరాక కూర్మి వెచ్చ హెచ్చఁగాఁ దుఱంగలించు చింతతోడ దూఱి పల్కి రంత వే మఱు\న్ మరు\న్ మరున్మృగాంకమత్తకోకిలాదులన్. |
42 |