కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
మన్మథోపాలంభనము
క. 'విరివింటివాఁడవు గదా!
శరణాగతు లైన పాంథజనులను రక్షిం
తురు గా కిటుల నుపేక్షిం
తురె పైకము గూడఁ బెట్టఁ దొడఁగుచు మదనా!
43
క. అలరువిలుకాఁడ వమృతము
చిలికెడునెల యేల? సామిచేఁ గాదె వియో
గుల నేఁచఁగ? విండ్లమ్ములు
గలవారికిఁ దోడు చల్లకడవలవారే?
44
ఉ. చక్కని వారిలో మిగులఁ జక్కనివాఁడవు గాన నీకె నౌ
చక్కనవారిఁ చంద్రుని వసంతునిఁ గూరుచు కొంటి వందమౌఁ
జక్కెరవింటిరాజ! యెకసక్కె మదే మని కూర్చుకొంటి? వ
మ్మక్క! యరూపకం బయిన యా యెలదెమ్మెర నాలిబూతమున్‌.
45
తే. రమకు నట్టింటిపగవాఁడు కమలవైరి
కంసుఁ బోలినయుగ్రశేఖరుఁడు వాఁడు
మేనమా మని చూడకు మాను చెలిమి
యకట పైవచ్చు ఱెఱుఁగవే హరికుమార!
46
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )