కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
చంద్రోపాలంభనము
క. వల పెక్కడ లేదా? యీ
యలికుంతలతలనె వేగెనా? యేఁచ కిఁకం
జలికాలఁ ద్రోచి విడువుము
చెలి మిక్కిలి మనసుపేద శీతలపాదా!
50
చ. శివుఁడిటు రమ్మటంచు దయ చేసినచోఁ దలకెక్కి తుగ్రవై
భవమునఁ జూచుచో నడుగు వట్టితి వే మన వచ్చు నీగుణం
బవు నవు నందిన\న్‌ సిగయు నందక యున్నను గాళ్లుఁ బట్టుకొం
దువు హరిణాంక! వేలకొలఁదుల్‌ గద నీనడకల్‌ దలంపఁగన్‌.
51
తే. కలశవారాశిఁబుట్టుట క ప్పెనయుట
శైలచాపశిరోధివాసంబుఁ గనుట
యెవ్వరికి నంటరాకుంట యెఱిఁగి కాల
కూట మన నేమి నినుఁ జంద్ర! నేఁటనుండి.
52
తే. భువనజాతార్తికరమూర్తి వవుట కడలి
కడలి గరళంబు నిన్ను నొక్కటిగ నెంచి
త్రాగు తలఁ బోసికొమ్మని వేగ హరున
కిచ్చె నీరుచి యిఁక నెంచ నేల చంద్ర!
53
ఉ. చక్కెరవింటిరాజు నగచాపునితో నెదిరించి పడ్డనాఁ
డెక్కడ నుంటి వీవు మధుఁ డెక్కడనుండెను మందమారుతం
బెక్కడ నుండె సిగ్గు పడరే మిపు డాతఁ డదృష్టరేఖచే
రక్కొని క్రమ్మఱం బ్రతికి రాఁగ వజీర్లయినారుగా శశీ!
54
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )