కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
కోకిలా ద్యుపాలంభనము
క. మా కలకంఠియు నీవును
నేకగ్రీవముగ నుందు రిన్నాళ్లు నయో!
కోకిల! యిపు డే లలఁచెదు?
నీ కగునే యిగురుఁబోఁడి నెత్తురు ద్రావన్‌.
55
క. కొమ్మపయిఁ బక్షపాతము
నెమ్మెయి నెఱపుదు వి దేల యేఁచెద వకటా!
క్రమ్మఁగ నవాతుచక్కెర
క్రమ్మఁగ మాటాడుఠవర! కలకంఠవరా!
56
ఉ. కల్లరిత్రాఁచు నిప్పుకలు గైకొనుకేకి చకోరపాళికిం
జెల్లినఁ జెల్లుఁ గాక సరసీజబిసంబు లిగుళ్లు మేసి భా
సిల్లెడు మీ కయో! విషము చిల్కఁగ వేఁడిమి కుల్కఁబల్కఁగా
జెల్లునె యో మరాళపికశేఖరులార! వచింపుఁ డింపుగన్‌.
57
క. రాచిలుకా! కోమలిదెసఁ
జూచితె? శ్రుతికటువు లనెడుశుకనామము మీ
కే చాడ్పునఁ దగు వల దిఁక
మాచెలిఁ గెరలించితేని మాటలు వచ్చున్‌.
58
క. మదనుగుణం బని చాలఁగ
మది నమ్మితి మిట్లు మొరయు మరియా దగునే?
యదియును గాక మదాళులు
గద తుమ్మెదలార! వెగటుగా నాడెదరే?
59
వ. అని బహూకార నికార మమకార చమత్కారంబులు కానంబడ నీప్రకారంబున. 60
క. కరదబ్జముఖుల మాటికి
శరదబ్జముఖుల్‌ తలంపఁ జాల్‌ నిలుఁ డంచుం
దరుణీమణి వేసరి యా
స్తరణసుమాదులను జూపి తాపముచేతన్‌.
61
సీ. 'ఈక్రొవ్విరులు గ్రోలు నెలతుమ్మెదలు చెక్కు చెమరింప కున్నవా చిగురుఁబోడి!
యీ కెంజిగురు మెక్కు కోకిలానీకముల్‌ వసివాడ కున్నవా వనజగంధి!
యీనిండువెన్నెల లాను చకోరముల్‌ కసుగందకున్నవా కంబుకంఠి!
యీతూండ్లు భుజియించు జాతియంచలు సొట సొటలు వోకున్నవా శోభనాంగి!
 
తే. తెలిసి రా రమ్మ కలదు సందియము చాల నులికిపడ కవి లెస్సలై యుండెనేని
వజ్రకాయములే యౌను వానికెల్ల నపుడు విరహుల యవధికి నవధి లేదు.
62
క. చలిగాలి గర్వ మణఁపం
గలిగెం జిలువ లని యుండఁగా వానిపయి\న్‌
గలిగె శిఖావళము లయో
చెలి తప్పునె వాయుసఖము శిఖి యనువార్తల్‌.
63
తరల. ఆగము లెక్కుచు మిన్ను ముట్టు చహంకరించు బలంబుతో
మృగమదంబు నడంగఁ జేయుచు మేనికప్పు చెలంగఁగాఁ
బగలు మీఱఁగఁ బాంధకోటుల బాధవెట్టుచు నుండు నీ
తొగతగుల్‌ వెడవింటిబోయకుఁ దోఁడు వచ్చినవాఁడపో.
64
క. మకరందరసముఁ జిల్కెడు
చికిలిలకోరీలు చెఱకుసింగిణివిల్లుం
బ్రకటించియు నిది యేమో
మకరాంకుఁడు చేఁదువగలు మానడు చెలియా!
65
చ. చిడిముడిపాటుతోఁ జెఱకుసింగిణిఁ బూని మధుప్రియత్వ మే
ర్పడుగతిలావు లున్నహరిపైని జివుక్కున నెక్కి యుక్కున\న్‌
వెడలెడుచందుఁ జూచి తమి నేఁడిదిగోవధ మాచరించుఁ బెం
పడరి లతాంగి! పచ్చితురకౌఁ గద యమ్మదనుండు చూడఁగన్‌.'
66
తే. అనినఁ 'బవనుండు మనకు లో నైనవాఁడు
తోయజారాతి మనుజులత్రోవ రాఁడు
కాముతూపులు వెండ్రుకఁ గట్టఁబడును
జామ! యేటికి నూరక జలదరింప?'
67
తే. అనుచు నూరడఁ బల్కి తత్ప్రాణసఖులు
దేవకీదేవి కీమాట దెల్ప కున్నఁ
గాదనుచుఁ జేరి చెలియున్న గాథ దెలిపి
రంత యటమున్న తెలిసి మురాంతకుండు.
68
ఉ. తల్లిని దండ్రి నాత్మజులఁ దమ్ముల రమ్మని యేకతంబునం
దల్లకిరీటి యున్న తెఱఁగల్ల సుభద్రకునైన మోహముం
దెల్లముసేసి 'ము\న్‌ మనమదిం గల యట్లనె యయ్యె' నంచు రం
జిల్లి 'హలాయుధుం డెఱుఁగఁ జేయఁగరాదు గదా వివాహమున్‌.
69
క. తనశిష్యుం డని దుర్యో
ధనునకు నీవలచి సమ్మతంపడఁ డటు గా
వున నిందుకుఁ బశుపతిపూ
జన మని యొక టిపుడు గద ప్రశస్తం బయ్యెన్‌.
70
చ. ఇరువదినాళ్లు రేపు మొద లిందుధరోత్సవలీల లచ్చట\న్‌
జరిగెడు నేఁటి కెన్మిదవనాఁటికిఁ బెండ్లిముహూర్తమవ్వధూ
వరులకుఁ దెల్పిసల్పుఁడు వివాహవిధుల్‌ హలి కానకుండఁ దీ
వరమున లగ్నవేళ కిటు వత్తు నటంచు నమర్చి దేవకి\న్‌.'
71
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )