కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
ద్వారకలో శ్రీకృష్ణుని యాధ్వర్యమున సుభద్రార్జునుల వివాహము
తే. అంత నిచ్చట ద్వారకయందు దేవ
కీసతీమణి తాను రుక్మిణియుఁ బెండ్లి
పెద్దలై యర్జును సుభద్రఁ బెండ్లికొడుకుఁ
బెండ్లికూఁతునుఁ జేయ నపేక్షఁ జెలఁగి.
75
ఉ. కట్టిరి మంచిలగ్నమునఁ గంకణముల్‌ కరపంకజంబులం
బెట్టిరి మేనుల న్నలుఁగు మేలిమృగీమదకుంకుమంబులం
జుట్టిరి కైశికంబుల విశుద్ధమనోహర పుష్పమాలికల్‌
పట్టిరి పేరఁటాండ్రు ధవళంబులు పాడుచు నుల్లభంబులన్‌.
76
శా. 'ఇన్నాళ్ప్రోది యొనర్పఁ గేళివనిలో నిం పొందు నమ్మాధవీ
పున్నాగంబుల పెండ్లి సేయవలెఁ బూఁబోండ్లార! రారే' యటం
చు న్నేర్పుల్‌ దగ నొండొరుం బిలిచికొంచు\న్‌ సత్యభామాది వి
ద్యున్నేత్రామణు లప్పు డిర్వురకు విందుల్‌ సేసి రందందులన్‌.
77
క. అంతర్వాణి పురోహితుఁ
డంతవివాహోచిత క్రియాకాండం బా
ద్యంతము గావించుట కై
సంతసమునఁ జేరి యున్న సమయమునందున్‌.
78
క. సంపంగినూనె యంటె\న్‌
శంపాంగి కిరీటి కొకతె చనుదోయి పిసా
ళింపం గీల్జడ కటి నటి
యింప\న్‌ గిటగిటని కౌ నొకింత చలింపన్‌.
79
క. కలశస్తని మణికంకణ
కలశస్తనినాద మొలయఁ గా నొకతె వడి\న్‌
దలఁ బ్రామి పసిఁడికొప్పెర
జలములు చెలు లంది యొసఁగ జలకం బార్చెన్‌.
80
లయవిభాతి. చలువ లొసఁగె\న్‌ సరగఁ జెలువ యపు డొక్కరితె
వలఁతితన మొప్ప నొకపొలఁతి తడి యొత్తె\న్‌
గొలఁదిగ జవాది నొకవెలఁది తలఁ బూసె నొక
జలరుహదళాక్షి సిగ కలరుసరి చుట్టె\న్‌
దిలక మిడియె న్నిటలఫలకమున నొక్క సతి
తెలి నిలువుటద్ద మొకచెలి నిలిపె మ్రోల\న్‌
గలయ జవరా లొకతె మలయజ మలందె నొక
లలన విసరె\న్‌ సురటి యలనరున కర్థిన్‌.
81
తే. ఒరగవేసిన సిగవింత యొరపుఁ జూచి
బవిరి దిద్దినచెంపలబాగుఁ జూచి
వడి గొలిపి యున్న మీసముబెడఁగుఁ జూచి
యపుడు తమలో సుభద్ర నెయ్యంపుఁజెలులు.
82
క. 'వాసవి త్రిదండివేసము
వేసి గదా మేలు సేసె, వెస జన్నిదమే
వేసికొనవచ్చు నీసిగ
వేసికొనం గూడ దొండువేసము వేయన్‌.
83
క. దండముఁ గాషాయంబును
గుండికయును మాని పెండ్లికొడు కై నాఁ డా
ఖండలుని ముద్దుఁగొడుకు ప్ర
చండరుచి న్నేఁడు మంచిసన్న్యాసముగా!
84
మ. యతివేషమున నిన్నినాళ్లు మన యుద్యోనాంతరక్షోణి ను
న్నతఁడాయీతఁ? డదేటిమాట? కనుఁగో మం దెన్నఁడేనీతను
ద్యుతి యీ రాజస మీ మొగంబుకళ లీ యొయ్యార మీ వీక్షణా
మృతలీలాభినయంబు లీ సొగసు లీ మీసాలలో నవ్వులున్‌.
85
క. ఈమహిమ యెందుఁ గలదే
భూమండలిలోన? నితఁడె పో చక్కనివాఁ
డోమగువలార! మును విన
మా మన్మథు నతనిమేనమామ\న్‌ మధునిన్‌.
86
క. ఈ రాజుసేవఁ జేసిన
వారిది గద భాగ్య! మీభువనమోహన శృం
గారునితోఁ గూడం గల
నారీమణిదే సుమీ జనన మూహింపన్‌.
87
ఆ. మంచిమగఁడు వలయు నంచుఁ గోరుచు నుండ
మంచిమగఁడు గలిగె మఘవసుతుఁడు
మనసుభద్ర సుకృతమహిమ యే మనవచ్చు?
మనసు భద్ర మయ్యె మనకు నెల్ల.'
88
తే. అని నుతింప నలంకృతుఁ డగుచుఁ గొంతి
కూర్మికొడు కుండ బంగారుకుండ యైన
కన్యకారత్నమున కాప్రకారముననె
శిరసు మజ్జన మొనరించి చిగురుఁబోండ్లు.
89
ఉ. భామకుఁ గప్పుదేఱు తెగబారెఁడు నిద్దపుసోగవెండ్రుకల్‌
వేమఱు దువ్వి భారమున వెన్కకు జాఱఁగఁ గొప్పు వెట్టనో
హో! మఱి వేయు వెట్టినటులొప్పె నదేమనవచ్చు నౌఁగదా!
తామరసాక్షి కెందుఁ దలిదండ్రులు పెట్టనిసొమ్ము పెన్నెఱుల్‌.
90
క. స్వకపోలకల్పిత మనో
జ్ఞకళాగతి కెట్టు లౌను సరి ఛాయాచో
రకరుచి సందర్భం బని
ముకురము నగుకరణి నవ్వుమోము చెలంగన్‌.
91
ఉ. అద్దముఁజూచి చంద్రముఖి యందముగాఁ దిలకంబు కస్తూరి\న్‌
దిద్ది యనేక రత్నమయ దివ్య విభూషలు దాల్చి యయ్యెడ\న్‌
ముద్దులుగుల్కు కుందనపుముక్కలిపీఁట వసించెఁ దమ్మిపూ
ముద్దియగద్దియం బొలుచుముద్దియ యుద్ది యన\న్‌ శుభోన్నతిన్‌.
92
చ. 'తనయునిపెండ్లి కేఁగవలె ధాత్రికి దిక్కులవారినెల్లఁ దో
డ్కొని చనుదెమ్ము నీ' వని కడుం గుఱిసేసి సురాధినాథుఁ డ
వ్వనపతి కంపినట్టి శుభవార్తల బంగరుఁగమ్మచుట్ట నా
దినకరమండలం బపరదిగ్గిరికూటముఁజేరె నయ్యెడన్‌.
93
క. నందకుమారానుజయఱు
తం దన నందనుఁడు గట్ట దైవతపతి వే
డ్కం దెచ్చుతాళిబొట్టనఁ
జందురుఁ డరుణరుచిఁ బ్రాగ్దిశం గన నయ్యెన్‌.
94
సీ. కులదేవతను దెచ్చి నిలిపిరి మాణిక్య చకచకల్‌ గలపెండ్లిచవికెదండ
నైరేనిఁ గొనివచ్చి రైదువుల్‌ పాటలు పాడుచు శుభవేళ వేడు కలరఁ
బులుకడిగినముత్తెముల బాసికంబులు సరవిఁ గట్టిరి నేర్పు సంఘటిల్లఁ
దలఁబ్రాల కేర్చి ముక్తామణుల్‌ నించిరి పసిఁడిపళ్లెముల సంభ్రమము మీఱఁ
 
తే. బణవశంఖ ఢమామికాపటహ కాహళారవంబులు నెఱపిరి బోరు కలఁగ
సకల వినియోగముల జనుల్‌ సకులె గాఁగ నంతిపురమున నుత్సవం బయ్యె నపుడు.
95
తే. 'తడవు సేసె ముహూర్తంబు దగ్గఱించె
నేమొకో యన్న రాఁ' డని యెదురుచూడఁ
దనదుగారాబుఁ జెలియలి మన సెఱింగి
మాటలోపల వచ్చె నమ్మాధవుండు.
96
క. ఒక రొకరి నెఱుఁగ కుండఁగ
నొకరివెనుక నొకరు వచ్చి రొక నెపమున నా
నకదుందుభి సారణసా
త్యకులును బ్రద్యుమ్నసాంబు లక్రూరాదుల్‌.
97
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )