కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
ఇంద్రుఁడు కొడుకు పెండ్లి చూడ స్వర్గము నుండి వచ్చుట
క. హరి వచ్చునంతలో నా
హరియుం జనుదెంచెఁ దనయుఁ డాత్మఁ దలంప\న్‌
సుర లచ్చరలు మహర్షీ
శ్వరులు నరుంధతియు గురుఁడు శచియు\న్‌ దానున్‌.
98
ఉ. చక్కెరవింటిరాజు నెకసెక్కెము లాడఁగఁజాలు నెక్కుడుం
జక్కఁదనంబు గల్గు నెఱసాహసపుంగొమరుండు మ్రొక్కఁ గా
నక్కునఁ జేర్చి మే నిమిరి యౌదల మూర్కొని చొక్కు చుండె లో
నెక్కొనువేడ్క నిక్కుచెవినీలని నెక్కు వజీరుఁడయ్యెడన్‌.
99
మ. సుముహూర్తం బిదె లెం డటంచు గురుఁ డచ్చోఁ దెల్ప దేవేంద్రుఁడుం
దమదేశంబున నుండి తెచ్చినసువర్ణక్షౌమకోటీర ము
ఖ్య మణీభూషలతోడ బాసికము సింగారించి మందార దా
మము కంఠంబునఁ జేర్చి పెండ్లికొడుకుం బ్రాగ్దంతి నెక్కించినన్‌!
100
వ. అయ్యవసరంబున. 101
సీ. ఉపరిభాగనిరంతరోన్నమితము లైన ముత్యాలగొడుగులమొత్త మలర
నుభయపార్శ్వముహుర్ముహుశ్చాలితము లైన వింజామరలకలాపుంజ మమరఁ
గళ్యాణవైభవకర్ణేజపము లైన తూర్యనాదములచాతుర్య మొనరఁ
బృథుల బ్రదక్షిణార్చిర్మేదురము లైన దివ్వటీల సమిష్టి నివ్వటిల్ల
 
తే. నపుడు ప్రద్యుమ్నుఁడు జయంతుఁ డవల నివలఁ బసిఁడి బెత్తంబులను బరాబరులు సేయ
నడచి వచ్చిరి హరిపురందరులు మ్రోల సంభ్రమంబున మందహాసంబు దొలుఁక.
102
చ. అనిమిషభావ మీసమయమందు ఫలించె నటంచుఁ గోరికల్‌
వెనుకొనఁ బైనిపైని పడి వే తటకాపడి యుర్వశీవిలా
సిని మొదలైన యచ్చరలు చెంతలఁ జేరి సహస్రదృక్తనూ
జుని యొడలెల్లఁ గన్నులుగఁ జూచిరి మానసముల్‌ కరంగఁగన్‌.
103
ఉ. దేవకియింట నుండి యి టుదీర్ణతఁ బెండిలికూఁతు రున్నభో
జావనిజానిజా నిజగృహాంగణసీమకు నేఁగి యెంతయు\న్‌
ఠీవి ఘటిల్ల సాత్యకి వడిం గయిలా గొసఁగం గిరీటి యై
రావతము\న్‌ డిగె\న్‌ ద్విజపురంధ్రులు ముత్తెపుసేసఁజల్లఁగన్‌.
104
తే. నరవరోత్తముఁ డటు శుభోత్తరము గాఁగఁ
గుడిపదము మున్నుగా నిడి గడప దాఁటి
యారతు లొసంగ దీవన లావహిల్ల
మోదమున నేఁగెఁ గళ్యానవేదికడకు.
105
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )