కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
సుభద్రార్జునుల వివాహ వైభవము
శా. శ్రీరంజిల్లఁ బసిండి పెండ్లిచవికం జేరంగ నవ్వేళఁగ
న్యారత్నంబును దోడితెచ్చిరి జనానందంబుగాఁ బాడుచున్‌
బేరంటాం డ్రురుమంత్ర వర్ణపఠనాప్తి\న్‌ గర్గుఁడు\న్‌ దేవతా
పౌరోహిత్యధురంధరుండు శుభమొప్ప\న్‌మ్రోలనేతేరఁగన్‌.
106
క. 'మెత్తుముగదె మన మెపుడుఁ ది
లోత్తమచక్కఁదన మీతలోదరియెదుట\న్‌
మెత్తఁబడె దానిచెలు' వని
యత్తఱి గుసగుసలఁ బోయి రచ్చర లెల్లన్‌.
107
తే. 'వేయుఁగనులు వలయుఁ బో వీరిఁ జూడ'
నని కవుల్‌ఁ దంపతులచెల్వు వినుతిసేయఁ
'గాదు పదివేలకన్నులు గావలె' నని
చూచుచుండె సహస్రవిలోచనుండు.
108
చ. కలరొకొ యెవ్వ రైన నవుఁగా దని యడ్డమువల్కువార లీ
యిల మఱిఁ దా నెఱుంగనటు లెంతటిమాయలకాఁడు కన్యకా
తిలకము దారవోయ వసుదేవునిఁ గట్టడ సేసి వేయిక
న్నులుగల వేలుపుంబలెఁ గనుఁగొనుచుండె మురారి చెంగటన్‌.
109
క. మధుకరవేణులు కొందఱు
మధురోక్తులు వెలయఁ దెర యమర్చిరి సరగ\న్‌
మధుమథనజనకుఁ డంతట
మధుపర్క మొసంగె నృపకుమారాగ్రణికిన్‌.
110
తే. దేవకి యొసంగఁ గా వసుదేవుఁ డపుడు
చంద్రకాంతపుగిండి గొజ్జంగనీటఁ
బసిఁడిపళ్లెములోఁ బదాబ్జములు గడిగి
తనదు మేనల్లునకుఁ గన్య ధారవోసె.
111
ఉ. సూరెలఁ జేరి యష్టమహిషుల్‌ దగువారు పొసంగ నావలం
గోరిక నిక్కినిక్కి కనుఁగొంచు సుపర్వు లెసంగ వాద్యముల్‌
బోరు కలంగ నంగములు పొంగ వధూవరులం గడానిబం
గారపు మెట్టుఁ బ్రాలపుటికల్‌ గదియించిరి కొంద ఱైదువల్‌.
112
క. వడిఁ దెఱవల్‌ తెర వంపం
బడఁతుక నగుమొగము కానఁబడియె\న్‌ గాంతల్‌
బదఁబడఁగ శరన్మేఘము
బెడఁబాసి చెలంగు చంద్రబింబమువోలెన్‌.
113
క. అమృత మొలుకు నధరంబునఁ
గుముదచకోరముల నేలుకొనుశుభదృష్టి\న్‌
గమలములకళలు గైకొను
రమణీమణి ముఖముఁ దెఱచి రా జన వలెనా?
114
చ. పొలయలుకందు వేఁడుకొను పొందికఁ దెల్పెడులీల సిగ్గుదొ
ట్రిలిన ముఖాబ్జ మెత్తి మెడ క్రిందికి హస్తయుగంబుసాఁచి వే
నలిఁ దెమలించి సౌఖ్యకలనస్థితి గట్టిగఁ బట్టి కట్టె న
వ్వెలఁదుక కంఠసీమఁ గురువీరుఁడు మంగళసూత్రమయ్యెడన్‌.
115
చ. తమతమవార లొండొరులదండఁ గరంబుల ముత్తియంపుఁబ
ళ్లెము లిడి చేయిమించఁగవలెం జుమి నీ కని యెచ్చరింపఁగా
నమితముగా సుభద్రయు నర్జునుఁ డర్జునుపై సుభద్రయుం
దమిఁదలఁబ్రాలు వోసి రెలనవ్వును సిగ్గును లోఁదొలంకఁగన్‌.
116
తే. అగ్ని సాక్షిగఁ బెండ్లాడినట్టి ప్రియవ
ధూటియును దాను బంగారుపీఁటమీఁద
నుచితగతి వెలయంగఁ గూర్చుండి పాక
శాసని చెలంగె దీవించి సేస లిడఁగ.
117
తే. మృగమదము చెంతఁ గుంకుమరేఖవోలె
నీలమణిపొంత నుదిరిపొన్రేకువోలె
మేఘముకుఱంగటను దీగ మెఱపువోలె
నర్జునునిచెంగట సుభద్ర యలరె నపుడు.
118
చ. కలుగుఁ గలావిషేషము జగంబునఁ బెండ్లి యటన్న నెట్టివా
రల కటువంటిపట్ల నెలప్రాయము రూప మొయార మూని పే
ర్కలిగిన రాచకూఁతు రఁట రాకొమరుం డఁట యేమి చోద్య మా
సొలపుమిటారిసిగ్గరులు చూపఱచూడ్కికి విందు సేయుటల్‌?
119
క. అంతటఁ బౌలోమీమఘ
వంతులకుం బెండ్లికొడుకు వందన మిడఁ ద
త్ప్రాంతమునఁ బెండ్లికూఁతురు
గొంతటు తల వంచి మ్రొక్కఁ గొంకుచు నున్నన్‌.
120
శా. ఎంచం గాఁ దగు నత్తమామలను దా నిల్వేల్పులం గా మనః
ప్రాంచద్భక్తిని సాధ్వి యందు రది మీపట్లన్నిజం బయ్యె నేఁ
డంచుం జేరి శచీపురందరుల కాహ్లాదంబుగాఁ బల్కి మ్రొ
క్కించె\న్‌ దేవకి యప్పు డర్ధహిమరుగ్బింబాలిక\న్‌ బాలికన్‌.
121
మ. ప్రణయం బొప్పఁగఁ గృష్ణునిం గని సుపర్వస్వామి 'యీ సర్వల
క్షణముల్‌ గల్గినకన్య మంచివరునిం గాఁ జూచి యీ నేర్చు నై
పుణి మీకే తగు'నంచుఁ బల్కఁ 'బరమాప్తుల్‌ మీరు రాఁగా విజృం
భణవృత్తి\న్‌ నెఱవేఱెఁ బెండ్లి' యని పప్పద్మాక్షుఁడుం బల్కఁగన్‌.
122
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )