| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| వియ్యాల వారి మర్యాదలు - సయ్యాటలు | ||
| సీ. |
వియ్యంపుమర్యాద వెలయఁ దానును శచీ జాని బువ్వాన భోజనము సేసి గుమగుమవాసించు కుంకుమ కస్తూరి యమరవల్లభుని హస్తమున కిచ్చి గంబూర గుల్కినతాంబూల మింద్రుఁ డం దుకొని తా సేనాని దోయిట నిడి పీతాంబరముల విప్పి యనేకములు వజ్రి చేతిసంజ్ఞ జయంతుచేతి కొసఁగి |
|
| తే. |
కేలఁ గే ల్వట్టి కొన్ని వాకిండ్లు గడచి రాఁగ విచ్చేసి యుండుఁడు రా వల దని బలిమి బలభేది యెదురుగ నిలిచి మ్రొక్క వేడుక మురారి కేల్మోడ్చి వీడుకొలిపె. |
123 |
| క. |
అంతకు మునుపే హరి య త్యంతకుతూహలముతోడఁ దగుమేరల న య్యంతఃపురి భోజసుతా కాంతను బౌలోమి ననుపఁ గట్టడ సేసెన్. |
124 |
| తే. |
రుక్మిణీదేవి తమయత్తమ్రోల శచికిఁ బసిఁడిగిన్నియఁ గస్తూరి యొసఁగ నామె చేఁ దిగిచి దేవకీదేవిమీఁదఁ జిలికి వదినెగా రని యొకకొంత వావి నెఱపె. |
125 |
| ఉ. |
'వీయపురల వైతి గదవే యిపు డత్తవు తొంటివావి నో తోయజనేత్రుఁ గాంచిన వధూమణి! నీసుతఁ బెండ్లియాడఁగా నాయము నాకుమారునకు నర్మిలి హత్తఁగ నత్త వావిచే నాయువు గల్గువాఁడవు నటండ్రు శుభంబగు దీననెంతయున్.' |
126 |
| తే. |
అని సరసలీల నుడుగర లంది యపుడు పారిజాతంబుకతన ము\న్ బరిచయంబు చాలఁ గల్గుటఁ బ్రియముతో సత్యభామ తనకు మ్రొక్కిన నింద్రాణి నెనరుతోడ. |
127 |
| ఉ. |
'చెల్లెల! లెస్సలా పెరటిచెట్టుగ నాటిన పారిజాత ము త్ఫుల్లనవీనసూనములతో విలసిల్లుచు నున్నదా? సదా యుల్లముదానిమీఁదటనె యుండును నాకది ప్రాపుఁ బ్రోపుఁబు ట్టిల్లును జొచ్చి నిల్లునయి వృద్ధినొసంగెడు నీకు నెంతయున్.' |
128 |
| క. |
అని యుచితోక్తుల వారల మనముల రంజిల్లఁ జేసి మన్ననతో న య్యనిమిషలోకాధీశ్వరు ననుఁగుంబట్టంపుదేవి యరిగిన యంతన్. |
129 |