| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| సుభద్రార్జునుల యింద్రప్రస్థపురీ ప్రయాణము | ||
| తే. |
'ఏల యాలస్య మిఁక నిందుఁ బ్రోలు సొచ్చి నాగవలి సేయుదురుగాక వేగ కదలి పొండు దంపతు' లని ధనుష్కాండరథహ యంబుల నొసంగి నరుఁ బయనంబుసేసి. |
130 |
| ఉ. |
చంద్రకిపింఛలాంఛనుఁడు చంద్రిక లీనెడు నవ్వు మోముతో నింద్రజురాక ధర్మజున కేర్పడఁగా శుభలేఖ వ్రాసి వే చంద్రిక పెట్టి యందుపయిఁ జెంద్రికవన్నియసాలు సుట్టి ని స్తంద్రతఁ దానెముద్రయిడి చారులచేఁబనిచె\న్ రయంబునన్. |
131 |
| క. |
ఈరీతి నన్ని యమరిచి యారాతిరె యేఁగి శౌరి యడఁకువ నుండె\న్ సీరికడ దేవకియుఁ దన గారాబుఁగుమారి నంపఁగా రమ్మనుఁడున్. |
132 |
| తే. |
అత్తవారింట సకలభాగ్యంబు లున్న మగనిమీఁదటఁ దన కెంత మక్కువున్న నాఁడుఁబుట్టువు పుట్టింటి కాసపడును గావున సుభద్ర యొకతీరుగాఁగ నుండె. |
133 |
| తే. |
తల్లిదండ్రులు గారానఁ దన్నుఁ బెనుప వదినె లన్నలుఁ గడుగారవంబు నెఱప నల్లయూరంత బలఁగంబునందు నుండి యొకతె యెడఁబాసి పోవ నెట్లోర్చు మనసు. |
134 |
| క. |
అట్టుల తొంగలిఱెప్పలఁ దొట్టెడు బాష్పములతోడఁ దొట్రిలుముద్దుం బట్టిఁ గని కడుపు చుమ్మలు చుట్టఁగ నది మట్టుపఱిచి శుభ మొనరంగన్. |
135 |
| తే. |
'వింతఁటే యేమి? మేనత్త గొంతిదేవి కోరి వెండియుఁ బెండ్లాడినారు మీర లొండొరులు నీవిభుండు లోకోత్తరుండు దొరకెను సుభద్ర! మంచికాఁపురము నీకు. |
136 |
| క. |
ఈలోనఁ జూడవచ్చెద మేలే చింతిల్లె?' దనుచు నెంతయు బ్రేమ\న్ గేలం గ్రొమ్ముడి దువ్వుచు బాల\న్ దీవించి తల్లి పనుప\న్ వేడ్కన్. |
137 |
| మ. |
సకియ ల్గొందఱు వెంత వచ్చి మణిభూషల్ చక్కఁగాఁ దీర్చి చెం ద్రికపూవన్నియజిల్గుఁజేల కటినెంతే గట్టిగాఁ జుట్టి పెం డ్లి కుమారుండు కరాగ్రమూఁత యొసఁగ\న్ వ్రీడావతిం దేరి మీఁ దికి నెక్కించిరి మందహాసకలనా దేదీప్యమానాస్యలై. |
138 |
| తే. |
అటులఁ దేరెక్కి దంపతు లరుగఁ జూచి జనులు 'రతిమన్మథులు వీర' లని తలఁచిరి హరితురంగము లించువి ల్లలరుఁదూపు లంద యుండంగ సందియ మంద నేల? |
139 |