| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| యాదవసేన సుభద్రార్జునుల నడ్దగించుట | ||
| ఉ. |
పచ్చని పచ్చడంబు దొర పంపిన త్రోవనె పోవునంతలో నచ్చటఁ దెల్లవాఱ 'నితఁ డర్జునుఁ, డీమె సుభద్ర వీరిఁ బో నిచ్చిన మాట వచ్చు బలకృష్ణులచేతఁ' నటంచుఁ దారు తా రెచ్చటికై పృథుశ్రవసుఁ డేలిక గాఁ గలప్రోలికాపరుల్. |
140 |
| క. |
అల బలము లసంఖ్యము లై యలబలములు చేయుచుండ నప్పుడు కలఁకం గలకంఠీమణి రిపుమద కలకంఠీరవుని ధవునిఁ గని విస్మిత యై. |
141 |
| పంచ చామరము. |
'హుటాహుటి\న్ హలాయుధుండహో! మహోగ్రుండై తనం తటం దటాన నిప్పు డీవిధం బెఱింగి వచ్చెనో? ఘటాఘటీల నెల్లఁ ద్రోవఁ గట్టి పట్టఁ బంచెనో యటో యిటో యెటో భటోద్భటార్భటుల్ ఘటిల్లెడున్. |
142 |
| తే. |
తేరుగడఁప మాయన్న దిద్దె నన్ను నేయ నేరిపె వింట నొక్కింత నాకు నావదినె సత్యభామ ము న్నరక యైన నిలిచి ము న్నరకాసురు గెలిచెఁ గాదె?' |
143 |
| క. |
అని రాజకన్య గావున మనమునఁ గలధీరతయును మమతయుఁ దెలుప\న్ విని యఁట దరహాసంబున నునుఁజెక్కిలి చికిలిగోట నొక్కుచు వేడ్కన్. |
144 |
| క. |
'న న్నెవ్వనిఁగా జూచితి? కన్నియ! నీచేయునంత కార్యం బిట నే మున్నది? చూడుము చెండెద ఛిన్నాభిన్నములు కాఁగ సేనల నైనన్. |
145 |