కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
సుభద్రా సారథ్యము - అర్జునుని యాహవ వీరము
క. నీవేడు కేల కాదనఁ
గావలె? నటువలెనె తేరు గడపు' మటంచు\న్‌
జే విలునమ్ములు గైకొని
నా విజయుఁడు సమరసన్నహనదోహలుఁడై.
146
ఉ. అంతటిలోఁ బృథుశ్రవసుఁ డాదిగఁ గల్గినవీరయోధు ల
త్యంతకఠోర తోమర శరాసనబాణ కృపాణపాణులై
పంతము లాడుచుం బదరి పైఁ బడఁ జూచుబలంబు లెల్లఁదా
మంతట నంతట న్నిలిపి యడ్డముగం జని యాధనంజయున్‌.
147
ఉ. 'స్యందనము\న్‌ దురంగములు శౌరివె పో బలరాముచెల్లె లీ
ఇందునిభాస్య యీమె నెట కెత్తుకపోయెదు రాకుమార? యే
మందురు యాదవుల్‌ వినిన? హా యిటువంటివె రాచవారితోఁ
బొందులు? కానకుండఁ గొనిపోఁ దగవా మిమువంటివారికిన్‌?'
148
క. అనుటయు 'నేమీ కనినం
గనకుండిన? నానఁ బూనఁగలరా మీరల్‌?
మనవలసిన నీమాటలఁ
బనిలేదు చనుం' డటంచు బైఁ బడి రాఁగన్‌.
149
ఆ. రాకురాకు మనెడి రట్టడితనములు
పోకుపోకు మనెడి పొగరువగలు
పొడువు పొడువు మనెడి బెడిదంపుబీరముల్‌
విడువు విడువు మనెడి వీఁక లెసఁగ.
150
ఉ. ముందరవెన్క నీకరణి ముంచుకొనం జలియింప కిం పొన
ర్పం దరళాక్షి తేరుగడప\న్‌ గడకంటనె పాఱఁ జూచి విం
టం దొడి యేయుటల్‌ బయలొనర్పక యెంతటినేరుపౌర! పౌ
రందరి యందఱి\న్‌ శరపరంపర వెంపరలాడె నయ్యెడన్‌.
151
సీ. కొండలవలెనున్న కొమ్ముఁగత్తులభద్ర దంతావళముల మొత్తములు బలసి
యంబుధితెరలచందంబునఁ దుటుములై భాసిల్లు కంఖాణబలము లొదవి
విరివియై మేఘముల్‌ పెరిఁగి వచ్చినజోక ఘనపతాకల శతాంగములు హత్తి
వెదురుపొదల్‌ పేర్చువిధమునఁ గనిపించు గడలపౌఁజులు సమగ్రముగఁ గూడి
 
తే. యుక్కుపొడిరాల రోషంబు పిక్కటిల్ల నొకరొకరిఁ గేవవెట్టు నత్యుగ్రసింహ
రవములు చెలంగ సైనిక ప్రభులు తారసిలి రుదారశిలీముఖార్చులు నటింప.
152
ఉ. ఎత్తిన యాయుధంబు లవి యెన్నియొ యన్నిటినన్నితూపుల\న్‌
దుత్తునియల్గఁ జేయు మరి తోడనె పూనఁగఁ జేతులాడ నీఁ
డత్తరుణీరథాశ్వములయండకు రావిడఁ డంప తున్క యే
నత్తరి నాతఁ డేమనఁగ నా శరలాఘవసావధానతల్‌?
153
మ. రకపుంజెయ్వులఁ దా వినోదముగ సారథ్యంబుఁ గావించు క
న్యకపైఁ బెట్టిన చూపె కాని యిటు సేన\న్‌ జూచుటే లేదు సా
యకపంక్తుల్‌ నడుచు\న్‌ సహస్రములు గా 'నయ్యారె! వివ్వచ్చు చే
తికిఁ గన్నుల్‌ గల!' వంచు నెంచి రపు డెంతే వీరయోధాగ్రణుల్‌.
154
ఉ. 'శూరకులంబు సర్వ మొకజో కయి వచ్చి యెదిర్చె నేని నే
నీశిరోమణి గ్రహింపక పో' నని గట్టిగా నహం
కారము మీఱఁ గంకణము గట్టుక యుందెడు నిప్పు డర్జునుం
'డౌర రణంబు పెండ్లికొడు' కంచు నుతించిరి వీరపుంగవుల్‌.
155
ఉ. అమ్మెయి వాజివారణభటావళిఁ గప్పిన తూపు లే మన\న్‌?
దిమ్మలుగాఁ దటాకముల నిండుశరమ్ములఁ బుష్పవాటులం
గ్రమ్ము శిలీముఖంబుల ధగద్ధగితోన్నత సౌధగోపురా
గ్రమ్ములయందు వ్రాలెడుఖగమ్ముల నెన్నిన నెన్న శక్యమే?
156
క. అలుఁగులపోకడలును మై
యలయికలను మీఁదుమిక్కి లై కడు లోనై
బలములు తమతమబాహా
బలములు నఁటఁ బనికి రాక భయవిహ్వలులై.
157
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )