కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
విజయుని విజయము
ఆ. ఒక్క మొగము గాక యుఱికిరి సైనికుల్‌
దిక్క మొగము లగుచుఁ జిక్కు భటులు
మ్రొక్కి రీటియలు తటుక్కునఁ బడవైచి
యక్కిరీటి యెదుట నాఁగఁ గలరె?
158
వ. ఇత్తెఱంగున జయాంగనాసంగమంబునం బొసంగియుఁ జెక్కు చెమర్చక యక్కురువీరుండు సారథ్యనిపుణత్వంబునకు మెచ్చి యచ్చిగురుఁబోఁడి నవారితప్రేమాతిశయంబునం గౌఁగిలించి 'యొక్కించుక రేక మోవని నా యురః స్థలంబున నీకుచకుంకుమ రేఖ లంటించి మీవారికి సూడు దీర్చితి' వని నవ్వుచు, నవ్వలం గొంత దవ్వరుగుచు నట ప్రచ్ఛన్న వేషంబునఁ దన రాక కెదురుచూచుచున్న విశారద ప్రముఖాప్త పరివారంబుల గారవించి. మురారిప్రేరిత దాశార్హనివేదితార్హ మార్గంబున మహారణ్యంబులును గిరివరేణ్యంబులును నదీనదంబులను జనపదంబులుం గడచి, స్వదేశంబుఁ గాంచి, యుల్లాసంబున నందంద విశ్రమించుచుఁ జనం జనం, జారుల వలనం దెలిసి యగ్రజానుశాసనంబున నానాసేనాసమన్వితులై మాద్రీసుతు లెదుర్కొని యుపాయనానతులు సమర్పింప నుపగూహన బహూకృతు లొనర్చి, దశదిశాదుస్సహనిస్సాణ ప్రముఖనిస్వనంబులు బోరుకలంగ నలంకృతనిస్తుల స్తంబేరమారూఢుండై గగనోల్లేఖి తోరణధ్వజోల్లోచప్రాంచత్సిచయ ప్రచయ ప్రచలత్ప్రచలాకిచిత్రచ్ఛవివ్యాప్త హేమచ్ఛవి ఫలగుళుచ్ఛ విరాజద్రాజరంభాస్తంభ విజృంభిత ప్రతిమందిరంబును, విలోకిత బిబ్బోకవతీ వ్యాకోచలోచన ప్రాచుర్య విభ్రాజమానతనూజోత్సవ దిదృక్షా గృహీతానేక విగ్రహ సహస్రాంబక విడంబిభర్మ హర్మ్యనికురంబంబును, నీరాజనలాజాక్షత కుసుమ కిసలయ వ్యాకీర్ణ కలశ గ్రహయాళుమహీ లేఖ మహిళా భూయిష్ఠ ద్రాఘిష్ఠవేది కాంతరంబునునగు నింద్రప్రస్థపురంబును సకల జన రంజన కుశల విశాల కటాక్ష కృపా రసావేశంబునఁ బ్రవేశించి మున్ను సుభద్ర ముహూర్తంబున సుభద్రా భద్రేభయానం జతురంతయానంబున శుద్ధాంతంబున కనిపి ధౌమ్యాదుల కభివందనంబుఁ గావించి యాశీర్వాదంబులు గైకొని, నిజాగమన సంతోష రసోన్మేష భూషిత సుప్రసన్నాననబిస ప్రసూనుండును రత్న సింహాసనాసీనుండును నగు ధర్మసూనునకు సాష్టాంగం బెరఁగి, భీమసేనునకు నమస్కరించి, యంతఃపురికిం జని కుంతీదేవికి వందనం బాచరించి, ద్రుపదనందన నుపచరించి, యిష్టాలాపంబుల సుఖంబుండె. 159
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )