| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| సుభద్రాపహరణ వృత్తాంతము తెలిసి బలరాముఁ డాగ్ర హోదగ్రుఁ డగుట | ||
| ఉ. |
అంతట ద్వారకాపురమునందు సభాపరిపాలుఁ డర్జునో దంతము యాదవుల్ దెలియునట్లు హజారమునందు భేరి య త్యంతరుషాకషాయిత హృదంతరుఁడై చఱపించె మించె ది గ్దంతిఘటాశ్రవఃపుటభిదాచణ భీషణ భూరిభాంకృతుల్. |
160 |
| క. |
ఆనాదము విని హలి మొద లైన యదూద్వహులు పురికి నరిదెంచి సభా సూను లయి నరునికపటవి ధానము మఱి మఱియు నడిగి తప్తాశయు లై. |
161 |
| తే. |
"యతి ననుచు వేషభాషల నటమటించి పొంచి తఱి వేచి కన్నియఁ గొంచు నరిగె 'దొరఁకు సన్నాసి' యనుమాట తిరము గాఁగ నర్జునుం డద్దిరా యెంతదుర్జనుండు! |
162 |
| శా. |
ఏతన్మాత్రమె కార్యభార మని పైయెత్తెన్నకే నేఁడు ని ర్భీతి\న్ బాలికఁ గొంచుఁ బోవ నుచితంబే కండగర్వంబు? దు ర్నీతుల్ యాదవవీరసింహములతోనేనా? బలారా! బలా రాతి ప్రోద్భవుఁడెంత సేసె! నిది తీరా వీరరాణ్మౌళికిన్? |
163 |
| ఉ. |
వంచన చేసి యిట్లు చెలువం గొనిపోవఁ బ్రలంబవైరి సై రించునె? దుర్మదాధిపవరేణ్యులభూములు దున్ని ధూళి గా వించఁడె? పిండిపిండిగఁ బ్రవీరవిరోధికిరీటరత్నము ల్దంచఁడె? ఘోరసీరముసలంబుల వ్యర్థములే ధరించుటల్?" |
164 |
| క. |
అని కాళిందీభేదనుఁ డనువాక్య మొకింత విన్న యంతనె మేఘ ధ్వని గెరలెడు మదకేసరు లన యోధాగ్రేసరులు మహామత్సరులై. |
165 |
| ఉ. |
'యాదవవార్ధి వెల్లివిరియ\న్ మఱి యాఁగెడుపాటివీరుఁ డి మ్మేదిని నెవ్వఁ డిందులకు మీరలు గావలె? నేమె చాలమే? పోదుమె? కట్టి తెత్తుమె? ఋభుప్రభునందనుఁ డెంత? వానితం డ్రే దురమం దెదిర్చినను రేకు మడంతుము మాటలేటికిన్?' |
166 |
| తె. |
అని యుదగ్ర మహాగ్రహావ్యగ్రుఁ డైన యన్నమాటలు సభవార లన్నమాట లేమి చవిగామియును దాల్మి యోమి భక్త జనకుశలకామి యల యదుస్వామి కనియె. |
167 |