కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు బలరాముని శాంతపఱచుట
క. 'యదురాజకుల శిరోమణి!
యెదురా మీ కొకరుఁ? డుచిత మెఱఁగియుఁ బరు లెం
చ దురాప కోప మూనుట
చదురా? తెగరానిచోట సైరణ తగదే!
168
క. ద్రోణాచార్యుల శిష్యుఁడు
బాణాసననిపుణుఁ డరినృపాలకమకుటీ
శాణాగ్ర తేజితోగ్ర కృ
పాణాంచద్భుజుఁ డతండు ప్రభుమాత్రుండే!
169
ఉ. ఆపురమర్దనుండయిన నాతని నడ్డము దాఁకి నిల్వఁగా
నోపఁడు మత్స్యయంత్రము మహోద్ధతి నేసి స్వయంవరంబున\న్‌
ద్రౌపదిఁ గైకొనం జెనకు రాజకుమారులపా టెఱుంగమే
మూఁపులు మూఁడగు\న్‌ రిపుచమూపులఁ గన్నపు డేకిరీటికిన్‌.
170
ఉ. మాలిమి లేదు గాన ననుమానము నామదిఁ దోఁచె నప్పుడే
బాలిక సేవ సేయఁ బనుప\న్‌ వలదంటిని గాదె? దాని కే
మీలువు కల్గు మేనమఱఁ దింతియె యాతఁడు నైన దైనదే!
లోలత నింక నాగవలిలోపల నిష్ఠుర మేల పల్కఁగన్‌?
171
ఉ. క్రీడి సమాను లెంచఁ గలరే యిల ఱేఁడులలోన? దూలఁబో
నాడఁడు వైరినైన విడనాడఁడు నెయ్యము కోపగించియుం
జూడఁ గలట్టివాఁడు సరసుండు సుభద్రకు హర్షవార్ధినో
లాడఁగ నంతకంటె నను వైన వరుం డిఁక నెవ్వఁడివ్వలన్‌.
172
ఉ. నమ్మినవారు పాండునృపనందను లందఱలోనఁ బెద్దగా
మిమ్మె గణించు ధర్మజుఁడు మీ రటకు\న్‌ విజయంబు సేయ వే
గ మ్మెదురేఁగుదెంచి కడుఁ గన్నులఁ గప్పుకొనుం బదుం' డనం
దమ్మునిమాట యన్న జవదాఁటనియన్న ససంభ్రమంబుగన్‌.
173
మ. గజకంఖాణశతాంగపత్తిబలవర్గంబుల్‌ సమగ్రంబు లై
భజియింపం బితృపుత్రపౌత్ర సుహృదాప్తశ్రేణిఁ గూడం బ్రియా
నుజుఁడుం దాను సమస్త వస్తు ధన సందోహంబుతో వచ్చె స
ర్వ జనానందకరంబు గాఁగ నటు లింద్రప్రస్థము\న్‌ జేరఁగాన్‌.
174
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )