కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
ధర్మరాజు బలరామాదుల సగౌరవముగ నెదుర్కొనుట
ఉ. అంతకు మున్నె కృష్ణుఁడు హలాయుధుఁ దోడ్కొని వచ్చుచున్న వృ
త్తాంత మెఱింగి ఠీవి మెఱయ\న్‌ నగరిం గయి సేయఁ బంచి య
త్యంతవినీతి ధర్మజుఁడు తమ్ములుఁ దానెదురేఁగి రేవతీ
కాంతునకుం బ్రణామములుఁ గాన్కలు సేసి యథా క్రమంబునన్‌.
175
మ. చెలువం దెచ్చుచునుండి యీసున శునాసీరాత్మజుం డమ్మహా
బలముం జేరఁగ బోరు మేదుర దురాప క్రోధముం బాసి లో
నలరం గౌఁగిటఁ జేర్చె శంభుజభుజాహంకారరేఖానిర
ర్గళమార్గ ప్రబహుంబ్రలంబహుబహూకారంబుగాఁ బల్కుచున్‌.
176
ఉ. బావ యటంచు వావి నడప\న్‌ భయభక్తుల మ్రొక్క వచ్చున
ద్దేవకిపట్టి ధర్మజుఁ డతిత్వరితమ్ముగఁ గ్రుచ్చి యెత్తి త
ద్భావమెదం గుదుర్పడఁగఁ దార్చిన భంగిఁ గవుంగిలించి, 'మా
కీవ గదయ్య సర్వశుభహేతువు నిచ్చలు' నంచు నెంచుచున్‌.
177
తే. కెడల బలరామకృష్ణులు నడుమఁ దాను
భద్రదంతావళము నెక్కి పాండవేయ
ముఖ్యుఁ డతిరాజసంబున మువ్వెలుంగు
పోలికఁ బొసంగ వచ్చెను బ్రోలి కపుడు.
178
ఉ. అంతిపురంబులో నరిగి యందఱు వందన మాచరింప నా
కుంతికి మ్రొక్కి భక్తిఁ దమకుం బ్రణమిల్లిన ద్రౌపదీసతి\న్‌
స్వాంతము రంజిలం బలికి శ్యామహరిత్పరిధాను లొప్పి రం
తంతకు నిష్టబాంధవసమాగమసౌఖ్యమునం జెలంగుచున్‌.
179
క. దొర పెట్టినహరు వెట్టిదొ
యరు దాహా! విడుదు లున్న హవణిక లులుపా
పరిఢవము నింద్రభోగమె
దొరకెను దమ కననివారు తుది లే రొకరున్‌.
180
క. వీయమువారికి నిట్లు ద
వీయముగా నుండి వచ్చు విపుల శ్రమముల్‌
దీయ ముదం బొనరిచి కడుఁ
దీయము కనిపింపఁగా యుధిష్ఠిరుఁ డనియెన్‌.
181
క. 'చనవున బలిమిం గన్నియఁ
గొని వచ్చి వివాహ మౌటకు స్వతంత్రులఁ గా
నొనరించినార మము ని
ట్లనుకూలత గల్గు బంధు లవనిం గలరే.
182
తే. ఆదినారాయణుం డీ మురాసురారి
యురగకులభూషణుండ వీ వరసిచూడ
నిట్టి మీ బాంధవము గల్గ నెట్టితపము
చేసినార మొకో మేము సీరపాణి!'
183
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )