| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| బలరాముఁడు సుభద్రార్జునుల వివాహము నతివైభవముగ జరిపించుట | ||
| చ. |
అని ప్రియభాషణంబుల మనోఽబ్జము రంజిలఁ జేయ సంభ్రమం బున హలి 'సర్వసన్నహనముం దగ ని ట్లెదు రేఁగి పెండ్లి చే సిన దొర యెందు లేఁ'డనఁగఁ జెల్లెలి ముద్దుమఱందిఁ గోరికల్ పెనఁగొనఁ బెండ్లికూఁతుఁగనుఁ బెండ్లికుమారుఁగఁ జేసి వేడుకన్. |
184 |
| సీ. |
సకల వాద్యములు బోరు కలంగ నెడమీక నలుఁగులు నులుపాలు నడచుచుండ నిఖిలబాంధవరాజనికరంబు మేలైన యుడుగరల్ గొని వచ్చి పొడగనంగ నాశ్రిత విద్వత్కవిశ్రేణులు యథేష్ట సంభావనలఁ జాల సంభ్రమింప విందులఁ గర్పూరవీటికాంబర వసంతముల నెల్ల జనంబు తనివి నొందఁ |
|
| తే. |
బ్రియము వినయంబు తాల్మి యోపికయుఁ గల్గి యచ్యుతాగ్రజభీమసేనాగ్రజన్ము లెంతటిమహాత్ము లని జగం బెంచఁ జేసి రుచితగతి నొప్ప వైవాహికోత్సవంబు. |
185 |
| ఉ. |
అంతట నైదునాళ్లును మహామహిమం దగి దంపతుల్ గృహా భ్యంతర దేవతార్యనతులై తన కర్మిలి మ్రొక్క రుక్మిణీ కాంతుఁడు వల్కె లేనగవు క్రమ్మఁగ 'మీరిటు లెల్ల కాలము\న్ మింతురుగాక శోభనముమీఁదనె శోభనమై ముదంబునన్.' |
186 |
| క. |
అని దీవించిన లోలో ననె ముసిముసినవ్వు లొలయ నమ్రానను లై తనరిరి వా రామాటకు పునరభివాదనము చేయుపోల్కి జనింపన్. |
187 |
| చ. |
తొలఁకెడు ప్రేమ బందుగులతో మణిపాత్రికలందు నప్పు డు జ్జ్వలదమృతాన్నముల్ కొలముసామికి నప్పనగాఁగఁబండువె న్నెలబయల\న్ భుజించి నెఱనీ టెసఁగ\న్ సగపాలు గంబురా గులికిన కమ్మవీడె మొకకోమలి యీఁ గొని క్రీడివేడుకన్. |
188 |