కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
పడుకటింటి చక్కందనము
ఉ. చందురుఱాతిబాగడపుజంటబవంతి వెడందయంకణం
పుందగులూని పార్శ్వమునఁ బొల్పగు పల్వగ కెంపుటంచు డా
కుం దెలిగుండుకంబముల క్రొంజిగిబోదెల నందగించి పై
సందులఁ బంచవర్ణమణిజాలకముల్‌ రహిఁ జూప లోపలన్‌.
189
ఉ. బంగరుమేలికంబములఁ బాటిలువాటపుమధ్యరంగము\న్‌
జెంగట జీవరత్నములచెక్కడపుంబని మించు సెజ్జయిల్‌
ముంగల వజ్రపుంబలుకలోనఁ బొసంగిన నొప్పు చప్పర
మ్ముంగల భావచిత్రనవమోహనకేళిగృహాంతరంబునన్‌.
190
చ. కెలఁకుల వజ్రముల్‌ నడుమఁ గెంపులు మూలల ముత్తెముల్‌ పర
స్థలములఁ బచ్చలుం సుళువుజాతితగంబని హర్వు నందము\న్‌
వెలయఁగఁ దేరి చూడఁ గడు వింతయుఁగోటికిఁ గోటియైనను
న్విలువ యొనర్పరానియొక నిద్దపుమంచముపై వసింపఁగన్‌.
191
ఉ. గోవజవాది కస్తూరియుఁ గుంకుమ గందము పైఁడి గిన్నెల\న్‌
దావి బుగుల్‌ కొనం గెలనఁ దార్చిరి పంజరకీరశారికల్‌
'దేవ! పరాకు సామి?' యని తెల్పఁగ రత్నపుఁగీలుబొమ్మలే
కావలెఁ గొందఱందు నుడిగంపుటొయారపు ముద్దుజవ్వనుల్‌.
192
క. అందలిక్రొందలిరుంబోం
డ్లందలి కందళితశుకముఖాలాపరసం
బందలి నుందలిమంబులు
నందలిబొందళపుఁ దెరలు నవలం గలవే?
193
ఉ. చక్కఁదనంబు లెల్ల నొక చక్కినె దొంతరగాఁగ నిల్చెనో
యెక్కడఁ జూడఁ జూడ్కికదియే విడిపట్టగుఁ జూడఁ జూడఁగా
మిక్కిలి వింతయై మెఱయు మెచ్చులకున్నెల వీదొకింతయ
మ్మక్క! గణింపఁగాఁదరమె యా పడకింటి విలాస సంపదల్‌?
194
తే. ఉండె నరపతి యందు మే నుబ్బుచుండ
నఖిలసామ్రాజ్య మేలినయంత వేడ్క
రమ్యమగునిల్లు మేలైన రాజముఖియుఁ
గల్గెనఁట! యంతకన్న భాగ్యంబుఁ గలదె!
195
క. అంతటఁ బ్రౌఢసఖీతతి
కాంతామణిఁ గాంతుకడకుఁ గదియించుట కై
వింతగ మోమునఁ జిఱునగ
వింత కనంబడఁగ ముదితహృదయాంబుజలై!
196
సీ. 'జడకుచ్చుఁ గైకొమ్ము ముడువు చేడియ విరుల్‌ వేనలి వట్టిన వీడకుండఁ
జేర్చుక్క సతి యింద తీర్చుము తిలకంబు కస్తూరి చెమటచేఁ గరఁగకుండఁ
గొనుజంటరవికఁ గుంకుమగంద మలఁదుమో చెలి! యెంత యొరసినఁ జిటులకుండ
మొలనూ లిదిగో బోటి! చలువ పొందుగఁ గట్టు సయ్యాటలనె నీవి సడలకుండ
 
తే. తరుణి కివియిచ్చు గద మెచ్చు తప్ప!' దనుచు నేరుపరు లైనవారిగా నేఱుపఱుపఁ
గాంతనవసంగమార్హ శృంగారవిభవ లీల నలరించిరా జవరాలి నపుడు.
197
క. "తడ వేటికి లే జవ్వని!
విడె మీవలెఁ బతికి నుంచివేళ సుమీ యి
ప్పుడు రాకన్నియ వల్లభు
కడఁ బెనఁగుదు గాక పెనఁగఁ గా నిటఁ దగునే!
198
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )