కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
నెచ్చెలులు సుభద్రకు హితము బోధించుట
సీ. ప్రియముతో రమ్మని పిలిచినఁ జేరఁ బోయెదవు గా కూరకుండెదవు సుమ్ము
చెంతఁ గూర్చుండంగఁజేఁ జూపఁ గూరుచుండెదవు గా కూరకుండెదవు సుమ్ము
విడెము చేతి కొసంగ వినయంబుతోడ నందెదవు గా కూరకుండెదవు సుమ్ము
మధురోక్తి వినఁ గోరి మాటాడ మాఱువల్కెదవు గా కూరకుండెదవు సుమ్ము
 
తే. కాక విభుఁ డైనఁ గొంత సిగ్గరితనంబు కడలుకొని యున్నఁ గ్రక్కునఁ గడకు రాక
చక్కఁగ నొకింతసే పటు సమ్ముఖమున నిలువుమీ రత్న పాంచాలిచెలువు మీఱి.
199
క. అనవలసి యంటి మింతే!
నినుఁ జూచిన నింద్ర తనయునికి నింద్రతనూ
జునిఁ జూచిన నీకును మఱి
మన సూరక యున్నె పూర్ణిమాచంద్రముఖీ!
200
సీ. చిలుక నీచేఁ గాక చెలిచేత నుండదే నిమిరి యిప్పుడే మాట నేర్పవలెనె?
యెదుటఁ గౌసెన వేయ కిడినారు తెమ్మని వీణ యిప్పుడె మేళవింపవలెనె?
పటముకానుకఁ దెచ్చిపట్టిన నిప్పుడే చిత్తర్వునకు హర్వు చెప్పవలెనె?
మంచిమాటలు తోఁచె నంచును బలకలో నిప్పుడె కవిత వ్రాయింపవలెనె?
 
తే. గంట చెప్పినవారిఁ గ్రేఁగంటఁ గనెదు లెండు పోద మటన్న నటుండు మనెదు
వడిగ రావమ్మ కంచియే పడుకటిల్లు కన్నియలఁ గంటి మిటు లెందుఁ గానమమ్మ!
201
ఉ. ఎక్కడ నైన వేడుక మెయి\న్‌ శుభవేళలఁ బాను పెక్కుచో
నొక్కిసుమంత సిగ్గు వడుచుండెడు లేజవరాండ్రు లేరొ? యో
యక్క! యిదేమి? యింత గలదా? మఱి రేపిటువంటివారె పో
దక్కఁ బెనంగువారలు సదా మగనిం బిగికౌఁగిలింతలన్‌.
202
క. ఏకతమునఁ జెప్పుదుమో?
కా కందఱు వినెడునట్లు గాఁ జెప్పుదుమో?
మా కొక్కటి తోఁచినయది
నీ కెక్కడఁ గోప మగునో నీరేజముఖీ!
203
ఉ. కేవలభక్తితో నచటఁ గేలివనంబున నీవు సారెకు\న్‌
సేవ లొనర్చుచోఁ గలిగె నే కత యేకత నిందు వచ్చుచోఁ
ద్రోవల నిల్తురే కద వధూవరు లిద్దఱు నొక్కటైనచో
నేవగఁ బాఱునో మనసు లెవ్వ రెఱుంగుదు రమ్మ జవ్వనీ!
204
ఉ. వేగిరకాఁడు మన్మథుఁడు వెన్కకు ముందును జూడఁ డంతకు\న్‌
వేగిరకాఁడు నీ విభుఁడు వీరిఁ గటాక్షములందె యేలఁజా
ల్వేగిరకత్తె వీ వుచిత లీలఁ దలంతువొ? వేళ యెంతువో?
యీగరువంపు సిగ్గులపు డెక్కడ నుండు సరోజలోచనా?
205
ఉ. కన్నెఱచేసి చూచిన మొగ మ్మటు ద్రిప్పినఁ జే విదిర్చి నం
గన్నుబొమల్‌ ముడించినను గా దన మందుల కేమి? మున్ను మీ
రున్న తెఱంగు నంగకము లున్న తెఱంగుఁ దలంచి చూచిన\న్‌
గన్నియ! మాకు నమ్మికలు కావు సుమీ! పదిలక్ష లేనియున్‌.
206
తే. ఆయెఁ గా కుండె మంచిదే! యందు కేమి?
కొంతసే పిటు నవ్వితి మింతె మేము
చాలు నిఁక నైన జాగేల? సరసములనె
ప్రొద్దు పోయెడుఁ బదవమ్మ ముద్దుగుమ్మ."
207
చ. అని కయిదండ యొక్క మృదుహల్లకపాణి యొసంగ నొక్క మో
హన నవమౌక్తికోపమనఖాంకురపాపటఁ జక్కదువ్వ శో
భనశకునమ్ము లొక్క కలభాషిణి ముందరఁ దెల్ప మందగా
మిని యనుటెల్లనప్పుడిను మిక్కిలిగాఁ దనయందు నిల్వఁగన్‌.
208
ఉ. తాలిమిఁ గ్రుంగఁ ద్రొక్కి మదిఁ దత్తఱము\న్‌ దమియు\న్‌ భయంబు హే
రాళముగాఁగ మైఁ జెమట గ్రమ్మఁగఁ గొంకుచు మెల్ల మెల్లనే
బాలిక యేఁగుదెంచె విభుపాలికిఁ బ్రాణసఖు ల్దెమల్పఁగా
యేలిక మ్రోలకు\న్‌ మనవి కేఁగెడు నయ్యభిమానిపోలికన్‌.
209
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )