కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
సుభద్రార్జునుల శృంగార విలాస కృత్యములు
ఉ. చంచలనేత్రరాఁ గలుగుసంభ్రమ మేమనవచ్చు వాసనల్‌
ముంచుకొన\న్‌ సమస్తగృహముల్‌ మిఱుమిట్టులు గొంచు నల్గడల్‌
ముంచుకొనె\న్‌ దనూరుచులు ముంగిటి కించుక రాక తొల్తనే
ముంచుకొనె\న్‌ నృపాలునకు మోహముఁ గోర్కులు నెమ్మనంబునన్‌.
210
తే. మఱుఁగఁ గోరెడికన్నియ తెఱఁగుఁ జూచి
చూడఁ గోరెడి యువరాజుజాడఁ జూచి
వలఁతు లయినట్టి యా కూర్మిపొలఁతు లపుడు
కూర్చి సమకూర్చి యిరువురఁ గూర్చి యనిరి.
211
తే. 'తేరు తా నెట్లు గడపెనో తెలియరాదు
తేరు కదలించునట్లు తోతేరవలసెఁ
గన్నె యిందాఁక నే మెఱుంగదుసుమయ్య
తేరుగడ కాఁగ మెల్లనె దిద్దుకొనుము.
212
క. పాటలబింబాధర కసి
గాటుల కోప దని పలువగలఁ దెలుపంగా
నేటికి? నెఱింగి నడుపుము
మీటిన విచ్చుచనుదోయి మీచేతి దిఁకన్‌.
213
తే. మీర లెఱుఁగంగ వలయు శృంగార మెల్ల
యువతితిలకంబు కంటె నో నవమనోజ!
విభుఁడు మది మెచ్చి కర్పూరవీటి యొసఁగ
ముద్దుమొగ మెత్తరాదె? యోమోహనాంగి!
214
క. వలరాజు కొల్చునంతటి
చెలువుఁడు నినుఁ గూడఁ గలిగెఁ జెప్పె డిదేమో?
కలఁ డిఁక నీపాలింట\న్‌
జెలియా! యలచందమామ జేజే యెపుడున్‌.
215
క. రావక్క! వక్కలాకులు
గోవక్క! శుభోత్తరముగ గొబ్బున విభుచే
నీవక్క! సేవ సేయుము
నీ వక్కఱ కలిగి రమణునికిఁ జిత్తము రాన్‌.'
216
తే. అనుచుఁ గప్పురబాగాలు నాకుమడుపు
లచ్చకోరాక్షిచేతి కందిచ్చి మిగుల
నంతికము చేర్చి 'చేపట్టుమయ్య కోర్కు
లొదవఁ గాఁ జేయు నాసామి! యువతిశయము.'
217
క. అని కన్నియ హస్తాబ్జముఁ
దన శ్రీహస్తమునఁ జేర్పఁ దాత్పర్యమున\న్‌
గొని యామాటలచతురత
మనమున మెచ్చుకొను రసికమణి వేమాఱున్‌.
218
చ. 'కలయఁగ మంచిలగ్న మిది గట్టిగ నే గడె లెన్నియయ్యెనో
తెలిసెద' నంచు నోర్తుఁ 'జనుదేర ద దే'మని యోర్తు 'నెచ్చెలిం
బిలిచెద' నంచు నోర్తు నొకపే రిడి వా రిటు లేఁగి రంద ఱ
చ్చెలియల వెంటనే సగము సిగ్గరిగె\న్‌ దరుణీలలామకున్‌.
219
ఉ. పంచశిలీముఖంబులును బచ్చనివిల్లును బూని యెక్కుసం
ధించుచు నిర్వురం బెనఁచి నెమ్మిఁ గరంచుకడంకఁ జూడుమీ
యంచు గవాక్షసీమ నపు డాయెల తెమ్మెరఁ గూడి వేడుక\న్‌
బొంచులు సూడఁగాఁ దొడఁగెఁ బో మకరాంకుఁడు గాన కుండఁగన్‌.
220
తే. పతియు సతికేలుపట్టినపట్టు విడక
పెడమఱల వామకరమునఁ బిఱుదుఁ జుట్టి
పట్టి రా నీడ్చి కూర్చుండఁ బెట్టె నపుడు
తొడ తొడయుఁ దాఁకఁ దమిసిగ్గుఁ గడకు నూక.
221
సీ. నెఱికొప్పుఁ గొనగోర నిమిరినయంతనే తళుకులే ముద్దుఁ జెక్కిలి చెమర్చెఁ
దళుకులేముద్దుఁ జెక్కిలి నొక్కినంతనే వలిగుబ్బచనుఁగవ పులకరించె
వలిగుబ్బచనుఁగవ నలమినయంతనే నతనాభినీవిబంధంబు ప్రిదిలె
నతనాభినీవిబంధము నంటినంతనే తను వెల్లఁ బరవశత్వంబు నొందె
 
తే. నవలఁ జెప్పెడి దేమి యానవరసికుఁడు తావిచెంగావిచక్కెరమోవి గ్రోలి
కుసుమశరుకేళి నేమేమిగుఱుతు లిడెనో బాల యెఱుఁగదు సౌఖ్యాబ్ధి దేలి యపుడు.
222
క. గాఢాలింగనవిముఖము
రూఢాంగస్వేదభరము రుంద్రవ్రీడా
గూఢాపాంగము నగుచు న
వోఢాసంగమము కొసఁగెం బతికిన్‌.
223
సీ. వీఁగుకొప్పున సాము విరిదండవెలిఁ గమ్మఁ గమ్మకస్తురిబొట్టు చెమ్మగిల్లఁ
దనువున మేల్పూతఁ తావిమాత్రమె చిక్కఁ జిక్క చన్గవ సరుల్‌ చిక్కువడఁగ
నొసలిపై ముంగురుల్‌ ముసరి ముద్దులు చూప జూ పంతకు సొలపుఁ జూపఁ
జిన్నారిచెక్కులు చెమటఁ జిత్తడి నొంద నందంద యూర్పులు సందడింప
 
తే. నపుడు సమ్మతిఁ బతివేడ ననఁగి పెనఁగి లోనుగాకుండియు మృగీవిలోలనయన
యతని నానందవార్ధి నోలార్చె నౌర! కలయికలఁ గల్గుహరువులకలిమివలన.
224
తే. నొక్కి పలుమొనఁ బలుమొన నొక్క నేర్పె
నంటి గోరులచేఁ గళలంట నేర్పెఁ
జొక్కి బిగిఁ గౌఁగిలింతలఁ జొక్క నేర్పెఁ
జెలువుఁడు నవోఢఁబ్రౌఢఁగాఁ జేసెనపుడు.
225
సీ. జిలిబిలివలినాలి మొలకతెమ్మరలు కమ్మనిమేనితావుల ననుసరింప
నలరుఁ దేనియ లాని యలరుతుమ్మెదదిమ్ము జంటచూపుల వెనువెంటఁ దిరుగఁ
జిగురాకుమేఁతలఁ బొగరొందుకోయిలల్‌ పాటల నీటు వెంబడి మెలంగఁ
గుల్కుఁ బల్కులముద్దుగుల్కు చిల్కల నేర్పు పలుకుల బెళుకులపజ్జ నిలువ
 
తే. సతియుఁ బతియును నారామతతుల నతుల రతులఁ బెనఁగిరి చతురత లతిశయిల్లఁ
దొలుతఁ దము నేఁచువారలె కొలచియుండు వేడ్కకన్నను మఱి వేఱె వేడ్క కలదె.
226
క. నెల మసలె నంతఁ గాంతకు
నెలకొనె వేవిళ్లు పెల్లు నిద్దపుమేనం
దలతల మని మెయిపూఁతల
తళతళఁ దళుకొత్తఁ గ్రొత్తధవళిమ దోఁచెన్‌.
227
సీ. కలదు లేదో యనుకౌను కానఁగ నయ్యె ఱెప్పల నలసత కప్పుకొనియెఁ
గులుకుఁ జన్గుబ్బలు వలుఁదలై మెఱుఁ గెక్కె నూఁగారుపైఁగప్పు నూలుకొనియెఁ
జెక్కుటద్దంబుల నెక్కొనెఁ దెలినిగ్గు బడలిక నడుపులఁ గడలుకొనియెఁ
జిట్టూటచెమటలచిత్తడి మెయి నిండె సారెకు నూర్పులు సందడించె
 
తే. నరుచి గన్పించె నొకచెల్వ మంకురించెఁ దరులుసమ మయ్యెఁ జిట్టుముల్‌ దఱచు మీఱె
మొలచెఁ గోర్కులు నెమ్మేన నిలిచె నలఁత నెలఁత కేర్పడఁ దొలుచూలు నిలుచు నపుడు.
228
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )