కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
కుమారాభ్యుదయము
మ. కలుముల్‌ కన్నులఁ జిల్కుకల్కి మరునిం గన్నట్టిచందాన నా
కలశాంభోనిధివీచికల్పతరువుం గన్నట్టి యందంబున\న్‌
గలకంఠీకులరత్న మంత శుభలగ్నం బందు నిం పొందఁగాఁ
గులదీపం బగునట్టిపట్టిఁ గనె దిక్కుల్‌ తెల్విఁ బెంపెక్కఁగన్‌.
229
క. ఋభువిభుసుతునకుఁ దనయుఁడు
ప్రభవించినసమయమున గుబాలునఁ గురిసె\న్‌
నభమున సుమనోవర్షము
గుభగుభనినదములు గ్రందుకొనె దుందుభులన్‌.
230
తే. అపుడు పార్థుఁడు శుభలేఖ ననుప ననుప
మానవిభవుండు శౌరి సమానమాన
వాధినాథులు కొలువంగ నరుగుదెంచె
నెలమితోడుత పాండవు లెదురుకొనఁగ.
231
క. హలి సాత్యకితోడఁ గుతూ
హలియై తనసరస రాఁగ నంగనయును దా
నల బలరిపుసుతునగరికి
నలబలము చెలంగ నరిగె హరి కడు వేడ్కన్‌.
232
క. మన్యువివర్జితుఁ డల శత
మన్యుతనూభవుఁడు లోకమాన్యవిపశ్చి
న్మాన్యులయనుమతి సుతు నభి
మన్యుం డని పేరు వెట్టె మది ముదమొదవన్‌.
233
క. చెల్లెలికిని మఱఁదికి మే
నల్లునకు ననర్ఘ్యమణిమయాభరణంబుల్‌
వల్లభయుఁ దాను యదుకుల
వల్లభుఁ డపు డొసఁగె బంధువర్గము మెచ్చన్‌.
234
తే. కువలయాక్షులు పెనుచు మక్కువలవలన
నేఁటఁబెరిఁగెడువాఁడొక్కపూఁటఁ బెరిఁగి
మెల్లమెల్లన శైశవ మెల్ల జార
నందె యౌవన మారాజనందనుండు.
235
సీ. మనుమార్గమున భూమి మను మార్గ మంతయు స్థిరబుద్ధి యగు యుధిష్ఠిరుఁడు తెలుపఁ
బాటవవద్వైరిపాటనక్రమ మెల్ల దరవర్జితుఁడు వృకోదరుఁడు తెలుప
రంగదుత్తుంగతురంగాధిరోహ ముద్దండబాహుఁడు నకులుండు తెలుప
సురభిరక్షణకీర్తి సురభిళదిఙ్మండ లుండగు తదనుజన్ముండు తెలుప
 
తే. వివిధకోదండ పాండిత్య విలసనంబు తానె తెలుపంగ నేర్చిన తనయుఁ డెపుడు
సేవ సేయఁగ సంతతశ్రీ వెలుంగ విజయుఁ డలరారె శాశ్వతవిజయుఁ డగుచు.
236
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )