కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
ఆంధ్రమహావిష్ణువు

1. ఆంధ్రమహావిష్ణువు

మగధను జయింఛి భారతదేశ చక్రవర్తులయిన పూర్వాంధ్ర రాజవంశములలో తెలిసినంతవఱ కితఁడే పూర్వుఁడు. ఇతఁడు నిశుంభుఁడను రాజును జంపి శ్రీకాకుళము రాజధానిగా నాంధ్రదేశమును పాలించెను. ఈ దేశమున కితనివలననే యాంధ్రదేశ మని పేరు వచ్చినది. భీమేశ్వరము, కాళేశ్వరము, శ్రీశైలము ఈ మూఁడు క్షేత్రములకుఁ జుట్టును బెద్దగోడ గట్టించి యితఁడు త్రిలింగ మని పే రాంధ్రమునకుఁ గల్పించెను. ఈయన తరువాత దేవుఁడుగా పరిగణింపబడి యితని పేర శ్రీకాకుళమున నాంధ్రవిష్ణువు నాలయము కట్టింపఁ బడినది. కాసుల పురుషోత్తము తన యాంధ్రనాయక శతక మితనిమీఁదనే చెప్పినది. శ్రీకృష్ణదేవరాయలు "ఆముక్తమాల్యద" వ్రాయుటకుఁ గారణ మీయన కలలో గనఁబడి యాజ్ఞాపించుటయే.

"జో! సామీ, మముఁగన్న యేలిక! యిదో జోహారు జోహారూ! మా
శ్రీశైలంబునఁ బెద్దకొండదరి గర్వీభూతచేతస్కుఁడై
యీశారాధనలబ్ధదోర్బలుఁడు దైత్యేంద్రుండు లేఁడా! బుభు
క్షాసంపూర్తికి నోచుకోముగద! కక్కా! వాని దుశ్చేష్టలన్‌.
కృప" యని సన్నవల్వలు మృగీమదమున్‌ దొలికాన్క వెట్టి క
ప్రఁపుఁబొడి చల్లి పే రడవిపందులమాంసము జిడ్డుదేరు బ
ల్లెపుఁ గొనలం దెలుంగుపతి లేఁజివురుం బద మంటఁ, దూర్పుసం
ద్రఁపు బొలిమేర లేలిక, కిరాతుల మేల్సరదార్ల కిట్లనున్‌ -
"మాకున్‌ వానిగురించియే కలద, యీమా యాప్తులౌ రత్నగ
ర్భాకాంతుల్‌ ఋషికల్పులౌ గురుల మంత్రంబున్‌ విచారించి దీ
క్షాకౢప్తంబు పొనర్చినార మిదిగో ఖండేందుచూడామణి
శ్రీకంఠచ్ఛవిరక్ష నీవఱకుఁ బేర్చెన్‌ గాక వాఁడుద్ధతిన్‌."
అను పలు కాంధ్రవిష్ణుని ముఖాగత మయ్యెనొలేదొ దాని విం
చునె సరదార్లు దైత్యుఁడు నిశుంభుఁడు చచ్చెనుజచ్చెనంచు లో
ననుకొనుటొండె జాగుగఁ దదాననదివ్యజయారవప్రతి
ధ్వనితమ యయ్యె నాంధ్రనరపాల సభాభవనంబుసాంద్రమై.
కొలఁదినాళులకు దిగ్వలయసుందరముగాఁ - బ్రాకారమును గట్టఁ బంచినాఁడు
సగరమేఖలా చారుకుచద్వయీ - శాయి యాంధ్రావని చక్రవర్తి
కాళేశ్వంబు శ్రీశైలమ్ము భీమేశ్వ - రమ్మును గలిపి యాంధ్రము త్రిలింగ
చిహ్నితమ్ముగఁజేసె సిద్ధఖేచరయక్ష - కాంత లా సొగసుప్రాకారమార్గ
        మనుసరించెద రుభయ సంధ్యాప్రశాంత
        సమయరోచుల స్వచ్ఛార్ధచంద్రమకుటు
        మూఁడులింగమ్ములకు భక్తిఁ బూజసేయఁ
        బవనచలితాంశుకాంతలై ప్రతిదినమ్ము.
విప్రాశీఃఫలభాజనుం డతఁడు తన్పెన్‌ భూసురశ్రేణి "బ్ర
హ్మప్రీత" మ్మనుచున్‌, ద్రిలింగముల సంధ్యల్‌మూఁటసేవించె, వే
దప్రామాణ్యముగాఁగ నాంధ్రపతి; యేతద్దివ్యయోగాతి ని
ష్ఠాప్రీతుం డయినాఁడు త్రైపురసతీ సౌభాగ్యనిర్ణేతయున్‌.
నడిపింపఁబడి మహానౌకాదళ మ్మింద్ర - కీలాచలముదాఁకఁ గృష్ణ కెదురు
ఛేదింపఁబడి మహాశ్రీశైల సవిధభూ - స్థలములదాఁకఁ గాంతారసమితి
గమియింపఁబడి దైత్యగహ్వరమ్మున దాఁక - రవము విన్పడఁ జతురంగబలము
సేవింపఁబడి హిమక్షితిధరకన్యకా - సౌందర్యధనుఁడు శ్రీశైలరాజు
        తలవని తలంపుగా సముద్భవనినాద
        బధిరితాశాచయంబులు పగిలిపోవ
        ఆంధ్రపతిచేత, స్వీయసైన్యములపేర,
        విరిగిపడియె నిశుంభుపైఁ బిట్టపిడుగు.
ఆంధ్రభూధవుని సైన్యము నిమేషంబులో - వనమునెల్లను బట్టబయలు చేసి
అరి కొండమార్గమ్ము లెఱిఁగినవాఁడు గా - వున వానియాట సాగని విధమున
అఖిలమార్గమ్ముల నరికట్టి, గుహలును - నద్రిభాగమ్ములు నావరించి
దైత్యుఁడు నివసించు తావుచుట్టును మహా - గజయూధముల నిల్వఁ గాపువెట్టి
        కృతజయారావములును బేరెములు వార
        నాది నించుక లెక్కసేయని దితిజుఁడు
        తెలిసికొని వైరిబలమెల్ల వెలికి వచ్చి
        రోష దష్టాధరుండయి, రుద్రువోలె.
తన పజ్జంగల శూలమున్‌ గొనిసముద్యత్క్రోధతామ్రాక్షుఁడై
తెనుఁగున్‌ భూలలనా మనోహరు శిరోధిన్యస్తలక్ష్యమ్మునన్‌
మును లంఘించకమున్న, దానవునిఱొమ్మున్‌ గాడనేసెన్‌ మహా
శనికల్పం బగుబాణ మాంధ్రపతి పెల్చన్‌ మందహాసంబునన్‌.
ఉదయమార్తాండ నీలోత్పల బంధుకాం - తులు తోఁచె లోచనాంచలములందు
చారుకౌస్తుభమణిచ్ఛవులు క్రమ్మె నసృఙ్న - దమ్మైన వక్షఃస్థలమ్మునందు
తనకుటుంబము తలంచిన విశ్వవహనభా - రమ్మయ్యె గర్భగోళమ్మునందు
అఖిలవేదాంతవిద్యాశ్రయ వైరాగ్య - విస్ఫూర్తి గలిగె హృద్వీధియందు
        ఆంధ్రవిష్ణువు శ్రీకాకుళాధినేత
        శ్రీసుచంద్రాత్మజు పృషత్క శేఖరమ్ము
        హృదయనిర్భేదముగ నాటు నింతలోన
        నాంధ్రవైరి నిశుంభ దైత్యాధిపునకు.
అంచించంగల యాంధ్రనాయకుఁడు బాణాగ్రంబునం దగ్నిసం
ధించెన్‌ గావలెఁ గాకపోవునెడ దైతేయేంద్రదేహోద్గత
ప్రాంచత్పావకకీల భగ్గు రని యా ప్రాంతాటవుల్‌ కాలిపోఁ
బంచారించిన పల్లెలుం బురములున్‌ ప్రారంభ మే లయ్యెడున్‌?
త్రాసితలోక మాంధ్రవసుధాపతిసైన్యము, వీరకోటి బా
హాసముదీర్ణఖడ్గ గళితాంచితకాంతులు నుర్వుగాఁగ వ
ర్షాసమయోగ్ర శైలకుహరస్రుతనిర్ఝరమట్లు వచ్చి కృ
ష్ణా సరి దుల్లస త్ఫణి ఫణామణి కాకుళ మంత చేరఁగన్‌.
ఆ పురరాజ్యలక్ష్మి యెదురై కపురారతు లిచ్చె మోహన
శ్రీపదమైన యాననము చెంతల స్వాగత మందహాసరే
ఖాపృషదంకురమ్ములు నిగారము చూపఁగ సర్వభూషణ
ప్రాపితదేహయై శిఖరవాయుచలద్విలసత్పతాకయై.
శ్రీకృష్ణవేణీ గరిష్ఠపాధస్తరం - గాహతప్రాకార మైన యదియు
బురుజుల దితిజనసమూహరక్తముఁగ్రోలు - నాల్కవోలు పతాక నాటినదియు
ఆంధ్రవీరభటాళి కాత్మశౌర్యంబుల - యందు శాణోపలం బైనయదియు
ఘంటశాలాపురీకలిత పూర్వాంధ్ర శి - ల్పాచార్యులకుఁ దల్లియైన యదియు
        రాజరాజాంధ్రవిష్ణుని రాజధాని
        కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళంబు,
        కన్నులకుఁ గట్టినట్లుగఁ గానబడెడు
        వేదకాలమునాఁటి ముత్తైదువట్లు.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - aaMdhramahaaviShNuvu Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )