| కవితలు | ఆంధ్రప్రశస్తి: విశ్వనాథ సత్యనారాయణ |
నతి |
| నతి |
|
మీఁదై క్రిందయినారు కాకవులు, సామీచీన్యపద్యాగతుం డై దూరీకృతశత్రుఁడై మఱియుఁ దానై కైత కొగ్గన్ కవుల్ లేఁదూడ్లంబలె నీరసంపడిరి, కాళీపాదమంజీర నా దాదేశంబున మద్గురూత్తముఁడు శబ్దాంభోధి బంధించుచో. |
|
పుడమిని బెక్కు సత్కవులు పుట్టిరి, ముట్టిరి సత్కవిత్వపుం దొడిమలు, చెళ్ళపిళ్ళకవితోఁ దులతూగెడు వారె? వానలోఁ దడియనివారు మద్గురువధాన మృదూక్తి మరందధారలోఁ గడుగనివారు మా కెచటఁ గానఁగరా రిలఁ దెల్గునాఁడునన్. |
|
పలు పలుకు లేల, కవితా లలితాంగికిఁ గొప్పులో నలంకరణమ్ముల్ కలిపించిరి, లేజాజులఁ దెలిమల్లెల తావిపెల్లు దిక్కుల నొరయన్. |
|
మా పూర్వాంధ్ర ధరాధినాయక కథా మంజూషికా రత్నగా థా పద్యావళి పేరి హారి సుమనోదామంబు మాధ్వీక భా షా పృక్తంబు మహాప్రబంధ రచనాసౌందర్యపున్ వాసనల్ తీపై క్రమ్మగ నాంధ్రసోదరుల కందిత్తున్ గళాంకమ్ముగన్. |