కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
చంద్రవంక యుద్ధము

11. చంద్రవంక యుద్ధము

ఇది పల్నాటి చరిత్రలోనిది. అనుగురాజు పల్నాటికి రాజు. అతని మంత్రి దొడ్డనాయనికి బాదన్న, బ్రహ్మనాయడు కొడుకులు. బాదన్నకు పెద్దన్న యని కూడ పేరు. బాదన్నను అనుగురాజు పెంచుకొన్నాడు. కనుక నలగామరాజును, బాదన్నయు అన్నదమ్ములు. నలగామరాజు అనుగురాజు నౌరసపుత్రుడు. అలరాజు నలగామరాజునకు నల్లుడు. అందుచేత బ్రహ్మనాయడు బాదన్నలకు నలరాజునకు మామ అల్లుళ్ళ వరుస. అలరాజునకు రాచమల్లు అలరాచమల్లు అని కూడ పేర్లు. అలరాజు గుఱ్ఱము పేరు సవరాలగోడిగ. బాదన్న గుఱ్ఱము కారుబొల్లడు. బాదన్న బ్రహ్మనాయడు వెలమలు. అలరాజాదులు క్షత్రియులు.

బ్రహ్మనాయఁడు చంద్రభాగా సరిత్తీర్థ - మందుఁ బ్రాతస్నాన మాచరించి
బాలసూర్యోదయప్రభలు గోదుమవన్నె - పసిత్రాచు కానల పగిది లేఁత
పిల్ల తెమ్మరల కంపిల్లు చిన్నరి పిల్ల - యలల జఱ్ఱున జారులాడుచుండ
నిలువు టద్దమ్ములోపల దిరుమణి తిరు - చూర్ణమ్ము దిద్ద నిల్చున్న వేళ
        శారదాకాశమున రెండు సాఁగి క్రొంద
        నమ్ము మెఱుపుల సంఘర్షణమ్ము వోలె
        నిలువుటద్దాన ధగధగై నిగనిగైని
        మేశ పరికల్పితోద్దీప్తి మెఱుపుకలిగె.
నిలువు టద్దమ్ముచేఁబూని నిలిచియున్న
తన కుమారునిఁ గన్నమదాసు చూచి
"భాగ పైతట్టు నెవ్వరో ద్వంద్వయుద్ధ
మాడుచున్నారు చూచిర"మ్మనుచు బలికె.
పరుగులఁ బోయినాఁ డతఁడు పర్వుల వెంబడి వచ్చినాఁడు "క్రొ
న్నురుసులఁ గ్రక్కు గుఱ్ఱముల నూకెద రడ్డముబాదనాయఁడున్‌
బొరి నలరాజు" నంచు తనపొంగిన చట్టలు పట్టుచున్‌ గనుల్‌
గిరగిర త్రిప్పుకొంచుఁ బలికెన్‌ త్వర యాకృతిపొందెనో యనన్‌.
అటఁ దిరుచూర్ణమున్‌ నిలువుటద్దము బంగరుచెంబువీడి త్రొ
క్కటపడు చొక్కటేపరుగుగాఁ జనె నచ్చొటుబ్రహ్మనాయఁ డ
ట్టిట్టు నొకదాని మై కఱచు చేచి పెనంబడు కారుబొల్ల నిం
తట సవరాలగోడిగ నదంతట నాపెను మధ్య నిల్చుచున్‌
కారుబొల్లని ముఖాగ్రమ్మున హేమకం - కణ రమ్యదక్షిణకరము సాచి
సవరాలగోడిగ నవఘంటికా లగ్న - గళసీమపై సవ్యకరము నుంచి
బ్రహ్మనాయఁడు వారి బవరము సాలింపు - డని మాటపెట్టె, నంతన తనంతఁ
గారుబొల్లఁడును వెన్కకుఁ దగ్గె, సవరాల - గోడిగ యతని నూటాడఁ ద్రోచె
        బ్రహ్మనాయని లోపలి భావగర్భ
        మందు నే మూలనో తెలియంగఁబడక
        లోనఁగలగెనో పొరగాలిలేని సరసి
        సరసిజము లట్లు స్తిమితలోచనము లొప్ప
"అల్లుడా! ఆగరాదయ్య" అనియె నతఁడు,
"మామ! నాకత్తి యొఱవీడి మఱలిపోదు
బలి యెఱుంగక" యని రాఁచవాఁడు పలుక,
"నంత కస టేల" యనుచు నాయఁడు వచించె.
సవరాలగోడిగ సాగించు పరవళ్ళ - కలరాజు కళ్ళెమ్ము నాచిబట్టి
అదలించి జీనుపైనదిమి కూర్చుండి బా-రున రికాబునఁ గాళ్ళుత్రొక్కిపట్టి
అలరాచమల్లు నాయనిఁ జెప్పఁదొడగె "మా-మా! యిద్దినెలనాళ్ళ మాటయన్ము
లింగధానకుఁడును గంగధానకుఁడు న-శ్వముల నీరము తాపఁ జంద్రవంక
        రేవులో గుఱ్ఱములు తీయు నీవు నీ వ
        టంచు పంతాలువోయి యతాంగ కొకఁడొ
        కండు చబుకులు విసరుట కడకు వచ్చి
        గోడిగకు దెబ్బవచ్చి కన్గ్రుడ్డుతాకె.
మగసిరి నాఁడుగాఁ జనిన మాదిరిగా హయశాలలోన గో
డిగ నిలుచుండి కన్నులబడిన్‌ దెగగార్చును నీరు, ముట్టియన్‌
బగడతొట్టెతో జలముపట్టిన గిట్టదు లేతచొప్ప కొ
న్నిగల కొసందియిచ్చినను నె ట్టదు వాయికి గాటమౌ కసిన్‌
బవిరి గడ్డముతోడి బాదన్న బొమ్మ పెం-డారాన నే నొకనాఁడు చెక్కి
గోడిగ గిట్టపై కొన గజ్జియల మువ్వ - లందెతో బిగియించి నంతనుండి
దానికిఁ గసితీరెఁ గాన నీరము నాను - సకిలించుకొంచు చొప్పకొన లంటు
ఆ పైన మూన్నాళ్ళ కల గోడిగకు బొడ్డు - గంటకట్టి రికాబు గవ్వకట్టి
        నడుము పట్టగట్టి కొడుపు గంటల మ్రోగు
        హొన్ను జీనుకట్టి యుర్విరాజు
        సభకురాగఁ జూపు సారించి బాదన్న
        యందెకొణిగె బొమ్మ నదియెఱింగె.
బట్టుమాటగ బొమ్మకట్టు తీయు మటంచుఁ
గబురంపె బాదన్నగారు నాకు
ఔద్ధత్యసహితమౌ నా మాట నే నోర్వ
లేదు, పోటుకు రానె లేవ యేని
యట్లే యటంటిఁ, దా నప్పుడు నిశ్చయ
పఱచె బాదన చంద్రవంక పచ్చ
గడ్డలపై నేఁడు కలియఁగాఁ గారుబొ
ల్లనిపైని ముందు వచ్చినది యతఁడు
కారుబొల్లనిమెయి నలంకార మరయు,
చూడు సవరాలగోడిగకూడ బొమ్మ
కాలు ముందుకుఁ జాచెడు గర్వరేఖ,
మామ! నా కత్తి బలిలేక మఱలిపోదు."
బ్రహ్మనాయఁ డాలోచనాపథము నెల్ల
కొసలఁ దిరుగాడు చున్నట్లు కొంతసేపు
శిరము వాలిచి మఱికొంతసేపునకు శి
రమ్ము నెత్తి గాంభీర్యముద్రాముఖుండు.
"కన్నమ! నీవుపో అరటిగడ్డలు దవ్వలు కొంచురా!" యటం
చు న్నెఱియానతిచ్చె, బొలసుల్‌ గనుగ్రుడ్డు నరాల కుబ్బగా
కన్నమదాసు వాయుపథగామిగఁ బట్టణ మాభిముఖ్యమై
చన్న, హయంబు పెద్దన వెసన్‌ డిగి తమ్మునియొద్ద నిల్వఁగా.
అలరాజు దిగఁడు గుఱ్ఱము
కొలకొల పరవళ్ళు త్రొక్కు గోడిగ పెను త్రొ
క్కుల భాగ పచ్చదిగడ్డలు
తెలిపొడియై నేల గిట్ట దిగి దుమ్మెగయన్‌.
కన్నమదాసు వే నరటిగడ్డలు దవ్వలు తెచ్చె, నాయఁడున్‌
దిన్నఁగ జేనుగా ధరణిఁ దీరిచి పాతెను వాని నెల్ల మ
ధ్య న్నిలఁబెట్టె నొక్కరటిదవ్వ వెసన్‌ దనపేర తేజిపై
ను న్నలరాజు "నల్లుడ యిదో బలివేయు" మనెన్‌ ద్రుతోక్తితో.
"పెద్దవారుండ నే ముందు వేయ" నంచు
పట్టుదలలోననుం గౌరవమ్ము నెఱపె
రాచమల్లు, బాదనఁజూచి బ్రహ్మనాయ
"డన్న! నీ వేయు మయ్యు! ముంద"ని వచింప.
బ్రహ్మనాయని పేరిటి బద్దదక్క
నఱటి దవ్వల నన్నింటి దఱిగిపోసె
బాదనాయనికత్తి విస్ఫారధార
రాచమల్లు నేత్రాంతముల్‌ ప్రజ్వరిల్లె.
కాళము మామపేరిటిది కాక యికొక్కఁడు దవ్వయుండగాఁ
దాళఁడు బాదనాయ, డిఁక తగ్గుట యేలని యాననాగ్రరే
ఖాళిని గంటుపెట్టుకొని యంత చటుక్కున దూసి సూర్యభే
తాళము రివ్వునన్‌ విసరె దవ్వ సహస్రము లౌచు వ్రీలఁగా.
సూర్యభేతాళమ్ము క్షోణిలో పిడిదాక
దిగఁబడె, బాదన్న మొగము చివర
యెఱ్ఱనై పండిన యెఱుపు రేకలు తీర్చె,
బ్రహ్మనాయఁడు మోము వ్రాల్చు కొనియె.
తనలోని కదలిక తాళుకొన్నాఁడు నా
యఁడు, రాచమల్లుఁ బ్రహ్మన్న జూచి
"మామ! భేతాళమ్ము మహిలోన దిగఁబడె
కొంచెము తీసి పెట్టంచు" నడిగె.
బ్రహ్మనాయఁడు "నౌనయ్య రాచవారి
కత్తు లవి రాచవారికేగాని మాకు
ననువుపడ" వన్న, నలరాజు హయము పఱపి
పిడి యెడమకాల జఱ్ఱున వ్రీల లాగె.
జఱ్ఱు మని సాగినంతనె చంద్రవంక
పచ్చ పెళ్ళలు పెళ్ళలు నచ్చు లచ్చు
లుగ ధరాభాగమంతయు పెగిలివచ్చి
యొక్క చిఱుపెళ్ళ తాఁకె నాయనికి నొసట.
ఎవ్వరి త్రోవ వారు చని రెవ్వరు నెవ్వరివంకఁ జూడ లే
దెవ్వరు నెవ్వరిం బలుకరించను లే దలచంద్రభాగపై
దవ్వల నొక్కనీలజలదంబు వినీలభుజంగికైవడిన్‌
రివ్వున లేచి తా ననుసరించెను బో అలరాజు ప్రాణముల్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - chaMdravaMka yuddhamu Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )