కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
కొండవీటి పొగ మబ్బులు

10. కొండవీటి పొగ మబ్బులు

దగ్ధాంధ్ర రాజ్యనిత్యవిధూత ధూమమ్ము వలెఁ గొండబురుజుల కెలన లేచి
బురుజుకొమ్మల వీడి పోలేని రెడ్ల కీరితి వోలెఁ బెనురాళ్ళ నతుకులుబడి
రెడ్లకందావెన్క రేఁగు వంటింటి పెన్బొగవోలె గుమురులై ముందుసాఁగి
ద్రాగ్ధావదాంధ్ర స్వతంత్రతా రమవోలెఁ గొండ లంటీ యంటకుండఁ బోయి
        శ్యామలీభవ ద్గ్రాస ఘాసాదనార్ధ
        మొలయు వెల్లావుల కదంబములుగ నిలిచి
        కొండకొమ్ములు లో దాఁచుకొన్న క్రొత్త
        క్రొత్త పొగమబ్బు లలమె నీ కొండకొసల.
ఒకరెడ్డి సభతీర్చి ఉన్న కొండకు వాలు కొసలలో ముత్యాల గొడుగు పట్టు
ఒకరెడ్డిమూర్తి పోలికతీరియున్న కొండకు గోసగాఁ గీరీటమ్ము పెట్టు
ఒక యంతిపురము వధూత్ప్రేక్షఁ జను బురుజున సన్న మేలిముసుంగు తొడుగు
ఒక తెల్గుబంటు ఠీవికి ముద్ర గొనియున్న బురుజుపజ్జ మహాసివోలె వ్రేలు
        ఈ జగాపొగమబ్బులు రాజసేవ
        మఱచిపోవులే, రసధునీ మహితమూర్తుఁ
        లేము లెక్కించుచుంటిమి యెన్ని నాళ్ళు
        చనెనో యని వందలేళ్ళుగాఁ సాచుకొంచు
అస్మదర్థాతిథేయారబ్ధములు రెడ్ల భువి వంటశాలల బొగ లటంచు
అచట శ్రీనాథకావ్యశ్రోతలగు మాకుఁ బఱచిన పందిళ్ళపఱపు లంచు
కొండకొమ్ములఁదీర్చికొని నిల్చియున్న యాంధ్ర భటాళి వీరగంధాలటంచు
ఉత్సవాగత జనమ్మొఱిగిపోఁ గొండకొమ్ములఁ దొంగి కను రెడ్ల ముగుద లనుచు
        మున్ను గుఱ్ఱాల దూకించుకొన్న చోట
        నడుగడుగునందుఁ బాతంబులైన మాకు
        నప్పుడప్పుడు తలలెత్తి నంత కొండ
        కొసల మబ్బులు పొరపెట్టి విసరులాడు.
ఒకసారి వలిపమ్ము చిలికి ముత్యాల యంచుల వోలిక నుపత్యకలఁ జరించు
ఒకసారి జఘనభాగోపరిస్రస్త చేలవిధాన గిరిమొదళ్ళఁ బడిపోవు
ఒకసారి గిరిలక్ష్మి మొగముపై మొగలి పుప్పొళ్ళూఁదుకొన్నట్లు చెల్లరేఁగు
ఒకసారి స్వేదబిందుకములు రత్యంతవేళా కుచావృత్తి విస్తరించు
        చిఱుత పొగమబ్బు లీకొండసీమఁ బలుచఁ
        బడి విశీర్ణమై ధూతమై తడిసి రాచ
        సిరి యుడిగిపోయినట్టి యీ శిథిల దుర్గ
        లక్ష్మి కొనఁగూర్చు వెఱ్ఱి యలంకృతులను
అధిరూఢ కుండినేశాత్మజమ్మయిన స్యందన గరుత్మన్మండిత ధ్వజమ్ము
గజపతి ప్రౌఢోగ్ర కరిఘటా శుండా విధూతాంబునిచయ బిందూత్కరంబు
రెడ్లకీర్తిపతాక శ్రీనాధకవికావ్యదూత హంసాధినాథుని గరుత్తు
అల కసవాపాత్రు నంటి రాఁజిన కృష్ణరాయ బాహాగ్రజాగ్రన్మహాగ్ని
        ఒక టొకటిగాఁగ స్మృతితెచ్చుచున్న వన్ని
        చిఱుత లీ పొగమబ్బులు చిందులాడి
        కొండవీటి ప్రాఁగోట పై కొమ్మలందు
        నవ్యవర్షేందిరా ధురంధరవిరూఢి.
నిప్పులఁ జూఁడ మన్నీ లుత్కలప్రౌఢపాత్రులు బురుజుల పైని లేరు
ఈటెలఁ గ్రుఁమ్మ శౌర్యేందిరా పుంమూర్తులైన రెడ్లీ కోటపైన లేరు
గుండెలు కత్తులఁ గ్రుమ్మ రాయల రాచయేనికగున్న లీ పైన లేవు
అడుగడ్గునకుఁ బ్రాణ మాహుతిగొనఁగ ద్వాఃస్థాన రక్షకభటులైన లేరు
        ఓసి పొగమబ్బులార! రండోసి రండు
        మీకు మాకిష్టమే యిష్ట మాఁక లేక
        తిరుగవచ్చు రాజులు కొల్వుతీర్చుచోట
        నరుగవచ్చు రాకన్నె లున్నట్టిచోట.
ఎంత నిర్భయముగా నీ పొగమబ్బులు జెట్టీల బురుజుపైఁ జిమ్మిరేఁగు
ఏ లెక్కలేనట్లె యీ పొగమబ్బులు మిరియాల తఖతుపై తఱిమిపోవు
ఇంత యడ్డంకి లేకీ పొగమబ్బులు కేళిశుద్ధాంతసౌధాళిఁ జొచ్చు
ఏ మాత్ర మాఁక లేకీ పొగమబ్బులు తారాబురుజు మీఁద దాట్లు వెట్టు
        పిచ్చి పొగమబ్బులార! కోపించిరేని
        చెడ్డవారు సుమీ! మిమ్ము చించి ఱొమ్ము
        తాఁచి చెండాడిపోదు రద్దంకిరెడ్లు
        లేలిహానమ్ము లడ్డంకిలేని రెడ్లు.
ఇడుపుల విలిఖించిరేమొనా ముక్తాక్షరములుగా దుర్గకుడ్యముల నొలసి
ఇచట మ్రుగ్గులుపెట్టిరేమొనా గౢప్తముక్తారేఖగా గిరిస్థలము మెఱసి
ఇట వితానమమర్చిరేమొనా మృదుమరుచ్చాలితమథ్యమై చదలఁ దీర్చి
ఇటఁ గేళకుళి పెట్టిరేమొనాఁ దుదల శీతలపృషత్పరిషించితములఁ గదలి
        ప్రాత రనతిక్రమితయామ భానురోచి
        రాసమాత్త ధావళ్య మర్యాదమైన
        లేఁత యీ పొగమబ్బు పురాతనంబు
        త్రవ్వుచున్నది రెడ్ల యాంధ్రప్రశస్తి
ఇవి రెడ్లరాజుల యెదలలోఁ బూరించుకోరాని కోర్కెలు గుములు కట్టి
ఇవి తెన్గుబంటుల యిందుపగింజలై నాత్మలు వీడలేకరుగుదెంచి
ఇవియు శ్రీనాథుని యెఱ్ఱప్రగ్గడ కావ్యతకు రాని భావముల్‌ తరకగట్టి
అవచితిప్పయసెట్టి వివి రత్నరాశిగా మలఁచిన ప్రాణముల్‌ మగిడివచ్చి
        కొండవీటి పొలాల్‌ వీడికోను లేక
        ఆశబలమున మగుడు ప్రేతాత్మలవలె
        సొరిది నీ గిరికొమ్ముల జుట్టుపట్ల
        నిట్టి పొగమబ్బులై భ్రమియించుఁ గాక
నా ప్రాణములకును నీ పొగమబ్బులకేమి సంబంధమో! యేనుగూడ
పొగమబ్బునై కొండచిగురుకోసలపైన బురుజులపైనిఁ గొమ్ములకుఁ బైని
వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల రాలిపోనో గాలి తేలిపోనో
నా యూహ చక్రసుందరపరిభ్రమణమై యీ పొగమబ్బులనే వరించె
        యెన్ని పొగమబ్బు లెఱిఁగిలేనేను మున్ను?
        తూర్పుకనుమలు విడుచు నిట్టూర్పులట్టి
        విచటి యీ పొగమబ్బులే యెడఁదలోని
        లలితము మదీయ గీతి నేలా వెలార్చు?
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - koMDaviiTi poga mabbulu Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )