కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
ప్రోలరాజు వధ

9. ప్రోలరాజు వధ

మొదటి ప్రతాపరుద్రుఁడు ప్రోలరాజు కొడుకు. ఆ రోజులలో మత వైషమ్యము మెండు. జైనమతము నశించుచున్నది. కొద్దిరోజుల క్రిందనే బసవేశ్వరుని మత ముద్భవించినది. దానికిఁ తరువాత కొద్దినాళులలోనే పాల్కురికి సోమనాథుఁడు బసవ పురాణము వ్రాసినది. ప్రోలరాజు మొదట జైనుఁడు. జీవితాంతమున శైవుడైనాడు. మొదటి ప్రతాపరుద్రుఁడు వీరశైవమునంది మిక్కిలి తీక్ష్ణస్వభావుఁడై యుండెను.

మొదటి ప్రతాపరుద్రుని కాలములో కాకతీయ కాలములో కాకతీయ రాజ్యము మహోన్నతమైన స్థానము పొందెను.

"ఓహో చాలును బేలువోక కుమతవ్యూహంబులం జిక్కి నీ
యూహల్‌మానెదరోయిసాంబ! కరుణా వ్యుష్టిన్‌ విలోకించి దం
హోహారిన్‌ నిను దేవదేవుఁ డనలే డుగ్రాక్ష! నీ భక్తిలో
సోహం మార్గముపోఁడు నాస్తికత యెట్లోర్వంగనౌఁ జెప్పవే.
చెడుతలఁపుల్‌ ఫలించె శశిశేఖర! వేదములెల్ల మిథ్యటే
మృడ! నిగమాంతగోచరుఁడ వీ వొకరుండవ, యెంతమందియే
ర్పడిరి మతప్రవక్తలు శివా! ఋతమార్గము పొంతవోవఁడొ
క్కఁడు, నిఁక నేమికావలె నకాలపుమౌనము నీక యబ్బెపో!
చాలున్‌, మౌనము మించివచ్చినదిపో చక్షుఃశ్రవోభూష! క్షో
ణీలీలారథ! అస్థిహార! శివ! కంఠేకాల! మృత్యుంజయా!
శూలీ! దుష్టమతాంబువాహములు మించున్‌ సన్మతాబ్జార్క తే
జో లుంటాకములయ్యె, నీముదల వేచున్‌ భృత్యుడీశా! ప్రభూ!"
అనుచుఁ బ్రతాపరుద్రుఁడు శివాయతనంబున ధ్యానమగ్నుఁడై
మనమున వీరశైవశిఖ మంటలు గ్రమ్మఁగ మీలితాక్షుఁ డౌ
చు నిలిచె బద్ధహస్తుఁ డగుచున్‌ బరిశుద్ధత నందియొద్ద, ద
జ్జనకుఁడు ప్రోలరాజుశివసన్నిధికిన్‌ జనుదెంచె నత్తఱిన్‌.
ఆరబ్ధేశ్వరతాండవ భ్రమణపాదాంభోరుహస్రసమం
జీరంబో, గగనేందిరా కరపతచ్ఛ్రీకందుకంబో, పున
స్స్వారాజ్యచ్యుతభుక్తపుణ్యమగునక్షత్రంబొ నాఁ బశ్చిమా
శారత్నాకరమందుఁ గ్రుంకెను విషస్వద్బింబ మల్లంతలో
ఆ రాజేంద్రుఁడు ప్రోలభూమిపతి పశ్యత్ఫాలుసాన్నిధ్యమున్‌
జేరంబోవఁగ నుత్తరీయపుకొనల్‌ జీరాడ తద్వస్త్రవి
స్ఫారీభూత సమీర సంహతులఁ గోపజ్వాల పేర్చున్‌ మహా
క్రూరాభ్యుత్థితలేలిహాన మన సంరూఢోగ్ర రోషాత్ముఁడై.
పెగులుచున్న సాహసి పవిత్ర! హుతాశనదృఙ్మతంబుపైఁ
పగ గల యెవ్వఁడో నిజ తపఃపరిశుద్ధతఁ గల్మషంబు చే
యగఁ దనుముట్టవచ్చెనని, యాగ్రహఘూర్ణితతారకాక్షుఁడై
భగభగ మండిపోయి పితృవక్షము గ్రుచ్చెఁ గరాసి నుగ్రుఁడై
అల నిముసంబులోన బితృహంత కకారణ కోపపావకో
జ్వల పరిణామముల్‌ తెలిసివచ్చెను మిన్నును మన్ను నేకమై
తల తిరుగంగ మూర్ఛపడి తండ్రిపదంబుల యొద్ద, నంతలోఁ
దెలిసి వృథానితాంత పరిదేవనముం బొనరించె నీగతి\న్‌.
"నీ బాహాధనురగ్రయాయులయి తండ్రీ! తెన్గు లాశాంతముల్‌
రాఁబోగా నసివాళ్ళు జేసికొని రుగ్రంబైన నా బాకు క
ట్టాబాఢంబుగ నాటె నీ యెడద ఘంటామార్గముల్‌ శత్రురా
ట్ప్రాబల్యంబుల నింకఁ గట్టువడవో రాజన్యచూడామణీ!
హా! హా! యెంతటి క్రూరకర్మమున కేనైతిన్‌ శివా! తండ్రి! నీ
బాహానిర్జితు లెల్ల భూమిపతులప్పా! యట్టి నీవెట్లు తే
జోహీనంబగు నా కరాసిఁబడితీ శోకాఘముల్‌ పేర్చి పెన్‌
దాహం బై పొరిగాఁల్ప వేమిటికి వధ్యస్థానయోగ్యున్‌ ననున్‌.
ఈ పితృహంత వీఁడటవె యీపయి కాకతి రాజ్య భోక్త యీ
పాపము పేరుగా ప్రళయ పావకకీలలు నన్ను మ్రింగవౌ
రా! పరమేశ! తండ్రి రుధిరమ్మునఁ దోగిన చేతులన్‌ ధరి
త్రీ పరిపాలనమ్ము గడిదేరినదే! యిఁక నే ననర్హుఁడన్‌.
ఆయమ నిల్వనీడయిన దచ్చట కాకతి రాజ్యలక్ష్మి యా
నీ యెదుఱొమ్ము హీనుఁడను నీచుఁడ జేఁజుఱకత్తి దింపి తం
డ్రీ! యని పిల్చుచుంటి త్రప యెంతగ మాలినవాఁడ నన్‌ క్షమిం
తే యమపట్టణంబునకు నిప్పుడ పంపగ యోగ్యుఁడన్‌ జుమీ!
గర్భంబందునఁ దీపి నాపయిన వేగన్నుల్‌ ప్రసారింతు వీ
నిర్భాగ్యుండు నినున్‌ హరించెగద తండ్రీ! న్యాయమెందున్నదో
నిర్భిన్నమును గాదు దేహ మసువుల్‌ నిర్యాతముల్‌ కావు నా
దౌర్భాగ్యమ్మున కంతులేదుగదె యోత్రయ్యధ్వగోపాయితా!
ఈకృత్యంబునఁ జేసి వైరినయి యే నెట్టేగి దర్శించెదన్‌
నాకన్నన్‌ బితృహంత యెవ్వఁడు నవాంధ్ర శ్రీమహారాజ్యల
క్ష్మీ కల్యాణవతీ సపత్ని యయి లక్ష్మింబోలు నా తల్లి నా
శోకామంగళమూర్తి నేవిధమునన్‌ జూతున్‌ వచింపం గదే?"
అని మూర్ఛిల్లిన వీరరుద్రుని స్వకీయామాత్యు లా రీతిగా
జనకున్‌ బాపిరి, ఱేనికిన్‌ దహన సంస్కారమ్ము గావించి రా
ఘనుఁడౌ రుద్రనృపాలు జీవితములోఁ గన్పించనే లేదఁటా
తని యాస్యాంచలసీమలందు నవమందశ్రీస్మితాంకూరముల్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - proolaraaju vadha Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )